తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతాయని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావడానికి కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు, వైయస్ జగన్ అభిమానులకు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున, పార్టీ తరఫున పేరుపేరునా ఎంపీ విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ను జీవిత కాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, రెండు రోజులు పాటు జరిగిన ప్లీనరీ సమావేశాలకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా రావడంతో ప్రాంగణం అంతా జనసంద్రంగా మారిందన్నారు. కోవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించలేదన్నారు. రెండ్రోజుల పాటు నిర్వహించిన ఈ ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందన్నారు. సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర, గడప గడపకు ప్రభుత్వం, జాబ్ మేళాలు.. ఇలా అన్ని కార్యక్రమాలు పార్టీలోను, క్యాడర్‌లోనూ కొత్త ఉత్సాహం నింపాయి. ప్లీనరీ విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వంశీకృష్ణ యాదవ్‌లతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. పార్టీ ఫిలాసఫీ విషయానికి వస్తే.. సకల జనుల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల శ్రేయస్సే లక్ష్యంగా ఈ సమావేశాల్లో నిర్ణయాలు జరిగాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మహిళా సాధికారతే వైయస్సార్ సీపీ లక్ష్యంగా, అది మంత్రివర్గ కూర్పు నుంచి ప్లీనరీలో మాట్లాడిన వక్తల వరకూ క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థం అవుతుంది. అణగారిన వర్గాలకు, మహిళలకు 70శాతం వరకూ అవకాశాలు ఇవ్వడం, స్పీకర్, మండల చైర్మన్ తదితర పదవులు అన్నీ అణగారిన వర్గాలకు ఇవ్వడం రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఇది ప్రప్రథమం. బాబు భావ దారిద్ర్యము.. ఆర్బీకేలు, వలంటీర్ వ్యవస్థ, వైద్య, విద్యా రంగాల్లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రపంచం అంతా ప్రశంసిస్తుంటే.. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శించడం అతడి భావ దారిద్ర్యానికి నిదర్శం. మహా సముద్రాన్ని తలపించేలా జన ప్రవాహం, ఒక ఉప్పెనలాగా జనమంతా ప్లీనరీకి తరలివచ్చారు. అధ్యక్షుల వారి ప్రసంగం వినడానికి జడివానను కూడా లెక్క చేయకుండా చెక్కు చెదరని విశ్వాసంతో లక్షలాదిమంది ప్రాంగణంలో నిలిబడి ఉన్నారు. నాలుగు లక్షల మంది ప్రాంగణంలో ఉంటే, ప్రాంగణం వెలుపల మరో నాలుగు లక్షలమంది వేచి ఉన్నారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జనం లేక ప్లీనరీ సమావేశాలు వెలవెలబోయాయని ఇద్దరే ఇద్దరు విమర్శించారు. అందులో ఒకటి..కుల తోక పత్రిక అయిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్, మరొకరు ఎంపీ రఘురామకృష్ణంరాజు అనే విగ్గురాజు. వీళ్లిద్దరే విమర్శించారు. కళ్లు ఉండి కూడా చూడలేని కబోదుల్లా వీళ్లు ప్రవర్తిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఈనాడు కూడా యథార్థాలు రాసింది. ఆంధ్రజ్యోతికి, రఘురామకృష్ణంరాజుకు జనాలు ఎవరూ కనిపించలేదు. ప్లీనరీకి ఇంచుమించుగా 9లక్షల మంది వచ్చారు. బాబు మెదడుకు ఉండాల్సిన చిప్ వేలికి వచ్చింది.. చంద్రబాబు వేలికి ఒక చిప్ ఉందట. మెదడుకు ఉండాల్సిన చిప్ ఇప్పుడు వేలికు వచ్చేసింది. ఈ వేలు నుంచి చిన్నగా మోకాలులోకి వస్తుంది. మరో ఆర్నెలు, ఏడాదిలోపు అక్కడ నుంచి భూమిలోకి పడిపోతుంది. ఇప్పటికే మతిభ్రమించిన వ్యక్తి చంద్రబాబు. అల్జిమర్స్‌తో బాధపడుతూ కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడు. 2024 తర్వాత పూర్తిగా మెదడు పనిచేయదు. చంద్రబాబు ఏమైపోతాడా అనే భయం వాళ్ళ పార్టీలో ఉంది. టీడీపీ మహానాడులు, మా పార్టీ ప్లీనరీని పోల్చి చూస్తే.. టీడీపీ మహానాడులో బూతులు తిట్టడం, తొడలు కొట్టడం, వైయస్సార్ సీపీని శాపనార్ధాలు పెట్టడం అనేది ఒక ప్రధాన ఘట్టంగా జరిగింది. అదే మా ప్లీనరీలో మాత్రం గత మూడేళ్లలో ఏం పనులు చేశాం. రాబోయే రెండేళ్లలో ఏం చేయబోతున్నాం. అట్టడుగు వర్గాలకు ఏం చేశాం. ఏం చేయబోతున్నామని ప్రధానమైన అంశాలుగా తీర్మానాలు చేశాం. అంతేకానీ ఒకర్ని తిట్టడమే ప్రధాన అంశంగా చేయలేదు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును.. నాలుగు పదుల వయసు ఉన్న వైయస్ జగన్‌ని ఎదుర్కోమనండి. పరిపాలనలోగానీ, ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లోగానీ, ఆలోచనా విధానంలో అయినా వైయస్ జగన్‌ని ఎదుర్కోవాలని మేము చంద్రబాబు నాయుడుకు సవాల్ విసురుతున్నాం. వారి నవరంధ్రాలూ మూతపడ్డాయి.. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను కొంతమంది విమర్శిస్తున్నారు. ఆంధ్రజ్యోతితో పాటు ఏమీ తెలియని మొద్దు నాయుడు కూడా విమర్శలు చేశాడు. నవరత్నాలు ఏరకంగా అమలు చేశాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం ఏవిధంగా అమలు చేశామనేది మా ప్లీనరీ సమావేశాలకు వచ్చినవారిని చూసి, నవరత్నాలును విమర్శించినవారి నవరంధ్రాలన్నీ కూడా మూతపడ్డాయి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, మిగతా పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు అధికారంలో లేమని అర్థం అయ్యాక పుట్టుకు వచ్చిన ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఒక శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడు. సైకో పాత్‌లా చంద్రబాబు మనస్తత్వం ఉంది. ఎంతసేపు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని విమర్శించడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంటున్నారే తప్ప, ప్రతిపక్షంగానీ, చంద్రబాబు కుల మీడియా గానీ ప్రజలు గురించి, వారి సమస్యల గురించి పోరాడిన సందర్భాలే లేవు. ఎందుకంటే, వీళ్ళు విమర్శించడానికి పనే లేకుండా ప్రజలకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతో చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రాలేదు.. ఎంతసేపటికీ, వైయస్ జగన్‌ని అధికారం నుంచి అర్జెంటుగా దించేయాలి, ఆ సీటులో చంద్రబాబు, ఆయన కొడుకు కుర్చుంటే బాగుండు.. అనుకునే భ్రాంతిలో ఎల్లో కుల మీడియా, ‘మన’వాళ్లు ఉన్నారనేది ప్రతిపక్షాల పరిస్థితి. సీఎం వైయస్ జగన్ అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తెచ్చుకున్నారు. మామకు వెన్నుపోటు పొడిచో, ఇంకొకరికి ద్రోహం చేసో బ్యాక్ డోర్ లోనో అధికారంలోకి వచ్చిన వ్యక్తికాదు. ఈ విషయాన్ని చంద్రబాబు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఆశీర్వదించి, వీర తిలకం దిద్ది ప్రజాస్వామ్యయుతంగా గెలిపించారు. చంద్రబాబు మాత్రం.. పదే పదే ప్రజలు పొరపాటు చేశారని అనడం హాస్యాస్పదంగా ఉంది. తన అసమర్థతకు, తన చేతగానితనానికి.. ప్రతిదానికీ ప్రజలను నిందించడం బాబుకు అలవాటుగా మారింది. చంద్రబాబు నాయుడు చేసిన దోపిడీ, అమరావతి విషయంలో చంద్రబాబు చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్. రాజధాని పేరుతో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దుర్వినియోగం చేశారనేది ఈరోజుకు లెక్కలు చెప్పడు. ఐదేళ్ళూ అధికారంలో ఉండి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రశ్నించినవారిని అధికార మదంతో దూషించడం చంద్రబాబుకు కానీ, ఎల్లో కుల మీడియాకుగానీ ఈరోజుకీ తప్పిదాలుగా అనిపించడం లేదా..? బాబుది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ.. చంద్రబాబు నార్సిసిస్టిక్ పర్సనాల్టీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. నెగిటివ్ భావాలతో తీవ్రమైన మానసిక అలజడికి లోనైన వ్యక్తి. ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడు కాదు. రిటైర్ అయిపోతే ఆంధ్రరాష్ట్రానికి, ప్రజలకు మంచిదని భావిస్తున్నాం. చేతకానివాళ్లు, యుద్ధం చేయలేనివాళ్లు, ఎదురించలేనివాళ్లు గోబెల్స్ ప్రచారం ఎన్నుకుంటారు. చంద్రబాబు కూడా అదే కోవకు చెందినవాడు. పరాక్రమవంతులు, రణక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడగలిగేవాళ్లు మాత్రమే పోరాడి విజయం సాధిస్తారు. కానీ చంద్రబాబులాంటివాళ్లు ఎప్పటికీ విజయం సాధించలేరు. ఏదైనా రాజకీయ పార్టీ అయిదేళ్లకో, మూడేళ్లకో ప్లీనరీ జరుపుకుని, ప్రజలకు అవసరమైన నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వడంలో తప్పులేదు. కానీ ప్లీనరీ జరగకపోతే బాగుండు, వర్షం వస్తే బాగుండు, ఏదైనా విషాదం జరిగితే బాగుండు అని కోరుకునేవాళ్లని ఏమంటారు? అందుకే చంద్రబాబును సైకో పాత్ అంటాను. ప్లీనరీకి వచ్చిన ప్రజల మీద విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్లీనరీ విజయవంతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీస్ శాఖవారు అద్భుతంగా పనిచేశారు. ట్రాఫిక్‌ను చాలాబాగా కంట్రోలు చేశారు. మూడు నాలుగు రోజులు పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడారు. ఎక్కడా అధికార దుర్వినియోగం చేయకుండా పారిశుద్ధ్యంతో పాటు మిగతా శాఖల వారు సమష్టిగా పనిచేశారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు, మీడియా, వాలంటీర్లకు కృతజ్ఞతలు. మీడియా కూడా చాలావరకూ నిజాలు నిజాలుగానే రాశాయి. దినేష్ కుటుంబానికి సహాయం.. ప్లీనరీ అయిపోయిన తర్వాత వేమూరు నియోజకవర్గానికి చెందిన మా పార్టీ అభిమాని, వాలంటీర్ గా కూడా పనిచేస్తున్న దినేష్ పేవ్‌మెంట్ మీద నడుస్తూ ప్రమాదవశాత్తూ కాలు స్లిప్ అయ్యి బస్సుకింద పడి చనిపోవడం జరిగింది. ప్రాణాలు తిరిగి తేలేం కానీ, పార్టీ పరంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందిస్తాం. వేమూరు నియోజకవర్గానికి చెందిన మా శాసనసభ్యులు, మంత్రి మేరుగ నాగార్జున ద్వారా రూ.5లక్షలు మా పార్టీ తరపున ఆ కుటుంబానికి అందజేస్తున్నాం.