కేంద్ర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు రాయితీలు తగ్గించడం సబబు కాదు

  న్యూఢిల్లీ: పరిమితికి మించి టీడీపీ హయాంలో చేసిన అప్పులకు ప్రస్తుతం నికర రుణపరిమితిలో ఆంక్షలు విధించడం సరికాదని వైయ‌స్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు రాయితీలు తగ్గించడం సబబు కాదన్నారు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్, ఎంపీ నందిగం సురేశ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారని చెప్పారు. ఎరువులు, ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య రంగంలో సబ్సిడీలను తగ్గిస్తే ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్‌లో పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. మూలధన వ్యయం పెరిగిందని కేంద్రం చెబుతోందని, ప్రభుత్వ రంగ సంస్థల రుణాల చెల్లింపులు పోగా గతేడాదితో పోలిస్తే మూడు శాతం మాత్రమే పెంచారని తెలిపారు. రూ.7.5 లక్షల కోట్లకు పెంచినట్లు కేంద్రం ప్రకటించినందున ఏపీకి సాయం చేయాలని కోరారు. ఆ నిధులు సమకూరిస్తే విభజన హామీలన్నీ నెరవేరతాయన్నారు. జీఎస్టీ, పెట్రోలు, డీజిలు సెస్సులు బట్టి చూస్తే రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్లకుపైనే వడ్డీ రుణాలు అందించవచ్చన్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు విషయంలోనూ ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలను చూసైనా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు హితవు పలికారు. 

 
టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదు..
రాష్ట్రానికి రావాల్సిన నిధులను టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదని ఎంపీ మార్గాని భరత్‌ పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ బఫూన్‌ అని అభివర్ణించారు. మాట తీరు, వ్యవహార శైలి మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే విపక్ష నేత చంద్రబాబు సహించలేకపోతున్నారని ఎంపీ నందిగం సురేశ్‌ విమర్శించారు.  

Back to Top