మండలి రద్దుకు చంద్రబాబే కారణం

త్వరలోనే శాసన మండలి రద్దు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

మీడియా పాయింట్‌: శాసన మండలి రద్దుకు చంద్రబాబే కారణమని, సాధ్యమైనంత త్వరలోనే శాసన మండలి రద్దు అవుతుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. శాసన మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తరువాత ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. నందమూరి తారక రామారావు అప్పట్లో మండలిని రద్దు చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మండలిని పునరుద్ధరించారు. మళ్లీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండలిని రద్దు చేస్తున్నారు.ఈ పరిణామాలు గమనిస్తే..కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతున్నాయి. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పడిన  వైయస్‌ఆర్‌సీపీ ఆయన ఏర్పాటు చేసిన మండలిని ఎందుకు రద్దు చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వారికి సమాధానం ఇదే..కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే కాదు..డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా మండలిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేసి విఫలమైంది. వైయస్‌ఆర్‌ సీఎం అయిన తరువాత కాంగ్రెస్‌ ఆ నిర్ణయం తీసుకొని 2007లో పునరుద్ధరించింది. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని ఆ రోజు వైయస్ఆర్‌ అమలు చేశారు. వైయస్‌ఆర్‌ వారసుడిగా వైయస్‌ జగన్‌ వచ్చారు..కాంగ్రెస్‌ వారసుడిగా కాదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన  తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఆరోజు ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ తీసుకుంది. వైయస్‌ఆర్‌సీపీకి మండలిని రద్దు చేయాలనే ఆలోచన ఎన్నికలకు ముందు లేదు. ఎన్నికల తరువాత అనివార్యమైన పరిస్థితిని కల్పించింది మండలిలో ఉన్న టీడీపీ నాయకత్వం. శాసన సభ చేసిన అభిప్రాయాలను మండలిలో చర్చించి తిరిగి పంపించవచ్చు. వైయస్ఆర్‌సీపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. వైయస్‌ జగన్ నాయకత్వంలో కీలక నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధించి, రాష్ట్రంలో కనీవిని ఎరుగని సుపరిపాలన, నీతివంతమైన పాలన తీసుకోవాలన్నదే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యం. ఏడు నెలల్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజలకు చేరువయ్యాం. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లను, ఇంగ్లీష్‌ మీడియం అమలు వంటి బిల్లులను మండలిలో ఆపాలని ప్రయత్నం చేసింది. మండలిలో ఒక పేచీకోరుతనం ఉంది. బిల్లులను పాస్‌ కాకుండా ఆలస్యం చేయడం. అభివృద్ధిని అడ్డుకోవడం మండలిలో జరుగుతుంది. దుర్భుద్ధితో కావాలనే అడ్డుపడుతుండటంతో మరో మార్గం లేక మండలిని రద్దు చేస్తున్నాం. ఫలితాలను ప్రజలకు చూపించాలని ఆరాటపడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షం అడ్డుపడుతోంది.  కేవలం 23 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరో ఏడాది పోతే మాకే మెజారిటీ ఉంటుంది. అయినా కూడా మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. వైయస్‌ జగన్‌ వ్యవస్థలను మేనేజ్‌ చేసే వ్యక్తి కాదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడిన వ్యక్తి. ఏది చేయాలో దాన్ని చేస్తారు. గతంలో చంద్రబాబు మండలి రద్దుపై మాట్లాడింది మరిచిపోయారు. చంద్రబాబు ఇవాళ సభకు రాలేదు. తన వాదనను వినిపించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారు. ప్రజాస్వామ్యంలో తన వాదన వినిపించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. మేం ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారని మాపై తప్పుడు కథనాలు రాయించారు. ఎమ్మెల్సీలను కొని మమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం, దుర్భుద్ది లేదు. మండలి రద్దు అయితే రద్దైన ఎమ్మెల్సీలకు చంద్రబాబు అన్ని విధాల సాయం చేస్తామని చెబుతున్నారు. ఏమిటీ దిగజారుడు రాజకీయాలు? ఇది సమంజసం కాదు. వేగవంతమైన పరిపాలన అందించాలన్నదే వైయస్‌ జగన్‌ ధ్యేయం. నిరోధకశక్తులను పక్కకు నెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలిలో మేధావులు ఉన్నారు. మేధావులు కానీ వారు ఉన్నారు. లోకేష్‌ మండలికి ఎంపిక కావడం ధర్మమేనా?. రాజకీయంగా అఆలు రాని వ్యక్తిని తీసుకెళ్లి పెద్దల సభలో పెడితే ఏం ధర్మం? రాజకీయంగా నిరుద్యోగ సమస్య తీర్చేదా?. పెద్దల సభ చాలా పవిత్రమైన సభ. ఈ సభకు లోకేష్‌ లాంటి వ్యక్తులు వెళ్తే భ్రష్టుపట్టిపోతుంది. టీడీపీ దీనికి బాధ్యత వహించాలి. నాలుగు రోజులు అలస్యమవుతుందే కానీ, తప్పనిసరిగా మండలి రద్దు అవుతుంది. సాధ్యమైనంత త్వరలోనే సభ రద్దు అవుతుందని మేమంతా విశ్వాసంతో ఉన్నాం. మంచి మెజారిటీతో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందింది. చంద్రబాబు చెప్పే అనైతిక మాటలు నమ్మొద్దని ప్రజలకు అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. 

Back to Top