తాడేపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళను సర్వనాశనం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున మండిపడ్డారు. పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగు రావాలని గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్ జగన్ అమలు చేసిన పలు కార్యక్రమాలను నిలిపివేస్తూ, పేద విద్యార్ధుల జీవితాల్లో చంద్రబాబు విషం చిమ్మతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తూ, తనకు అనుకూలమైన ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు చంద్రబాబు దుర్మార్గమైన విధానాలను అమలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మెరుగు నాగార్జున ఆక్షేపించారు. విద్యార్థులకు వేల కోట్ల ఫీజు బకాయి పడిన కూటమి ప్రభుత్వం, ఈరోజు విద్యార్దుల తల్లిదండ్రులతో మెగా మీట్ అంటూ కొత్త నాటకానికి తెర తీసిందని మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం: జగన్‌గారి ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా రంగం ఉన్నత శిఖరాలకు వెళ్లాలని, పేద విద్యార్ధుల స్థితిగతులు మెరుగుపడాలని అనేక కార్యక్రమాలను అమలు చేశారు. అలా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు జగన్‌గారు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా రూ.12 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చివేశారు. ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థలకు థీటుగా ప్రభుత్వ పాఠశాలు తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని 45వేల పాఠశాలలు, హాస్టల్స్ నేడు సర్వాంగ సుందరంగా, విద్యా పరిమళాలను వెదజల్లుతున్నాయంటే దానికి జగన్‌గారు ఇచ్చిన ప్రాధాన్యత, చేసిన కేటయింపులే కారణం. చంద్రబాబు ఏనాడూ ఆ పని చేయలేదు: జగన్‌గారు అభివృద్ధి చేసిన స్కూళ్ళలో కూర్చుని, సీఎం చంద్రబాబు విద్యార్ధుల భవిష్యత్తుపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. మూడు సార్లు సీఎంగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడైనా విద్యా రంగాన్ని ఆధునీకరించాలని అనుకున్నారా? కనీస వసతులకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాలని భావించారా?. జగన్‌గారు తన పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఇంగ్లిష్ మీడియమ్ అందించారు. సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెట్టారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పరిచయం చేశారు. తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) తీసుకువచ్చారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చారు. మధ్యాహ్న భోజనాన్ని గోరుముద్దగా మార్చి రోజుకో మెనూతో పౌష్టికాహారం అందించారు. ఇంటి భోజనం కన్నా ప్రభుత్వ స్కూళ్ళలో రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించిన ఘనత జగన్‌గారికి దక్కుతుంది. చంద్రబాబు ఏనాడైనా, ఇలా ఒక్కటంటే ఒక్కటైనా కనీసం ఆలోచన చేశారా?. ఈ మీట్‌లో చంద్రబాబు అది వివరిస్తారా?: మెగా పేరెంట్స్ మీట్‌లో చంద్రబాబు ఏం చెబుతారు? జగన్‌గారి హయాంలో మీ పిల్లలకు అందించిన ఇంగ్లీష్ మీడియంను నిలిపివేశాను అని, సిబిఎస్‌ఈ విధానానికి మంగళం పాడానని, గోరుముద్దను పక్కన పెట్టి నాసిరకం భోజనం పెడుతున్నామని పేరెంట్స్‌కు వివరిస్తారా?. నాడు–నేడు కింద జగన్‌గారు ఆధునీకరించిన ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకువెళ్ళి, ఎటువంటి సదుపాయాలు లేని నిర్మాణాలుగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారా? అసలు చంద్రబాబు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల పట్ల ఏనాడైనా ప్రేమ చూపించారా? వారి భవిష్యత్తు బంగారుమయం చేయాలని అనుకున్నారా? చంద్రబాబుకు ఆ అర్హత ఉందా?: కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే విద్యార్థులకు రూ.3900 కోట్ల బకాయి పడింది. విద్యార్థులకు ఫీజు చెల్లించడం లేదు. వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు. విద్యాదీవెన కింద రూ.2800 కోట్లు, వసతిదీవెన కింద మరో రూ.1100 కోట్లు బకాయి పడ్డారు. పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహిస్తూ అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చిన చంద్రబాబు, దాన్నీ అమలు చేయడం లేదు. ఇన్ని దుర్మార్గ పనులతో విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబుకు ఈ రోజు విద్యార్ధుల తల్లిదండ్రులతో మెగా మీట్ పెట్టే అర్హత ఉందా? పేదలు ప్రభుత్వ స్కూళ్ళలో మంచి చదువులు చదువుకోవద్దు. తమకు సంబంధించిన వారి ప్రైవేటు విద్యాసంస్థల్లో, భారీగా ఫీజులు చెల్లించిన వారికే మంచి విద్య అందాలనే దృక్పథంతో చంద్రబాబు ఉన్నారు. వర్సిటీలను రాజకీయ మయం చేసిన చంద్రబాబు: విద్యా రంగంలో కీలకమైన విశ్వవిద్యాలయాలను సీఎం చంద్రబాబు రాజకీయమయం చేశారు. సాధారణంగా యూనివర్సిటీకి ఒకసారి వైస్ ఛాన్సలర్‌ను నియమిస్తే, వారు ఆ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా రంగంలో కూడా రాజకీయ కక్షలను అమలు చేసింది. ఏకంగా 20 మంది వైస్ ఛాన్సలర్స్‌ను భయపెట్టి రాజీనామా చేయించింది. తమ వారిని ఇన్‌ఛార్జ్ వీసీలుగా నియమించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశాలకు తిలోదకాలు ఇచ్చారు. ఉన్నత విద్యా రంగాన్ని పర్యవేక్షించాల్సిన స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ విధానాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. కూటమి ప్రభుత్వ చర్యల వల్ల అర్హత ఉన్న రీసెర్చ్ స్కాలర్లు, పీహెచ్‌డిలు చేసిన విద్యావంతులు రోడ్లపైన తిరుగుతున్నారు. అటు టెక్నికల్ విద్యను, పాఠశాల విద్యను కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున వివరించారు.