నీచ సంస్కృతికి మర్రి విత్తనం చంద్రబాబు

70 ఏళ్ల విషవృక్షం, పుకారుకు మారుపేరు

సీఎం వైయస్‌ జగన్‌ టార్గెట్‌గా సోషల్‌ మీడియాలో టీడీపీ విషప్రచారం

2 వేల మందిని నియమించుకున్న చంద్రబాబు

చంద్రబాబూ నువ్వు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తివేనా..?

తిరుపతిలో సీఎం సంతకం పెట్టకపోవడం ప్రజల అంశమా?

దుర్గా, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలు చేయించింది చంద్రబాబే..

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రామచంద్రయ్య

తాడేపల్లి: నీచ సంస్కృతికి మర్రి విత్తనం లాంటివాడు చంద్రబాబు.. అనుభవం అని చెప్పుకునే 70 ఏళ్ల విషవృక్షం చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సీ.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చేయించిన దుష్ప్రచారంపై విచారణ చేస్తే.. ఇది వ్యక్తులుగా చేసింది కాదు.. ఒక వ్యవస్థలా చేయించారని తేలిందన్నారు. దాదాపు 2 వేల మందిని నియమించుకొని హైదరాబాద్‌లోని ఎన్‌బీకే బిల్డింగ్, టీడీపీ ఆఫీసు, విజయవాడలోని సోషల్‌ మీడియా కార్యాలయం నుంచి వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఇంత దిగజారిపోయావు చంద్రబాబు నువ్వు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తివేనా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీ.రామచంద్రయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్‌ మీడియాలో తెలుగుదేశంపార్టీ వారిపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారని, వాటన్నింటినీ చంద్రబాబు చదివి వినిపించాడు. సోషల్‌ మీడియా అనేది కీకారణ్యం. అందులో ఎవరైనా అసభ్యంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే. ఎక్కడో ఉన్న పోస్టింగ్‌లోని పచ్చిబూతును చదివి వినిపించి చంద్రబాబు దిగజారిపోయాడు.

వ్యక్తుల నైతికతమీద లేనిపోని దుష్ప్రచారం చేసి నీచ సంస్కృతికి మర్రి విత్తనం చంద్రబాబు, 40 ఏళ్ల విషవృక్షం. జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, నరేంద్రమోడీలపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడాడు. చివరకు టీడీపీ ఫౌండర్‌ ఎన్టీఆర్‌పై కూడా ఇష్టం వచ్చినట్లుగా రాయించి కించపరిచాడు. పుకారుకు మారుపేరు చంద్రబాబు. దాదాపు 2 వేల మందిని నియమించుకొని హైదరాబాద్‌లోని బాలకృష్ణ ఇల్లు, ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్, విజయవాడలోని సోషల్‌ మీడియా కార్యాలయం ద్వారా సీఎం వైయస్‌ జగన్, ఆయన కుటుంబం టార్గెట్‌గా చంద్రబాబు విషప్రచారం చేయించాడు. కాబట్టి ఇది సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు.. వైయస్‌ జగన్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రపూరితంగా చేయిస్తున్న ప్రచారమని మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మహాయజ్ఞంలా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారని రామచంద్రయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.74 లక్షల మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేలు ఖాతాల్లో జమ అయ్యాయి. రెండు రోజుల క్రితం 1.35 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఈ నెల 15వ తేదీన రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా కింద రూ. 12,500, 10వ తేదీన కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారన్నారు. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన అంశాలు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయం అని చంద్రబాబుకు సూచించారు.

23 సీట్లుతో ఘోరమైన పరాజయం పొందాననే ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని రామచంద్రయ్య ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తిరుపతికి వెళ్తే సంతకం పెట్టలేదని ప్రజలకు సంబంధం లేని అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాడన్నారు. తిరుపతికి వెళ్లిన వ్యక్తికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం కానీ, సంతకం అనేది ప్రజలకు సంబంధించిన అంశం కాదని సూచించారు. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడన్నారు.

గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో సదావర్తి భూములు 80 ఎకరాలు స్కామ్‌ జరిగింది.  విజయవాడలో 40 దేవాలయాలు పడగొట్టాడు. కనకదుర్గమ్మ భూములు అనుకూలమైన వారికి రాయించాడు. బాబు హయాంలోనే అమ్మవారి కిరీటం కూడా అపహరణకు గురైంది. దుర్గమ్మ ఆలయం, శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలు చేయించింది చంద్రబాబే. వైయస్‌ జగన్‌కు ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు రావు. చివరకు వెంకన్న ఆలయంలో పోటును తవ్వించాడు. ఇది ధర్మమా..? ఇదేనా భక్తి, గౌరవం..? ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.  

ప్రజలకు సంబంధం లేనివి అంశాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని రామచంద్రయ్య అన్నారు. గత దివాళా కోరు ప్రభుత్వం వల్లే ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు సంతకంతో ఏం పని చంద్రబాబూ..? అని ప్రశ్నించారు. కానీ, ప్రజలకు సంబంధించిన సంతకాలు కొన్ని ఉన్నాయని.. వాటిని విస్మరించడం వల్లే చంద్రబాబును ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. మొదటి సంతకంతోనే రైతు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మొదటి సంతకంతోనే చేనేత రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో ఉన్న బంగారం విడిపిస్తానని చంద్రబాబు మాట ఇచ్చాడు. మొదటి సంతకంతోనే బెల్టుషాపులు రద్దు చేస్తానన్నాడు. మొదటి సంతకంతోనే ఎన్టీఆర్‌ సృజల స్రవంతి పేరుతో రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చాడు. ప్రజలకు వాగ్దానం ఇచ్చి దాన్ని అమలు చేయకపోతే అది ప్రజలకు సంబంధించిన విషయం. ఏ మాత్రం ప్రజలకు సంబంధం లేని అంశాన్ని తీసుకొని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

   
Back to Top