జయహో బీసీ.. నినాదం చంద్రబాబు అబ్బసొత్తు కాదు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి
 
రాబోయేకాలంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహాసభలు కూడా.. 

 బీసీల్లో ఇంటికో విద్యావంతుడు ఉండాలన్నదే సీఎంగారి లక్ష్యంః మంత్రి బొత్స సత్యనారాయణ

 మూడున్నరేళ్ళలో బీసీవర్గాలకు రూ.1లక్షా 65 వేల కోట్లు ఇచ్చాం.

 వైయ‌స్‌ఆర్‌సీపీకి బలహీనవర్గాలే వెన్నెముక.. బీసీల అభివృద్ధి మా బాధ్యత.

 మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ‌: జయహో బీసీ.. నినాదం చంద్రబాబు అబ్బసొత్తు కాదని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  బలహీనవర్గాల ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే లక్ష్యంగా ‘జయహో బీసీ మహాసభ – వెనుకబడిన కులాలే వెన్నెముక’సభను వైయ‌స్‌ఆర్‌సీపీ ఈ నెల 7వ తేదీన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తుంద‌ని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 7న నిర్వహించనున్న‘జయహో బీసీ మహాసభ’ఏర్పాట్ల‌ను బీసీ సభ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ,  కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ప‌రిశీలించారు. అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

బీసీల్లోని ఆయా సామాజికవర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ బోర్డు సభ్యుల నుంచి గ్రామ సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యుల వరకూ ఇలా.. ప్రభుత్వం, పార్టీలోనూ ఆయా పదవుల్లో ఉన్న బీసీలు ప్రతీ ఒక్కరూ  ‘జయహో బీసీ మహాసభ’కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆయా సామాజికవర్గాలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని వినేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వివిధ స్థాయిల్లో ఉన్న బీసీ నేతలు, వక్తల ప్రసంగాలుంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు బీసీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాని కి వచ్చే ప్రతీ ఆహ్వానితుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రవాణా సౌకర్యం నుంచి ఇక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్‌ అన్నీ ఏర్పాట్లు సమకూరుస్తున్నాం. సుదూరప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే బీసీ సోదరీ సోదరమణులకు ఎక్కడా ఇబ్బందికలగకుండా భోజనం, తాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం.

రాబోయేకాలంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహాసభలు కూడా..
        గతంలో ముందెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు బీసీలకు అన్ని విషయాల్లోనూ అండగా ఉన్నారు. డీబీటీ ద్వారా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా మేం ఇచ్చాం. వివిధ కులవృత్తుల్లో ఉన్న బీసీలు మిగతా సామాజికవర్గాల్లా సమానస్థాయిలో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి లక్ష్య, ఆశయం.  ఈ సభ అనంతరం, బీసీల సమావేశం తరహాలోనే రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహాసభలను నిర్వహిస్తాం. రాష్ట్ర మహాసభల తర్వాత జోనల్, జిల్లా, నియోజకవర్గాల స్థాయిల్లో కూడా ఆయా సామాజికవర్గాల సభలు నిర్వహిస్తాము.

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు:
    చంద్రబాబు బీసీలకు చేసింది సున్నా. నిజానికి చంద్రబాబు, తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బీసీలకు చేసింది ఏమీ లేదు. మా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన మూడున్నరేళ్ల కాలంలోనే.. బీసీలకు అన్నివిధాలా మేలు జరిగింది. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున  ఏలూరు బీసీ బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌ లో ఏమైతే చెప్పామో... అందులో ఉన్న అంశాలన్నీ అమలు చేసిన ఘనత  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి దక్కుతుంది. రాబోయే కాలంలో కూడా బీసీలే వెన్నెముకగా మా  ప్రతి అడుగూ ఉంటుంది. 

జయహో బీసీ.. నినాదం చంద్రబాబు అబ్బసొత్తు కాదు:
    జయహో అనే పదం చంద్రబాబు ఏమైనా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడా..? ఆయనకేమైనా రాయల్టీ ఇవ్వాలా..? అదేదో తన పేటెంట్‌హక్కుగా మాట్లాడతాడే.. నిత్యం అబద్ధాలు ప్రచారం చేసే విషయంలో బాబు పీజీ చేశాడు. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాట కూడా తెలుగుదేశం వాళ్లు మాదే..’ అంటారేమో.!  అదెలా సాధ్యం, నిజానికి ఆ పాటను రాసిందెవరు...? అది తెలుగుదేశం వాళ్లు రాశారా..? వాళ్లకేమైనా హక్కు ఉందా..? జయహో బీసీ అనేది చంద్రబాబు అబ్బసొత్తు కాదు.. జయహో అనేది తెలుగుపదం. దీన్ని రాష్ట్రం కాదు.. దేశం మొత్తం ఉపయోగించుకునే హక్కు అందరికీ ఉంటుంది. ఆమాటకొస్తే.. ఈరోజు జయహో బీసీలానే.. జయహో ఎస్సీ, జయహో ఎస్టీ, జయహో మైనార్టీలు అంటాం..

సామాజికవర్గాల సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ల కృషి:
           వైయ‌స్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక 56 బీసీ కులాలకు సామాజికవర్గాలపరంగా కార్పోరేషన్‌లు ఏర్పాటు చేశాం. 139 బీసీ కులాలకు సంబంధించి సామాజికవర్గ సముదాయం ఉంటే.. ఆయా సామాజికవర్గాల ప్రజల సమస్యలను, వారి మనోభావాల్ని అర్ధం చేసుకుని వాటన్నింటినీ పరిష్కరించే దిశగా కార్పొరేషన్లు ముందుకెళ్తున్నాయి.  చంద్రబాబులా విభజించు పాలించు సిద్ధాంతం మాది కాదు. ఈరోజు మేం ఒక కులాన్ని సపరేట్‌ చేసి, కులాల వారీగా మీటింగ్‌ లు పెట్టడం లేదు. అన్ని సామాజికవర్గాల సమస్యల్ని పరిష్కరించే బాధ్యతను మా ప్రభుత్వం భుజానికెత్తుకుంది. మేం చేస్తున్నవిధంగా ఏ రాజకీయ పార్టీ కూడా గతంలో చేయలేదు. కొన్ని సామాజికవర్గాలవారు,  కమ్యూనిటీకి భవనాలు నిర్మించాలని అడుగుతున్నారు. ఆమేరకు మంజూరు చేసి ఇస్తున్నాం.

బీసీల్లో ఇంటికో విద్యావంతుడు ఉండాలన్నదే సీఎంగారి లక్ష్యం: మంత్రి బొత్స సత్యనారాయణ
    గౌరవ సీఎం వైయ‌స్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతుంటే.. ఇప్పుడొచ్చి మేం కూడా గతంలో చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదం. చంద్రబాబూ..‘మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారు..? కేవలం ఇస్త్రీపెట్టెలు, మోకుతాళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది నిజం కాదా..?’స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారి ఆలోచన ప్రకారం నేడు ఆయన తనయుడు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడుగు, బలహీనవర్గాల్లోనూ ఇంటికో విద్యావంతుడు ఉండాలని తపిస్తున్నారు.. ఆయా బీసీ సామాజికవర్గాల కుటుంబాల్లో ఒక కలెక్టర్, ఒక డాక్టర్‌ తయారయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే, నూటికి 80 శాతం ఈరోజు బీసీలు సంక్షేమపథకాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ. 1లక్షా 79వేల కోట్లు పంపిణీ చేస్తే.. అందులో రూ.80వేల కోట్లకు పైగా బీసీలకే అందాయి. డీబీటీ-నాన్‌ డీబీటీ ద్వారా రూ.1లక్షా 65వేల కోట్లు బీసీలకు అందాయి. పథకాలకు సంబంధించి ఎక్కడైనా చిన్న అసంతృప్తి వస్తే.. వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది.  వైఎస్‌ఆర్‌సీపీకి బలహీనవర్గాలే వెన్నెముక. వారి అభివృద్ధి మా బాధ్యత.. అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం  బూడి ముత్యాలనాయుడు, మంత్రి  కారుమూరి వెంకట నాగేశ్వరరావు, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పోతుల సునీత, విద్యా శాఖ సలహాదారుడు  ఆలూరి సాంబశివరావు, కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాప్ రెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ ఏ. మూర్తి, చేనేత విభాగం నాయకుడు గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.  

Back to Top