ఐదేళ్ల‌లో చంద్రబాబు చేసిన అప్పు రూ. 4 లక్షల కోట్లు

ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏపీకి ఒరగబెట్టిందేమీ లేదు

చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రత్యేక హోదా రాలేదు l

ఇంట్లో ఆడవాళ్లను కూడా రోడ్డుకీడ్చి రాజకీయం చేస్తున్న బాబు

బీజేపీతో అంటకాగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తులేవా..?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌

ఢిల్లీ: ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు సుమారు రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. చంద్రబాబు మోడల్‌ ఫాలో అయితే మిగులు బడ్జెట్‌లోకి వెళ్తారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని, ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా..? అని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉండగా ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్స్, వివిధ కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని.. మిగులు బడ్జెట్‌ ఫార్ములా ఉపయోగించి ఐదేళ్లలో ఎంత మిగిల్చారని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఏపీకి ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఎంపీలు మార్గాని భరత్, చంద్రశేఖర్, వంగా గీత, చింతా అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. 7 ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడానికి నిరాకరించాడని చెప్పుకుంటున్నారని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రమాణస్వీకారం చేయనని తెగేసి చెప్పుంటే రాష్ట్రానికి ఈ దరిద్రం ఉండేది కాదు కదా..? అని కనకమేడల రవీంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఇవాల్టికీ ప్రత్యేక హోదా రాలేదని, ప్రత్యేక హోదా సంజీవని కాదు.. ప్యాకేజీ ఇవ్వండి అని టీడీపీ చెప్పిన మాట వాస్తవం కాదా..? అని నిలదీశారు. బీజేపీతో అంటకాగినప్పుడు టీడీపీకి ఏపీ ప్రయోజనాలు గుర్తురాలేదా..? అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. కేంద్రానికి ఏపీ ఎంపీల అవసరం ఉండి ఉంటే ఇప్పటికే హోదా వచ్చేదన్నారు. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు విపరీతంగా ఉందని, శ్రీలంకకు తరలించారని గత టీడీపీ ప్రభుత్వ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంట శ్రీనివాస్‌ చెప్పారని గుర్తుచేశారు. గంజాయి రవాణాలో పెద్ద పెద్ద వాళ్లున్నారని వారే మాట్లాడారని, చంద్రబాబు, లోకేష్‌ కంటే పెద్దవాళ్లు టీడీపీ ప్రభుత్వం ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గంజాయిని నిర్మూలిస్తున్నారని, పోలీస్‌ దాడులు జరుగుతున్నాయి కాబట్టే.. ప్రెస్‌ ముందుకు వార్తలు వస్తున్నాయన్నారు. గంజాయిని అరికట్టే చర్యలపై బురదజల్లడం, ముఖ్యమంత్రిని బూతులు తిట్టించడం, తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర పరువు తీసే కార్యక్రమానికి తండ్రీకొడుకులు పూనుకున్నారని ఎంపీ మార్గాని భరత్‌ మండిపడ్డారు.  ఇంట్లో ఆడవాళ్లను కూడా రోడ్డు మీదకు తీసుకువచ్చి రాజకీయాలు చేస్తున్నారంటే..  చంద్రబాబు ఎంత దారుణానికి దిగజారాడో ఆలోచించాలని ప్రజలను కోరారు. 
 

Back to Top