తాడేపల్లి: దుష్టచతుష్టయం కుట్రలను ఛేదిస్తూ.. జనంలోకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పేరుతో వెళ్తుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రేపట్నుంచీ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 19 వరకూ గ్రామగ్రామాన చేపడుతామని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహిస్తామన్నారు. మా ప్రభుత్వంలో జరిగిన మేలుపై ‘ప్రజాతీర్పు’ సర్వేతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. సచివాలయాల వద్ద రియల్ డెవలప్‌మెంట్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఏకకాలంలో అధికారిక, పార్టీపరమైన ప్రచార కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వసలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటేః మ్యానిఫెస్టోనే గీటురాయిగాః వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఇప్పటిదాకా ప్రజలకు చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాల్ని దిగ్విజయంగా చేపట్టాం. మరోసారి ప్రజల దగ్గరకు వెళ్లే ఇంకో కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. మళ్లీ ప్రతీ గడపకూ వెళ్లి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఇప్పటిదాకా ఏం చేశాం.. భవిష్యత్తులో మనం ఎలా ముందుకు పోవాలనుకుంటున్నామనేది వివరించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో విభిన్న వర్గాలు వెలిబుచ్చిన ఆకాంక్షలు, ఆశలు, కోరికలను స్వీకరించి పార్టీ మ్యానిఫెస్టోను తయారు చేయడం జరిగింది. మ్యానిఫెస్టోనే ఒక పవిత్ర గ్రంథంలా భావించి అధికారంలోకి రాగానే దాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయగలిగారు. ఇప్పటికే మ్యానిఫెస్టో అంశాల్లో దాదాపు 99.5 శాతం పూర్తిచేయగలిగాం . భవిష్యత్తు ఎన్నికలకూ మ్యానిఫెస్టోనే గీటురాయిగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం. నిజమైన ప్రజాస్వామ్యం అంటే అర్ధమేంటో .. మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్షంగా చూస్తున్నాం. 1 కోటి 40 లక్షల కుటుంబాలకు సంక్షేమ లబ్ధిః వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఏం చేశామనేందుకు అందరూ సాక్ష్యులే. ఏదో ఒక వర్గానికి మాత్రమే లబ్ధి జరిగిందనుకుంటే మిగిలిన వారికి తెలియదనుకోవచ్చు. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకూ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన సంక్షేమ లబ్ధి అందినప్పుడు అందరికీ వాస్తవాలు తెలుస్తాయి. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు తాను రూపొందించిన మ్యానిఫెస్టో అమలు బాధ్యతను తానే భుజాలపై వేసుకుని.. సంక్షేమం, అభివృద్ధిపై తనదైన మార్కు ముద్ర వేశారు. మోడ్రన్ ఎకనమిక్స్ నిర్దేశిస్తున్న సిద్ధాంతాల ప్రకారం ప్రభుత్వ పరిపాలనను నడిపిస్తున్నారు. రాష్ట్రంలో 1 కోటి 60 లక్షల కుటుంబాల్లో దాదాపు 1 కోటి 40 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సంక్షేమ లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసి అందించారు. వివిధ రూపాల్లో ఆర్థిక వెసులుబాటును పొంది ఆయా కుటుంబాల్ని వారు మెరుగుపరుచుకోగలిగారు. అలాగే, ఆర్థిక, రాజకీయ, సామాజిక కార్యకలాపాల్లో ఆ కుటుంబాల ప్రమేయాన్ని పెంచుకుంటూ వచ్చాం. అదేవిధంగా రాష్ట్రంలోని మెజార్టీ వర్గాలైన పేద, బడుగు బలహీనవర్గాలను నిర్ణయాత్మక శక్తిగా మార్చగలిగాం. పేదలకు సంక్షేమం అందితేనే అభివృద్ధి సాధ్యంః రాష్ట్రంలో అందరికీ సంక్షేమమే అందిస్తున్నారంటూ సాధారణంగా కొందరి నోట అభిప్రాయం వినిపిస్తుంది. అయితే, జగన్ గారి ఆలోచన ఒకటే. పేదలకు సంక్షేమం అందినప్పుడే వారు అభివృద్ధిలోకి వస్తారు. కనుక, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుంది. సంక్షేమమే అభివృద్ధిగా మేం ఎంచుకున్న అంశాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లగలిగాం. సాక్ష్యాధారాలతో సహా ఈ నాలుగున్నరేళ్లల్లో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు రుజువు చేశారు. ఇందుకు ఆర్బీఐ వంటి కేంద్ర సంస్థల నివేదికలను కూడా సాక్ష్యాధారాలుగా తీసుకోవచ్చు. రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రపరిపాలన ఎంత మెరుగ్గా కొనసాగించామనేది ఎవరూ మరవలేనిదని గుర్తుచేస్తున్నాను. అంటే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు దాదాపు దెబ్బతిని కునారిల్లే పరిస్థితుల్లోనూ.. మనం వాటిని అధిగమించాం. కేవలం రెండున్నరేళ్లలోనే ప్రభావవంతమైన, మెరుగైన ఆర్థిక స్థితిని ప్రభుత్వం చూడగలిగింది. జీఎస్‌డీపీలో నెంబర్ 1 – తలసరి ఆదాయంలో 9వ స్థానంః అభివృద్ధికి సాక్ష్యాలుగా ఒకట్రెండు విషయాల్ని తీసుకుంటే, జీఎస్‌డీపీ లో.. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయిన నాటికి 22వ స్థానం ఉంటే.. 2021–22కల్లా మనం నెంబర్ 1వ స్థానానికి వెళ్లాం. ఇది రిజర్వు బ్యాంకు సర్టిఫై చేసి విడుదల చేసిన గణాంకాలు కనుక వీటిని ఎవరూ కొట్టి పారేయలేనివని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని నిద్రనటిస్తూ వక్రభాష్యాలు పలికే వారికి మేం చెప్పలేకపోయినా.. ప్రజలకు వాస్తవాల్ని వివరించాల్సిన బాధ్యత ఉంది కనుక వీటిని వారి ముందుకు తెస్తున్నాం. తలసరి ఆదాయంలోకొస్తే 2019 నాటికి 17వ స్థానంలో ఉంటే ప్రస్తుతం అది 9 వ స్థానానికి వచ్చింది. 4.93 లక్షల ఉద్యోగాలిచ్చాంః ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో కేవలం 34వేల పోస్టుల్ని భర్తీ చేయగలిగితే.. అదే జగన్ గారు అధికారంలోకొచ్చాక ఆర్టీసీ విలీనంతో కలిపితే రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 4.93 లక్షలు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగాల వివరాల్ని తీసుకుంటే 2 లక్షల 13వేల 662 మందికి అవకాశం దక్కింది. ఇంకా కొన్ని వ్యవస్థల్లో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలు నేరుగా సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులకు అవకాశాలిచ్చాం. వైద్యరంగంలో దాదాపు 50వేల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చాం. మరి, చంద్రబాబు అండ్ కో.. ఎక్కడ ఉద్యోగాలు అంటూ రోజుకోసారి ఎందుకు ఊదరగొడతారంటూ ప్రశ్నిస్తున్నాం. అగ్రికల్చర్ గ్రోత్‌రేట్‌లోనూ ముందంజః దాదాపు 62 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే, చంద్రబాబు హయాంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నింటిలోనూ ఆఖరు స్థానంలో ఉన్నాము. అదే వ్యవసాయరంగ అభివృద్ధిలో చంద్రబాబు హయాంలో మనం 27వ స్థానంలో ఉన్నాం. అంటే, గ్రోత్‌రేట్ మైనస్ 6.5 శాతం ఉంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం 6వ స్థానానికి చేరుకున్నాం. గ్రోత్ రేట్ ప్లస్ 8.2 శాతానికి చేరింది. దీన్ని రాష్ట్ర అభివృద్ధికి సూచికగా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీస్ గ్రోత్‌రేట్‌లో 12.8 శాతంః ఇక, పరిశ్రమల విషయానికొస్తే.. ఈరోజుకు రాష్ట్రంలో 12 లక్షల దాకా పరిశ్రమలు ఉంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి 9 లక్షలు ఉన్నాయి, అందులో కేవలం 40వేల పరిశ్రమలు మాత్రమే బాబు హయాంలో వచ్చాయి. అదే జగన్ గారు సీఎం అయ్యాక 2.5 లక్షల కొత్త ఎంఎస్‌ఎంఈ యూనిట్‌లు వచ్చాయి. 16.5 లక్షల కొత్త ఉద్యోగాలు యువతకు దక్కాయి. ఇదీ రియాల్టీ. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, సదుపాయాలు, సౌకర్యాల కల్పన వంటి ఎకో సిస్టం ఉండబట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుందని చెప్పుకోవచ్చు. గతంలో ఇలాంటి వాతావరణాన్ని చంద్రబాబు చూపించకపోవడంతోనే ఎలాంటి కొత్త పరిశ్రమ మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. చంద్రబాబు హయాంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ 3.2 శాతం ఉంటే, ఇప్పుడు అదే గ్రోత్ రేట్ దేశంలోనే 12.8 శాతంలో ఉన్నాం. అవికాకుండా నాలుగు భారీ పోర్టులు నిర్మాణమవుతున్నాయి. ఫిష్షింగ్ హార్బర్‌లతో పాటు రాష్ట్ర రహదారులు, సెంట్రల్‌హైవే నిర్మాణాలు పెద్ద ఎత్తున కొనసాగుతోన్నాయి. విద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యతః అమ్మఒడి, ఆసరా, చేయూత,చేదోడు, విద్యాదీవెనలాంటి పథకాలు, వ్యవసాయంపై ఆధారపడే రైతులకు రైతుభరోసా గానీ ఇవన్నీ రాష్ట్రంలో దాదాపు 1 కోటి 40 లక్షల కుటుంబాలకు అందలేదా..? వాటితో తమ కాళ్లపై తాము నిలబడే దశకు ఆయా కుటుంబాలు రావడాన్ని సంక్షేమం అందలేదని అనగలమా..? జగన్ గారు అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లల్లో దాదాపు రూ. 2.40 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమం జమ చేయడం, రాష్ట్రంలోని 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయడం, ఇళ్ల నిర్మాణాలనూ చేపట్టాం. వీటన్నింటికీ మించి విపరీతమైన ఖర్చుతో కూడిన విద్యా, వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సమూలంగా మార్పు చూపాం. దాదాపు రూ.16,700 కోట్లతో నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్లన్నింటినీ ఆధునీకరించడం, రూ.17వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రుల్ని ఆధునీకరించడంతో ప్రభుత్వ సర్వీసుల్లో బెస్ట్ అనిపించుకున్నాం. చేసిన మేలు చెప్పుకునేందుకు గర్విస్తున్నాంః రాష్ట్రంలో దాదాపు 1 కోటి 40 లక్షల కుటుంబాలకు మేలును అందించి, ముందెన్నడూ లేనివిధంగా అభివృద్ధి నిర్మాణాల్లో శరవేగంగా ముందుకు పోతున్న మా ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నాం. జగన్ గారు సీఎం అయ్యాక ఈ నాలుగున్నరేళ్లల్లో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు దక్కిన మేలును చెప్పుకునేందుకు మేమంతా గర్వపడుతున్నాం. దీని వెనుక జగన్‌మోహన్‌రెడ్డి గారి విజన్ గానీ పట్టుదల గానీ ఫలితాల్ని చూపించిందని చెప్పుకోవాలి. అందుకే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే ధీమాతో ముందుకెళ్తు న్నాం. దుష్టచతుష్టయ కుట్రల్ని చేధిస్తూః రాష్ట్ర అభివృద్ధి సూచికలుగా నిలిచిన సంక్షేమం, అభివృద్ధి పనులు ఇలా ఉంటే, మరోవైపు చంద్రబాబు అండ్ కో దుష్టపన్నాగాల్ని ఎప్పటికప్పుడు చేధిస్తూనే ముందుకెళ్తున్నాం. జగన్‌గారు అకుంఠిత దీక్షతో మ్యానిఫెస్టోను దిగ్విజయంగా అమలు చేస్తుంటే, మరోవైపు దుష్టచతుష్టయం శక్తులన్నీ ఒకటై కుట్రలు పన్నినా.. పచ్చమీడియా బురదజల్లే రాతలతో విష ప్రచారం చేసినా.. అందరూ ఏకమై చంద్రబాబు ఒక్కడికే అధికారం కట్టబెట్టాలని పాకులాడినా మేం ఎక్కడా ఆగకుండా, తొణకకుండా బెనకకుండా ఇప్పటివరకూ మా సంకల్పాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు మేం ఏం చేశామనేది, దుష్టచతుష్టయ కుట్రలెలా ఉన్నాయనే దాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్లబోతున్నాం. ఎవరూ కాదనలేని ఆధారాలతో ప్రజల ముందుకెళ్తున్నాం. గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లే కార్యక్రమాలుః జగన్ గారు పాలన మొదలైన దగ్గర్నుంచే మేం పార్టీ వరంగా అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాం. మా ప్రభుత్వం తాలూకూ పాలన స్వభావం ఇదని చెప్పే కార్యక్రమాల్ని చేపట్టాం. ప్రభుత్వ పథకాల అమలుతో ఏమేరకు ఉపయోగం ఉంటుందనే విషయాన్ని ప్రజలతో మమేకమై వివరించాం. అందులో భాగంగానే 2022 మే నెలలోనే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దగ్గర్నుంచీ జగనన్నే మా భవిష్యత్ అంటూ ఏప్రిల్ (2023)లో చేశాం. ఈ ఏడాది జూలై మాసంలో జగనన్న సురక్ష అనే ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ఇందులో 1 కోటికి పైగా ధృవీకరణ పత్రాలు జారీచేయడం, కొన్ని సమస్యల్ని తక్షణమే పరిష్కరించడంతో గడప దగ్గరకే ప్రభుత్వ సేవలు ఎలా అందుతాయనే విషయాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపగలిగాం. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరగుతుంది. రాష్ట్రంలో దాదాపు 12వేల జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు 6.4 కోట్ల ర్యాపిడ్ టెస్టులు జరిగాయి. ఇందులో 4 కోట్లమంది క్యాంపులకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు. కొంతమంది రిఫరెల్ గా పరీక్షలు చేయించుకున్నారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలలు వస్తుడడం, వైద్యులను, వైద్యసిబ్బందితోనూ సచివాలయాల వారీగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో లింకు చేసి సత్ఫలితాల్ని చూడగలుగుతున్నాం. ఇదే బాబు-పవన్ లు 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? చంద్రబాబు హయాంలో ఆయన చేసింది పరిపాలనే కాదు. తనకు తన మనుషులకు లాభం చేకూర్చే స్కీమ్‌ల పట్ల ఫోకస్ పెట్టి పనిచేయడం తప్ప ప్రజలకు మేలు జరిగిందేమీ లేదు. 2014 నుంచి 2019 వరకు అనేక మాయమాటలతో ప్రజల్ని ముంచాడు. ఎన్నికలకు ముందు ప్రకటించిన మ్యానిఫెస్టోను చెత్తబుట్ట దాఖలా చేశాడు. ఇప్పుడు మళ్లీ జనసేన నుంచి పవన్‌కళ్యాణ్ తో పొత్తు అంటున్నాడు. మరి, ఆనాడు పొత్తు పెట్టుకుని ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయనప్పుడు ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి పవన్‌కళ్యాణ్ నోరుమెదపకపోవడం అందరూ చూశారు. 2014లో ఇదే చంద్రబాబు- పవన్ కల్యాణ్ లు కలిసి ఉన్న ఫోటోలతో, మ్యానిఫెస్టోలో అక్కచెల్లెమ్మలకు 12 సిలిండర్లు ఇస్తామన్నాడు. మరి, ఇచ్చారా..? అంటే ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్లు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలో మూడో నాలుగో సిలిండర్లు ఇస్తామని చెబుతున్నాడు. మళ్లీ ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోతో వస్తున్నామంటున్నారు కనుక.. మరోసారి మోసకారి విధానాలతో వస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. రేపట్నుంచీ డిసెంబర్ 19 వరకు ‘వై ఏపీ నీడ్స్ జగన్’: రాష్ట్రంలో రేపట్నుంచీ వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మొదలవుతోంది. డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. జగన్ గారు ఏపీ ప్రజలకు ఎందుకు కావాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఇప్పటి వరకు జగన్ గారు సీఎంగా ఉండి ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమం, అభివృద్ధిని చెబుతూ.. ఇది చేశాం.. మాకు మీ ఆశీస్సులు కావాలంటూ ఒక రాజకీయ కార్యక్రమంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అని ప్రజల ముంగిటకు తీసుకెళ్లబోతున్నాం. అలాగే, జగన్ గారు పెట్టుకున్న సంకల్పాన్ని నెరవేరనీయకుండా.. ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందకుండా చేయాలని ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు, చంద్రబాబు దుష్ట ఆలోచనలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం పనిచేస్తుంది. 2014–19 ఎన్నికల మ్యానిఫెస్టోను చంద్రబాబు ఎలా తుంగలో తొక్కి మాయం చేశాడనే విషయాన్ని మేం ప్రజలకు వివరిస్తాం. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ తో ప్రధానంగా 4 కార్యక్రమాలుః ప్రజలకు చేరువయ్యే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా 4 అంకాలుంటాయి. వీటిలో మొదటిది 2వేల మంది జనాభా ఉన్న ప్రధాన కూడళ్లులో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, ప్రభావశీలురైన వారితో చర్చలు జరిపి అభిప్రాయాలు, సూచనల్ని స్వీకరిస్తాం. చంద్రబాబు అండ్ కో.. మరలా మోసపూరిత విధానాలతో ఎలా వస్తున్నారనేది వివరిస్తారు. రాత్రికి అక్కడ్నే బస చేస్తారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్.. ఆ మరుసటి రోజు అదే గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌లో పార్టీ నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులు నియమించిన సచివాలయ సారథులు, గృహసారథులు ఉంటారు. పార్టీ మద్ధతుదారులూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు. పార్టీపరంగా పార్టీ నేతలు, ప్రభుత్వపరంగా సచివాలయ సిబ్బంది ఎవరికి వారు ప్రజలతో నేరుగా మాట్లాడుతారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’లో ఇది ప్రధాన కార్యక్రమం. ఇందులో అక్కడక్కడా ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలు కూడా హాజరవుతూ ఉంటారు. ప్రభుత్వ బుక్‌లెట్‌ను వాలంటీర్లు ప్రజలకు పంపిణీ చేస్తారు. ‘ఆపు బాబు నాటకం.. జగనే మా నమ్మకం’ః డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీపరంగా గృహసారథులు పార్టీ తరఫున బ్రోచర్లును అందజేస్తారు. ఆనాడు చంద్రబాబు మోసకారి మ్యానిఫెస్టో హామీల్ని గుర్తుచేస్తూ.. ఆయన ఏ విధంగా మాయ చేశాడనే విషయంపై ‘ఆపు బాబు నాటకం.. జగనే మా నమ్మకం’ పేరిట ప్రజాతీర్పు పుస్తకంతో పాటు కొన్ని బ్రోచర్లు ప్రజలకు అందజేసి వివరిస్తారు. వాటిల్లో ఉన్న ప్రశ్నల్ని చదివి అభిప్రాయం తెలుసుకుంటారు. ఆ సర్వేలో వారి అభిప్రాయంలో జగన్ గారి పాలనపై సంతృప్తి చెందిందే ఒక ‘స్టాంపు’ ముద్ర వేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. రియల్ డెవలప్‌మెంట్‌పై అధికారికంగా డిస్‌ప్లే బోర్డులుః ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించే మరో కార్యక్రమం సచివాలయాల దగ్గర డిస్‌ప్లే బోర్డుల ప్రారంభోత్సవాన్ని జరుపుతాం. దీన్ని పొలిటికల్‌గా చూడకుండా.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగానే చూడాలి. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్ చార్జులు, ఆయా మండలాల పరిధిలోని గ్రామాల కీలక నేతలు కో ఆర్డినేషన్‌తో పాల్గొంటారు. పార్టీ మండలాధ్యక్షుని నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో అందరూ చురుగ్గా హాజరవుతారు. ప్రతీ సచివాలయాల దగ్గర ప్రభుత్వపరంగా మేం ఏం చేశామనేది డిస్‌ప్లే బోర్డుల్ని ప్రారంభోత్సవం చేస్తారు. డిస్‌ప్లే బోర్డుల్లో రియల్ డెవలప్‌మెంట్ గణాంకాలు ఉంటాయి. దీన్ని పబ్లిక్ ఫంక్షన్‌లా అధికారిక కార్యక్రమంగానే జరుపుతారు. ఇందులో పార్టీ పరంగానూ.. పార్టీలతో సంబంధం లేని వారూ కూడా పాల్గొనవచ్చు. జగన్ గారు సీఎంగా ప్రజలకు ఏం చేశారనేది ప్రభుత్వపరంగా మేం చెప్పుకోవడంలో తప్పేమీలేదు. అక్కడ పెట్టే డిస్‌ప్లే బోర్డుల్లో గణాంకాలు తప్పుగా ఉంటే ప్రజలే వ్యతిరేకిస్తారు కనుక.. రేపటి కార్యక్రమాల్లో విపక్షాలు ఆందోళన జరిపే అవకాశాలే లేవని గమనించాలి. ‘మంచి జరిగితేనే ఓటేయ్యండి’.. ‘వై ఏపీ నీడ్స్ జగన్ ’ పేరిట కార్యక్రమంలో పార్టీ పరంగా మేం ఇంత ధీమాగా ముందుకెళ్లడానికి ముఖ్యకారణం ఏమంటే, మా నాయకులు వైయస్ జగన్ గారు చెప్పే మాటే మాకు ఆదర్శం. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో మంచి జరిగిందని అనుకుంటేనే మీ బిడ్డ వైయస్ జగన్‌కు ఓటేయ్యండని .. మా నాయకులు ఏవిధంగా బహిరంగ సభల్లో ప్రజల్ని దమ్ముగా కోరతారో.. అదే మా నమ్మకం. రాష్ట్రంలోని మెజార్టీవర్గమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదల ఓటుబ్యాంకే లక్ష్యంగా వారికి జరిగిన మంచిని చెప్పుకుని మమ్మల్ని ఆశీర్వదించమని కోరడంలో తప్పేమీలేదు. ఎందుకంటే, మేము, మా ప్రభుత్వం పేదల పక్షాన పనిచేసిందనేది యథార్థమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.