బాబు, పవన్‌లకు కలలుగనే అవకాశం మరో 10 రోజులే..

సీఎం వైయ‌స్ జగన్‌కు బాసటగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు

మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్ర ప‌న్నింది

ఎమ్మెల్యే పిన్నెల్లిని టీడీపీ టార్గెట్ చేసిన‌ట్లుగా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది

వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన లోకేశ్‌పై చ‌ర్య‌లేవీ..?

వైయ‌స్ఆర్ సీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి

తాడేప‌ల్లి: చంద్రబాబు, పవన్‌లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందని, పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్‌ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీఎం వైయ‌స్ జగన్‌ విజయానికి తొలి సంకేతమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ సీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఎక్కడా చీలిక లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం వైయ‌స్‌ జగన్‌కు బాసటగా నిలిచాయన్నారు. వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో గౌత‌మ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 
 
`పల్నాడు ప్రాంతంలో మాచర్లలో గొడవలకు తెరలేపి ఆ ప్రాంతాన్ని రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్నింది. దీనికి ఎన్నికల సంఘంలోని కొంత మంది సహకరిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, ఆందోళనలు కలిగేలా చేశారు. అందుకే ఎన్నికల కమిషన్‌లో దొంగలు పడ్డారని అనాల్సి వస్తోంది. మాచర్ల వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో చినకాకాని సమీపంలో టీడీపీ గూండాలు దాడిచేస్తే తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. విజయవాడకు చెందిన టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా మాచర్ల వెళ్లి పిన్నెల్లి మీద కర్రలు, రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించిన వీడియో అంటూ ఆయనను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేత లోకేశ్‌ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వరుస ఘటనలు చూస్తే నూటికి నూరు శాతం దుర్బుద్ధితో, కుట్ర పూరితంగా పిన్నెల్లిని టీడీపీ టార్గెట్‌ చేస్తోంద‌ని అర్థం అవుతుంది. ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయిగేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటించకుండా.. అదెలా బయటకొచ్చిందో విచారణ చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది.  

సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీ­డీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తె­లు­స్తోంది. అయితే వారి మీద ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశామని చెబుతున్న ఈసీ.. ఈ వీడియోను సంపాదించుకుని ఎక్స్‌లో పోస్టు చేసిన లోకేశ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు` అని గౌత‌మ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. 

Back to Top