తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను పార్టీ నేతలందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆహ్వానకమిటీ కన్వీనర్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్లీనరీ ఆహ్వానకమిటి సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి,పార్టీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు, పార్టీ
ఎస్సి సెల్ ఛైర్మన్ మేరుగ నాగార్జున, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజని, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రిరాజశేఖర్, పార్టీ వాణిజ్యవిభాగం అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్లీనరీకి సంబంధించి పలు అంశాలను పూర్తి స్ధాయిలో సమీక్షించారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్లీనరీ సమావేశాలతో పార్టీ ప్రతిష్ట ఇనుమడించాలనే విధంగా పనిచేయాలనే భావనతో ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తమ హృదయాలలో పదిలపరుచుకున్నారు. అందుకే సాధారణ ఎన్నికలలో కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చారు.అంతేకాదు స్దానిక సంస్ధల ఎన్నికలలో సైతం 80 శాతం మంది ప్రజాప్రతినిధులు పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈ విధంగా దేశంలోని మరే రాష్ట్రంలో లేదన్నారు. ప్రజల ఆదారాభిమానాలు ఇంతగా చూపుతున్న ఈ తరుణంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు కాబట్టి వారి అంచనాలు అందుకునే విధంగా అందరూ పనిచేయాలని అన్నారు.