కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చింది

పదేళ్ళయినా విభజన హామీలు నెరవేర్చలేదు

 పోలవరానికి నిధులు, ప్రత్యేకహోదా ప్రస్తావనలేదు

  పార్లమెంటు బడ్జెట్‌ చర్చలో వీటన్నిటిపై ప్రశ్నిస్తాం

  ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గానిభరత్, మోపిదేవి వెంకటరమణలు వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చిందద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రా భవన్‌లోని గురజాడ హాలులో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఫ్లోర్‌ లీడర్ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్ మార్గాని భరత్,  పార్టీ పార్లమెంటు సభ్యులు మీడియాతో మాట్లాడారు. 

మిథున్‌రెడ్డి ఏమ‌న్నారంటే..
 ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు విభజనచట్టంలోని హామీల అమలు విషయంలో నిరాశే మిగిలిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ప్రధాని సమక్షంలో, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారు విభజన చట్టం హామీలను ప్రస్తావించారు. విభజన చట్టం బిల్లు పార్లమెంటులో ఆమోదించి ఇప్పటికి పదేళ్లయినా, ఆ హామీల ప్రస్తావన ఎక్కడా లేదు. పోలవరం నిధులు ఊసూ లేదు. ప్రత్యేక హోదా ప్రస్తావనా లేదు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల విషయంలోనూ ప్రగతి లేదు. 
 
- రైల్వే కారిడార్, స్టీల్‌ ప్లాంట్‌కు చేస్తామన్న సాయం గురించి  ప్రస్తావనలు లేనేలేవు. ఇవన్నీ కాగితాలపైనే ఉన్నాయి. వీటన్నిటిపైనా కేంద్రాన్ని ప్రశ్నిస్తాం. నిలదీస్తాం. పార్లమెంటులో జరిగే బడ్జెట్ చర్చలో కూడా లేవనెత్తుతాం. నర్సింగ్‌ కాలేజీలు,ఏకలవ్య పాఠశాలలు...తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ట ప్రయోజనం రాబట్టడానికి ప్రయత్నిస్తాం. 
- మీడియా ప్రశ్నలకు సమాధానంగా మిధున్‌ సమాధానమిస్తూ ... కర్ణాటకకు ఇచ్చిందానికి బాధ లేదు. పోలవరాన్ని పట్టించుకోవడంలేదన్నదే మా బాధ. ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ గారు పలుమార్లు పీఎం, ఆర్థిక శాఖ మంత్రులను స్వయంగా కలిసి ఎన్నో వినతులు ఇచ్చారు. అయినప్పటికీ  పోలవరానికి నిధుల ప్రస్తావన లేదన్నది ఒక బాధాకరమైన విషయంగా భావిస్తున్నాం.

ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ..
- 2023–24 కేంద్ర బడ్జెట్‌లో  వ్యవసాయ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, పేదల నివాసానికి గృహనిర్మాణం, మత్స్య సంపద .. పీఎంఎంఎస్ వై(ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన)...తదితర రంగాల  ప్రోత్సాహానికి కేంద్రం  ప్రాధాన్యమిచ్చింది. ఆంధ్రాకు సంబంధించి సీఎం జగన్‌ గారు రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు.  నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ...మరోవైపు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు  ఎంతగానో కృషి చేస్తున్నారు. 
- జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని జగన్‌ గారు కంకణం కట్టుకున్నారు. దేశంలోనే విస్తారమైన తీరం ఆంధ్రప్రదేశ్ సొంతం.అనువైన ప్రతి ప్రాంతంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లను, ఎగుమతులకు అవసరమైన మేజర్‌ పోర్టులను అభివృద్ధి ద్వారా ముందుకు తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నాం .
- ఆంధ్రలో అభివృద్ధిరంగానికి సంబంధించి ఏ రంగానికి ఎంత బడ్జెట్‌  సమకూరుస్తుందో ఇంకా స్పష్టత రావాలి. 
- విభజన తర్వాత పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల విషయానికొస్తే..  ప్రత్యేక హోదా, కాని పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు,  ఇంకా అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని  హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలుకు అనేకసార్లు ప్రధాని, సంబంధిత శాఖల మంత్రులతో సీఎం జగన్‌ గారు మాట్లాడారు.
-  ప్రత్యేక హోదా సాధన అనేది మా ప్రధాన అజెండా. ఈ  అజెండాపై శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడతాం.
-   స్వార్థపూరిత  ఆలోచన విధానాలతో ఆ నాడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టారు. 
- రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా ...ప్రతి మారుమూల ప్రాంతానికీ సాగునీరందించాలని జగన్‌ గారు తలపోస్తే...మరో వైపు పోలవరం ప్రాజెక్టుకు  నిధుల మంజూరు,  కేంద్రం సహకారం పొందే విషయంలో కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నాం. అయినప్పటికీ మా సీఎం గారు  మత్స్య సంపద, ఆక్వా రంగాల్లో ప్రగతి కోసం ఫేజ్‌ –1, 2 కింద ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నారు.  జాతీయ స్థాయిలోనే అత్యధిక ఉత్పత్తులు సాధిస్తున్నది ఆంధ్రప్రదేశ్‌. 
- ఈ మధ్య కాలంలో ఆక్వా రంగంలో ఎదురైన ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి, కేంద్రం పొందుపరిచిన బడ్జెట్‌లో ఆక్వా దిగుమతి సుంకాల్లో రాయితీలు కల్పించడం కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ, ఇంకా ఆ రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ, విదేశాలకు ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్‌ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉంది. 
- ఇక గృహనిర్మాణానికి వస్తే... సీఎం జగన్‌ గారు 31 లక్షల మంది నిరుపేదలకు జగనన్న కాలనీల పేరిట ఇళ్లనే కాదు... కొత్త గ్రామాలనే నిర్మిస్తున్నారు. ఈ పథకాన్ని మరింత  మెరుగ్గా అమలు చేయడానికి   కేంద్రం  ప్రత్యేక శ్రద్ధ చూపడమే కాకుండా పలు రాయితీలు కల్పించాలని కోరుతున్నాం. 
- ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వికాసానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక సదస్సుకు నిన్ననే అంకురార్పణ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు మార్చిలో విశాఖలో భారీ ఎత్తున సదస్సు నిర్వహించబోతున్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కావాలని కోరుతున్నాం. 

మార్గాని భరత్‌ మాట్లాడుతూః
- కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల మంజూరు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.. మధ్యతరగతి, మహిళలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి ఏమీ లేవు.  ఆరోగ్య పరంగా చూసినప్పుడు   ప్రతిజిల్లాకు వైద్య కళాశాలలు రావాల్సి ఉంది. సీఎం గారు రాష్ట్రానికి కొత్తగా 18 వైద్య కళాశాలలను  తెస్తున్నారు.  వీటిలో కేంద్రం కేవలం మూడు కాలేజీలకు మాత్రమే నిధులిస్తామని చెప్పింది.  మిగిలిన వాటికీ నిధులివ్వాలని అడుగుతున్నాం.
-  రైల్వే పరంగా... విశాఖపట్నం–విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉంది. ఇదే కాకుండా కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌ లో ఉంది. ఈ లైను వేయడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు 70 కి.మీ దూరం దగ్గుతుంది. దీనివల్ల ఖర్చులు తగ్గించుకునే అవకాశముంది.  
- పారిశ్రామిక కారిడార్ల గురించి ప్రస్తావించాల్సి వస్తే విశాఖపట్నం– చెన్నై, చెన్నై – బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్‌ కారిడార్లు ఉన్నాయి. వీటివల్ల 80 శాతం జిల్లాలు కవరవుతున్నాయి. వీటికి నిధులు కేటాయించడం వల్ల అన్ని విధాలుగా అభివృద్ధికి , కనెక్టవిటీకి ఆస్కారముంటుంది. 
- ముఖ్యంగా  పునరుత్పాదక ఇంధనాభివృద్ధిని వినియోగంలోకి తీసుకురావాలి. దీనికి కేంద్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు ఎంత వస్తుందో చూడాలి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మిల్లెట్స్‌ను హైదరాబాద్‌కు ఇచ్చారు. పోనీ వీటిలో ఏ ఒక్కటైనా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినా ఎంతో కొంత మేలు జరుగుతుంది. కొంత సంతోషం కలిగేది. ఎన్నికలు జరగబోతున్నాయి కనుక హైదరాబాద్, కర్ణాటక వంటి ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చారని అనుకోవచ్చు.
-  కానీ  ఆంధ్రప్రదేశ్‌కు యూపీఏ తో పాటు ఎన్‌డీఏ హయాంలోనూ ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అన్యాయం జరుగుతోంది. 
- ముఖ్యమంత్రి జగన్‌ గారు పలుమార్లు ప్రధాని మోదీని కలిసినప్పుడు.. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూనే ఉన్నాం. దుగరాజుపట్నం పోర్టు పదేళ్లలో పూర్తి కావాలని చట్టంలో నిర్దేశించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని రామయపట్నం పోర్టుకు తరలించాల్సి వచ్చింది.  దానికీ నిధులు కేటాయించాలి. 
- పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీలపై పోరాడతాం.
- బాబు యూటర్న్‌ తీసుకోకపోతే ప్రత్యేకహోదా వచ్చేది. 

Back to Top