ప్లీనరీ ఘన విజయం చూసిన తర్వాత బాబు వెక్కి వెక్కి ఏడుస్తాడు  

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
 

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్లీనరీ ఘనవిజయం చూసిన తర్వాత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తాడ‌ని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నామని అన్నారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ  కేంద్ర కార్యాలయంలో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాం. అదికారంలోకి వచ్చాక కూడా అంతే నిర్మాణాత్మకంగా వ్యవహరించాము. సామాజిక న్యాయం దిశగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం. ప్లీనరీ విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. శుక్రవారం 1.50 లక్షల మంది, రెండో రోజు 4 లక్షల మంది వస్తారని అంచనా. 

ప్లీనరీకి ఇదే ఆహ్వానం..
            పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. గత రెండు ప్లీనరీలు ప్రతిపక్షంలో ఉండగా జరిగితే.. ఈసారి అధికార పక్షంగా మూడేళ్ళ పాలన తర్వాత జరుగుతున్న ప్లీనరీ ఇది.  ప్రతిపక్షంలో ఉండగా, ఎంతో నిర్మాణాత్మకంగా విమర్శలు చేశాము. మూడేళ్ళు అధికార పక్షంగా అంతకు మించి నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి జగన్ గారు పరిపాలన అందించగలిగారు. కాబట్టి, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఈ ప్లీనరీ జరగబోతుంది. ప్లీనరీకి ఒక క్రమపద్ధతిలో ఆహ్వానాలు పంపడం జరిగింది. ఆహ్వానాలు అందనివారు కూడా పార్టీ వ్యవస్థలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో నా ఆహ్వానాన్నే,  ప్లీనరీకి ప్రత్యక్ష ఆహ్వానంగా భావించి హాజరు కావాలని కోరుతున్నాను. ఎవరికైనా ఆహ్వానాలు అందకపోతే, మా పొరపాటును మన్నించి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకూ ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో స్పందన చూస్తే, ప్లీనరీ విజయవంతం అవుతుందని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మాకున్న అంచనాల ప్రకారం జులై 8వ తేదీ మొదటిరోజు సుమారు లక్షా 50వేలమంది వస్తున్నారు. రెండోరోజు 4 లక్షలమంది హాజరు అవుతారని మా అంచనా. మా అంచనాలు తారుమారు కావని భావిస్తున్నాం. రేపటి కార్యకర్తల సభకు అన్ని జిల్లాల నుంచీ, అన్ని నియోజకవర్గాల నుంచీ, అన్ని గ్రామాల నుంచీ కార్యకర్తలంతా తరలివస్తారు. ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.  ప్లీనరీ విజయం స్పష్టంగా కనిపిస్తున్నందువల్ల చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పరాకాష్టకు చేరింది. 14ఏళ్లు అధికారంలో ఉన్నన్నాళ్ళు, ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు, ఇప్పుడు తాను చేసిన కార్యక్రమాలు ఇవీ.. అని చెప్పకుండా తెల్లారిలేస్తే, విమర్శల మీదే బతుకుతున్నాడు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలనే దురుద్దేశ్యంతో,  చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారనే దానికి ఉదాహరణ-  8 వేల గ్రామాల్లో స్కూళ్ళను మూసేశారని పచ్చి అబద్దాన్ని నిన్న చెప్పాడు. నిజానికి ఒక్క స్కూల్ కూడా మూసి వేయలేదు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారు.  వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత అంశాలను తీసుకుంటే దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ కూడా అదే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఇది డిఫరెంట్‌గా కనిపిస్తోంది.

ఇంటికో ఉద్యోగం హామీ ఎందుకు అమలు చేయలేదు బాబూ..?
         అధికారంలోకి వచ్చిన వెంటనే, 2 లక్షలమందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, వాలంటీర్లతో కలుపుకుని మొత్తం నాలుగు లక్షలమందిని సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించుకోవడం, రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఆర్బీకేలు ఏర్పాటు, ప్రతి గ్రామంలో వైద్యం అందించేందుకు విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయడం.. ఇలా ముఖ్యమంత్రి జగన్ గారు పరిపాలనను సంస్కరణల బాట పట్టించారు. . మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే ప్రభుత్వం అనే సిద్ధాంతంతో ముందుకు వెళుతోంది. భవిష్యత్‌లో కూడా ప్రజలకు మరింత మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాలన్నది ముఖ్యమంత్రిగారి అభిమతం. అదే చంద్రబాబు నాయుడు గతంలో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఆనాడు మీరిచ్చిన హామీ ఏమైందని, ఎందుకు మాట తప్పారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకుని, దాన్నే నిజం అని పదే పదే ప్రజల మెదళ్ళలో విషం నింపే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. లిక్కర్‌ బ్రాండ్స్‌ విషయానికి వస్తే..  మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క డిస్టలరీకి కొత్తగా అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో 20 డిస్టలరీలకు ఎవరు అనుమతి ఇచ్చారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని 254 కొత్త లిక్కర్‌ బ్రాండ్లకు ఎవరు అనుమతి ఇచ్చారు అంటే అదికూడా చంద్రబాబే. మద్యంలో కెమికల్స్ ఉన్నాయని చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంతకీ, బాబు, లోకేష్ ... ఏ బ్రాండు తాగుతున్నారో ఈరోజే బయట పెట్టాలి.  
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేయలేకపోయారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మూడేళ్లలోనే చేసి చూపించారు. మదనపల్లె ఏ జిల్లాలో ఉండాలో అని ఈరోజు చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి జగన్‌ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలను రూపొందిస్తూ, సుపరిపాలన చేస్తుంటే..  ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ ప్రభుత్వంపైన, జగన్ గారిపైన చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకోవడం సమంజసమా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. ఈ మూడేళ్లలో దళారులు, మధ్యవర్తులు లేకుండా ప్రజలకు నేరుగా 1.6 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నగదును అందించిన ఘనత జగన్‌గారికే దక్కుతుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.

మా పరిపాలనే గీటు రాయిగా ప్లీనరీ
        జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పరిపాలనకు గీటురాయిగా ప్లీనరీ జరుగుతుంది. మేం చేసిన మంచి పనులన్నీ ప్లీనరీలో చెబుతాం. విద్యా, వైద్య రంగం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారితపై ప్లీనరీలో చర్చిస్తాం. వక్తలందరూ మాట్లాడతారు. తీర్మానాలు ఆమోదిస్తాం. మా ప్లీనరీ సమావేశాలపైన కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. డ్వాక్రా మహిళలను  బలవంతంగా తీసుకు వస్తున్నట్లుగా టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్లీనరీ సమావేశాలకు పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు మాత్రమే హాజరు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మిగతావారు ఎవరికీ మేము ఆహ్వానం పంపించలేదు.

25 రకాల వంటకాలతో భోజనాలు
         ప్లీనరీలో పెట్టే భోజనాల విషయంలో కూడా టీడీపీ, చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు.  సమాజంలో వెజిటేరియన్స్‌, నాన్‌ వెజిటేరియన్స్‌ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే మా ప్లీనరీ సమావేశాల్లో 25 రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశాం.  మేమేదో ప్లీనరీలో పంది మాంసం పెడుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. బహుశా చంద్రబాబుకు అది తిని తిని అలవాటు అయిందేమో...!. మా ప్లీనరీ మెనూలో అటువంటి ప్రస్తావనే లేదు.

- ప్లీనరీ ఘన విజయాన్ని చూసిన తర్వాత  10వ తేదీన మరిన్ని ప్రెస్‌మీట్లు పెట్టి బహుశా చంద్రబాబు భోరుభోరున మరోసారి ఏడుస్తారనే విషయం అర్ధం అవుతోంది. ప్లీనరీ సమావేశాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్లీనరీకి సంబంధించిన అన్ని కమిటీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరు ఈ ప్లీనరీకి హాజరు కావచ్చు. ఇక వాతావరణం చూస్తే... రేపు, ఎల్లుండి వర్షం వస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వర్షం రాకుంటే ప్లీనరీ అద్భుతంగా జరుగుతుంది. వర్షాలకు ఈ రెండు రోజులు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుడిని, వరుణ దేవుణ్ణి కోరుకుంటున్నాం. 

విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..
- ప్లీనరీకి మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గారు, అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు హాజరు అవుతారు. మా పార్టీ ప్రజాప్రతినిధులంతా హాజరు అవుతారు.  పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై మొదటి రోజు తీర్మానం ప్రతిపాదిస్తాం. మరుసటి రోజు ఎన్నిక జరుగుతుంది.
- ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. బడుగు, బలహీన వర్గాలతో పాటు అగ్ర కులాల్లోని పేదలకు కూడా లబ్ది చేకూరేలా సంక్షేమ పథకాలను రూపుకల్పన చేసి వాటిని అమలు చేస్తున్నాం.
- 2024 ఏప్రిల్‌లో ఎలాగూ ఎన్నికలు వెళ్లాల్సిందే.  ముందస్తు  ఎన్నికలకు తొందరెందుకు...?
- ముందస్తు ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నాడు. అది కలగానే మిగిలిపోతోంది.
- పార్టీని మరింత పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రిగారు కమిటీల నియామకానికి సంబంధించి రేపు ప్రకటన చేయబోతున్నారు. దీంట్లో ప్రతి స్థాయిలో కూడా ఎలా నియామకాలు జరగాలనేది అధ్యక్షుల వారు ప్రకటన చేస్తారు.  నిర్ణిత గడువు లోపల అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేసుకుని, పార్టీని పటిష్టం చేసుకుని, రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతాం.

- ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం  కె. నారాయణ స్వామి,  హోం మంత్రి తానేటి వనిత, మంత్రులు జోగి రమేష్,  చెల్లుబోయిన వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top