అనర్హతకు కచ్చితమైన గడువు పెట్టాలి 

న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడే సభ్యులపై అనర్హత వేటు వేయడానికి కచ్చితమైన గడువు విధించేలా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌కు సవరణ చేయాలని వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కేంద్ర న్యాయ శాఖ మంత్రి  కిరణ్‌ రిజుజుకు విజ్ఞప్తి చేశారు. వైయ‌స్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు  వి.విజయసాయి రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీలు బుధవారం మంత్రి శ్రీ కిరణ్‌ రిజుజును ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.

ఈ సమావేశంలో   విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై చట్ట సభలకు ఎన్నికైన ఏ ప్రజాప్రతినిధి కూడా ప్రజా తీర్పుకు విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరచకుండా ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేసేందుకు వీలుగా 35 ఏళ్ళ క్రితం రాజ్యాంగంలోని పదవ షెడ్యూలును సవరించి పార్టీ ఫిరాయింపుల చట్టానికి రూపు కల్పన చేయడం జరిగింది. అయితే ఏ లక్ష్యంతోనైతే ఈ చట్టం అమలులోకి వచ్చిందో ఆ లక్ష్యం ఇప్పటి వరకు నెరవేరలేదు. అందుకు ప్రధాన కారణం అనర్హత పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్టమైన గడువును చట్టంలో స్పష్టంగా పేర్కొనకపోవడం అని ఆయన మంత్రికి వివరించారు. చట్టంలోని ఈ లొసుగును ఫిరాయింపుదారులుకు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ ఏళ్ళ తరబడి అనర్హత వేటు పడకుండా తప్పించుకుంటున్నారని చెప్పారు. చట్టంలోని ఈ లొసుగు రాజకీయ అవినీతి, పార్టీ అవిధేయత, పార్టీ టిక్కెట్‌పై గెలిచి పార్టీకి ద్రోహం తలపెట్టే వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. అనర్హత పిటిషన్‌ దాఖలైన మూడు నెలలలోగా ఆ పిటిషన్‌పై సభాపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ దీనికి అనుగుణంగా పదవ షెడ్యూలును సవరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని విజయసాయి రెడ్డి అన్నారు. జేడీయూ సభ్యుడు సభ్యుడు శరద్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్‌పై మూడు మాసాల్లోగా నిర్ణయం తీసుకుని రాజ్యసభ చైర్మన్‌ ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పారు. ప్రభుత్వం దీనిని ఒక ప్రమాణంగా తీసుకుని లోక్‌ సభ, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్స్‌లో అమలు చేసేందుకు వీలుగా పదవ షెడ్యూల్‌ను సవరించాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలి...
దేశంలోని మొత్తం కార్మికులలో 40 శాతం వ్యవసాయంపైనే అధారపడినప్పటికీ జాతీయ స్థూల ఉత్పాదన (జీడీపీ)లో వారి వంతు కేవలం 20 శాతం మాత్రమే ఉంది. దీనిని బట్టి వ్యవసాయ రంగ సామర్ధ్యం, ఉత్పాదకతలో ఎన్ని లోపాలు ఉన్నాయో స్పష్టం అవుతోందని శ్రీ విజయసాయి రెడ్డి వివరించారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తున్నప్పటికీ జాతీయ ఎస్సీ కమిషన్‌, జాతీయ ఎస్టీ కమిషన్‌ మాదిరిగా రైతాంగం ప్రయోజనాల పరిరక్షణ, వ్యవసాయ రంగం అభ్యున్నతి కోసం రాజ్యాంగబద్దంగా శాశ్వత ప్రాతిపదికన జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నందున ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

హైకోర్టును కర్నూలుకు తరలించాలి....
పాలనను వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ మేరకు పాలన వికేంద్రీకణను వాంఛిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించింది. దీనికి అనుగుణంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తూ చట్టంలో పొందుపరచింది. కాబట్టి ప్రస్తుతం అమరావతిలో ఉన్న హై కోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ రీ నోటిఫై చేయాల్సిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు న్యాయ శాఖ మంత్రికి వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. అలాగే కర్నూలులో నేషనల్‌ జుడిషియల్‌ అకాడమీ, నేషనల్‌ లా యూనివర్శీటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

Back to Top