వంచన, వెన్నుపోటు, అబద్ధానికి చిరునామా చంద్రబాబే

 
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

చంద్రబాబు జైల్‌లో ఉండటం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది

టీడీపీ స్టేక్‌ హోల్డర్స్‌ అంతా కలిసి నిన్న హైదరాబాద్‌లో ఈవెంట్‌ చేశారు

తెలంగాణ‌లో టీడీపీ బ‌లంగా ఉంటే ఎందుకు అక్క‌డ పోటీ చేయ‌డం లేదు?

టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలీ ఈవెంట్‌తో అందరికీ తెలిసింది

2019లో వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీహామీని నెరవేర్చారు

మేం సంక్షేమ పాలన అందించామని చెప్పి ప్రజల ముందుకెళ్తున్నాం

తాడేప‌ల్లి: వంచన, వెన్నుపోటు, అబద్ధం..వీట‌న్నింటికి చిరునామా చంద్రబాబేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. అవినీతే చంద్ర‌బాబు నీతి..వ్యవస్థల్లోకి వైరస్‌ల్లా చొచ్చుకెళ్లారని మండిప‌డ్డారు. టీడీపీ నేత‌లెవ‌రూ కూడా స్కిల్ స్కామ్ గురించి మాట్లాడ‌టం లేద‌ని, ఎంత సేపు టెక్నిక‌ల్ ఇష్యూ అంటూ 17ఏ గురించి మాట్లాడుతున్నారని త‌ప్పుప‌ట్టారు. స్కిల్ స్కామ్‌లో ఆధారాల‌తో స‌హా దొరికిపోయారు కాబ‌ట్టే చంద్ర‌బాబును అరెస్టు చేశార‌న్నారు. నిన్న హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలీ స్టేడియంలో టీడీపీ స్టేక్‌ హోల్డర్స్‌ అంతా కలిసి ఈవెంట్‌ చేశార‌ని, దీని కోసం ముందుగానే రిహార్స‌ల్ చేసిన‌ట్లు ఉంద‌న్నారు. ఈ ఈవెంట్‌తో టీడీపీ ఎవ‌రి పార్టీ అన్న‌ది ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌తీ అంశాన్ని నెర‌వేర్చార‌ని, ఆ ధైర్యంతోనే ఇవాళ సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

అర్థశతదినోత్సవ వేడుకల్లో టీడీపీః
చంద్రబాబు అరెస్టై 50 రోజులు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అర్ధశత దినోత్సవాన్ని నిన్న హైదరాబాద్‌ గచ్చిబౌలులో జరుపుకుంది. ఎన్టీ రామారావు పెట్టిన ఆ పార్టీలో దోపిడీదారులుగా చేరిన వారంతా సంపాదించుకున్న డబ్బుతో బాగా బలిసి కొత్తకొత్త వినోద కార్యక్రమాలు చేసుకుంటున్నారు. తమ నాయకుడు అవినీతి కేసులో ఆధారాలతో దొరికి జైలుకెళ్లిన సందర్భంలో వారు దాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారా.. ? అంటే, కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. ఏడుస్తున్నారా..? అంటే, అంతలోనే వాళ్లు నవ్వుకుంటున్నారు. ఒకరకమైన విచిత్రమైన పరిస్థితుల్లో విన్యాసాలు చేస్తున్నారు. 
సానుభూతి సరంజామా డ్రామాలవిః 
ఒక నేరపరిశోధన సంస్థ చంద్రబాబును అవినీతి కేసులో ఆధారాలతో సహా పట్టుకుంది. ఆయన ప్రస్తుతం కోర్టు రిమాండ్‌లో అంటే, జుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావాలంటే న్యాయస్థానంలో న్యాయపోరాటం చేసి తెచ్చుకోవాలి. అంతేగానీ, దాన్ని డీల్‌ చేయాల్సిన పద్ధతిలో డీల్‌ చేయకుండా ఎన్నికల్లో లబ్ధిపొందాలనే సానుభూతి సరంజామాతో వారు డ్రామాలాడుతున్నారు. 
వైఎస్‌ఆర్‌సీపీ న్యాయపోరాట విధానమిదిః
గతంలో మా నాయకుడు జగన్‌ గారిని సీబీఐ, ఈడీ కేసుల్లో రిమాండ్‌కు పంపినప్పుడు మేము న్యాయస్థానాల్లో పోరాటం చేశాం. ఆయనపై మోపినవి తప్పుడు కేసులని ఆధారాల్ని న్యాయస్థానాల ఎదుట చూపించి వాదించాము కనుకే, అన్ని కేసుల్లో బెయిల్‌ వచ్చింది. ఒక వ్యక్తిపై నేరం ఆపాదించినప్పుడు దాన్ని సమర్ధంగా ఎదుర్కొని సదరు న్యాయస్థానంలో ఏ తప్పు చేయలేదనే ఆధారాల్ని చూపెట్టాలి తప్ప.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లు వేడుకలు, పిచ్చికేకలు వేయలేదు. చట్టాల్ని గౌరవిస్తూ న్యాయస్థానాల్లో సమర్ధంగా వాదించి పోరాడి విజయం సాధించే దిశగా అడుగులు వేశాం.
ఆనాడు ప్రజాకోర్టులో విజయం మాదిః
అప్పట్లో తనమీద పెట్టిన తప్పుడు కేసులు గనుక ఈ పాయింట్‌ మీదనే ప్రజల్లోకి వెళ్లాలని జగన్‌ గారు అనుకోలేదు. మా పార్టీ స్టాండ్‌ కూడా దాన్ని తీసుకోవాలని ఆయన మాకు చెప్పలేదు. కనుక, అప్పట్లో మేము వైఎస్‌ఆర్‌ సీపీ తరఫున ఎలాంటి నిరసన వినోద కార్యక్రమాలు చేయలేదు. కక్షసాధింపు చర్యతో మా నాయకుడిపై కేసులు పెట్టారని చెబుతూనే.. అందుకు సంబంధించిన ఆధారాల్ని వివరించాం. మరోవైపు ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయగలుగుతామనే విషయాన్ని వివరించాం. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మా పార్టీ వైఖరి, మా నాయకుడి ఆలోచన, సంకల్పాన్ని ప్రచారం చేసుకున్నాం. తత్ఫలితంగా 2014లో మహాకూటమితో పోటీపడి 67 సీట్లు దక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా.. 2019 ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చాం. అది ప్రజాకోర్టులో విజయం సాధించిన చరిత్ర.
వైయ‌స్ జగన్‌ గారిపై ఉన్నవన్నీ తప్పుడుకేసులేః
 ఆరోజు వైయ‌స్‌ జగన్‌ గారిపై పెట్టిన కేసులన్నీ తప్పుడివేనని ఎవరైతే నేరపరిశోధన సంస్థలకు ఫిర్యాదులిచ్చారో అదే కాంగ్రెస్‌ నిజాన్ని ఒప్పుకుంది. అప్పటి నేరపరిశోధనా సంస్థ హెడ్‌గా పనిచేసిన అతను ఇప్పుడు రాజకీయాల్లో ఉండి ఆ కేసుల్లో నిజం అంతంతమాత్రమేనని చెబుతున్నారు. ప్రజలు కూడా జగన్‌ గారిపై మోపిన కేసులన్నీ తప్పుడివేనని నమ్మి.. తమను ఆదుకుని అక్కునజేర్చుకునే నాయకుడు అతనేనని ఎన్నికల్లో ఎన్నుకున్నారు. అధికార పీఠాన్ని ఎక్కించారు. ఇది వైయ‌స్‌ఆర్‌సీపీ తాలూకూ న్యాయపోరాటం విధానం.  
ఎన్నికలను ఎదుర్కొనే సత్తా కోల్పోయిన టీడీపీః
చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయాన్ని పూర్తిగా వదిలేసింది. ప్రజల్లోకి వెళ్లి వారి బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా ఏమేరకు పనిచేయాలనే స్పృహను కోల్పోయింది. వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాన్ని పక్కనబెట్టి.. ఎంతకాడికి, తమ అధినేతను జైల్లో పెట్టడమంటే, ప్రపంచంలోనే అన్నింటికన్నా పెద్ద ఉపద్రవమైనట్లు.. ఆయన పై కేసుల్ని ఉన్నపళంగా ఎత్తేయాలని.. నాటి ఆయన రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని అవినీతిని పట్టించుకోవద్దని రకరకాల విన్యాసాలు చేస్తుంది. ప్రజాక్షేత్రంలో ఇది హర్షించే పనేనా ..? అని అడుగుతున్నాను. ఎటూ తమ నాయకుడు చంద్రబాబు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయాడని నమ్మిన ఆ పార్టీ తమ భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేని పార్టీగా తెలుగుదేశం మిగిలిపోయింది. 
పెత్తందారీ వ్యవస్థల కంపెనీగా టీడీపీః
తెలుగుదేశం పార్టీ ఉంటేనే తమ బతుకులుంటాయనే వర్గమే నిన్న హైద్రాబాద్‌ గచ్చిబౌలిలో చొక్కాలు చించుకుని కేకలేసింది. అక్కడెవరూ నిన్న పేదలు కనిపించలేదు. అట్టడుగువర్గాల నుంచి పైకొచ్చిన వారైనా కనిపిస్తారనుకుంటే, అలాంటి వర్గమే ఆ వేదికపై నిల్చొనే అర్హతలేదన్నట్లు కార్యక్రమాన్ని జరిపారు. తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందనేది స్పష్టంగా తెలియాలంటే నిన్నటి కార్యక్రమ వేదికనే చెప్పుకోవాలి.  
వెల్‌ రిహార్సల్‌ ఈవెంట్‌ అదిః
పేరుకే అది చంద్రబాబు అరెస్టుకు నిరసన కార్యక్రమం. కానీ, గచ్చిబౌలిలో నిన్న జరిగింది మాత్రం వెల్‌ రిహార్సల్‌ ఈవెంట్‌గా చెప్పాలి. అరుపులు, కేకలు కొందరు.. చొక్కాలు చింపి చిత్రవిచిత్రంగా బోర్లాపడుకుని విన్యాసాలు చేసేది మరొకరు.. ఏడుపులు, నవ్వులతో మరికొందరు కలిసి బాగా ముందుగానే రిహార్సల్స్‌ చేసుకుని వేదికపై రక్తికట్టించే ప్రయత్నం చేశారు. సరే, అక్కడ ఇలా చేసిందంతా ఎవరయ్యా అంటే, పక్కరాష్ట్రాల నుంచి వచ్చిన పెయిడ్‌ ఆర్టిస్టులు. ప్రజలకు సేవ చేయాలని పెట్టుకున్న రాజకీయ పార్టీ ఈ విధమైన విన్యాస వినోద వేడుకల ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది. ఆ పార్టీ నేతల తీరును చూసి ప్రజలు నవ్వుకుంటూనే అసహ్యించుకుంటున్నారు. పైగా, ఈ వేడుక నిర్వహించింది కూడా తెలంగాణ రాష్ట్రంలో. అంటే, మీ పార్టీకి బలం అక్కడ్నే ఉందనా..? మరి, ఈరోజు చూస్తేనేమో టీడీపీ తెలంగాణలో పోటీచేయడం లేదని ప్రకటించుకున్నారు. పక్కరాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్న ఈ కార్యక్రమంతో ఆంధ్రరాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని.. కేవలం, టీడీపీ ఓనర్షిప్‌ వర్గం చేసుకున్న ఒక ఈవెంట్‌గానే చూడాలని వారికి వారే చెప్పుకున్నారు. 
ఆంధ్రరాష్ట్రంపై ఇసుమంత ప్రేమలేదుః
గతం కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని చూస్తుంటే, చంద్రబాబు ఇన్నాళ్లూ ఏ వర్గం కోసం పనిచేశాడనేది అర్ధమౌతుంది. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ సిద్ధాంతమేంటో కూడా ప్రజలకు తెలిసిపోయింది. కేవలం, పెత్తందారీ వర్గానికే కొమ్ముకాసి.. వారు ధనవంతులుగా ఎదగడంలో చంద్రబాబు పాత్ర ఉంది కనుక ఇప్పుడు వారంతా ఆయన్ను కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నారని అర్ధమైంది. ఈక్రమంలో ఆయన మీద క్రిమినల్‌ కేసు ఉందనే సంగతిని, ఆంధ్రరాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవడం మానేసి ప్రవర్తిస్తున్నారు. వారికి ఇక్కడ ప్రజల ఆదరణ అవసరంలేదన్నది వారి ఆలోచన. ఈ ప్రాంతంపై ప్రేమను ఎందుకు చూపాలని.. ఇక్కడి ప్రజల్ని కూడా దోషులుగా చిత్రీకరించి చూస్తున్న వాతావరణానికి నిన్నటి కార్యక్రమమే వేదికైంది. 
బాబును ప్రజలు 2019లోనే వదిలేశారు:
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ కలిసి 2014లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి మ్యానిఫెస్టో హామీల్ని అమలు చేయలేక ప్రజల్ని మోసం చేశారు. ఎక్కడ ప్రకటించిన 650 హామీలపై తమను నిలదీస్తారేమోననే భయంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి కూడా మ్యానిఫెస్టోను తొలగించుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాల్ని సైతం మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి ఆయా వర్గాల్ని మోసం చేశారు. కనుకే, 2019 ఎన్నికల్లో టీడీపీని, చంద్రబాబును నమ్మలేక ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి మద్ధతిచ్చి జగన్‌గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. ప్రధానంగా రైతులు, డ్వాక్రా మహిళలు ఆనాడే చంద్రబాబు పూర్తిగా పక్కనబెట్టారు. వైఎస్‌ఆర్‌సీపీకి అండనిస్తే.. జగన్‌గారు అక్కున జేర్చుకుంటారనే నమ్మకం చూపారు. ఆమేరకు మేము ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రకారం ఇప్పటికే 99.8 శాతం అమలు చేసి ప్రజాదరణలో ముందంజలో ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోనూ విజయదుందిభి మోగించేందుకు సిద్ధంగా ఉన్నాం. నిజానికి, ప్రజల్లో ఉనికి కోల్పోయిన టీడీపీ మమ్మల్ని ఎదుర్కొనే స్థాయిలోనూ లేదనేది సర్వేల్లో వస్తున్న నిజం.  
దెబ్బతిన్న చంద్రబాబు మేనేజ్‌మెంట్‌ వ్యవస్థః
ఇన్నాళ్లూ చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌మెంట్‌ చేసుకుంటూనే అధికారంలో చక్రం తిప్పాడు. అనుభవం అని చెప్పుకోవడం వెనుక అసలు నిజమిది. ఇప్పుడు ఆ మేనేజ్‌మెంట్‌ పనిచేయడానికి వీలైనన్ని పరిస్థితులు కుదరలేదు. దీంతో అటు చంద్రబాబు వర్గం, టీడీపీ నేతలు కలిసి బరితెగించి మాట్లాడుతున్నారు. తమ లైజినింగ్‌ పావులు కదలడంలేదనే అక్కసుతో జగన్‌గారిపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు కొడుకు లోకేశ్‌ అన్నట్లు జగన్‌గారికి వ్యవస్థల్ని మేనేజ్‌మెంట్‌ చేసే అలవాటు ఉండి ఉంటుంటే.. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ఎందుకు మౌనంగా కూర్చొంటారు..? అంటే, మీరు చేసిన మేనేజ్‌మెంట్‌ లక్షణాలే అందరికీ ఉంటాయని.. ఆమేరకు తాము దొంగల్లా ఇరుక్కుపోయామనే భయంతో ఉన్నారు. ఇవన్నీ ప్రజల్లో చర్చకొస్తున్న అంశాలే. అందుకే, ఈరోజు చిన్నపిల్లోడ్ని కదిలించినా.. చంద్రబాబు దొంగేనని.. ఇన్నాళ్లకు పాపం పండిందని చెబుతున్నాడు. రాజకీయ కక్షసాధింపు అనేది మాకు అబ్బేది కాదు. సూటిగా ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనే మొనగాడిగా జగన్‌గారికి ఉన్న గుర్తింపును ప్రజల్లో నుంచి తొలగించలేనిది. టీడీపీ నేతలు ఆరోపించినంత మాత్రానా వారి మాటల్ని నమ్మేంత అమాయకులెవరూ లేరు. 
న్యాయపోరాటం కాదు.. వారిది ఉనికి కోసం ఆరాటం:
అవినీతి కేసులో అడ్డంగా బుక్కై జైల్లో ఉన్న చంద్రబాబును బెయిల్‌పై తెచ్చుకునే న్యాయపోరాటాన్ని పక్కనబెట్టి.. ఒక పక్క ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మరోవైపు ఆమె సోదరి బీజేపీ తరఫున పురంధేశ్వరి, ఇంకోవైపు టీడీపీ బ్రాంచిపార్టీ జనసేన పవన్‌కళ్యాణ్‌లు కలిసి ప్రభుత్వంపై, గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్‌ ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో.. ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఉంది. వీరందర్నీ పక్కనబెడితే, టీడీపీని ఓన్‌ చేసుకున్న పెత్తందారీ సొంతవర్గం పైశాచికత్వ కార్యక్రమాలతో పక్కరాష్ట్రాల్లో ఉనికిని చాటుకుంటున్నారు. అది వారి పార్టీ వ్యక్తిగతం. గతంలో ఆ పార్టీలు అధికారం వెలగబెట్టినప్పుడు ప్రజలకు చూపించిన గుండుసున్నాను వారు మరలా చూడటానికి ఇష్టపడటం లేదు.  
సామాజిక యాత్రకు అనూహ్యస్పందనః
ప్రజల మధ్య ఉంటూ.. వారికి సేవలందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో మరోమారు అధికారంలోకి వచ్చే విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ చాలా స్పష్టతతో ఉంది. మా నాయకులు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలు దీవిస్తున్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం దగ్గర్నుంచీ నేడు రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తమకు ఈ ప్రభుత్వం ద్వారా అందిన మేలు గురించి తమంత తాము స్వయంగా ముందుకొచ్చి చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో రియల్‌ ఎంపవర్‌మెంట్‌ అనేది ప్రజలు చూస్తున్న నిజమిది. నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా డీబీటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇప్పటికే అందిన రూ.2.38 లక్షల కోట్లుతో పాటు రైతులు, మహిళలు తమకు కల్పించిన సామాజిక న్యాయపరమైన లబ్ధిని దృష్టిలో ఉంచుకుని ఆ ఫలాల్ని నెమరువేసుకుంటున్నారు. పార్లమెంట్‌లో సహా పలు అంశాలపై ఆయా వర్గాలకు మేలుకలిగేవిధంగా వైయ‌స్‌ఆర్‌సీపీ గళం విప్పిన సందర్భాల క్రమంలో ఈరోజు వాటినన్నింటినీ ప్రజల ముందుకు తెచ్చే దిశగా ‘సామాజిక సాధికారత యాత్ర’ విజయవంతంగా జరుగుతుంది.
175 స్థానాల్లో మాపార్టీ గెలుపు ఖాయంః
ప్రభుత్వ పరిపాలనను ఇంటి గడపలోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ, నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యాసంస్కరణలు, వైద్యసదుపాయాల్లో మార్పులు, ఉచిత ఇళ్ల పంపిణీ ఇలా అనేకమైన మేలురకమైన లబ్దిని దృష్టిలో ఉంచుకుని  మళ్లీ వైయ‌స్ జగన్‌గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలు ఉవ్విళూరుతున్నారు. ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమలేని పెత్తందార్లుగా టీడీపీ, జనసేనలను ఎంచుకున్నారు కనుకే ఆ రెండు పార్టీల కార్యక్రమాలకు ఎక్కడా జనస్పందన కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్టుకు సానుభూతి కూడా దక్కకపోవడంతోనే ఆయన్ను నమ్ముకున్న సొంతవర్గం పైశాచిక కార్యక్రమాల్లో ఉండగా.. వైయ‌స్‌ఆర్‌సీపీ విధానపరమైన నిర్ణయాల పట్ల ప్రజలు మొగ్గుచూపుతున్నారు. కనుకే, వచ్చే ఎన్నికల్లో 175కి 175 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించడం ఖాయం. 
Back to Top