‘విశాఖ ఉక్కు’ ప్రైవేటీకరణ నిర్ణయం సరైందికాదు

రుణాలను వాటాలుగా మార్చి.. సొంత గనులు కేటాయించాలి

రాజ్యసభలో ఫైనాన్స్‌ బిల్లుపై చర్చలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, ప్రభుత్వ వనరుల సమీకరణ కోసం సంస్థను అమ్మడం మంచిది కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని రాజ్యసభలో నినదించారు. ఫైనాన్స్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వనరులు సమీకరించుకోవాలని కేంద్రానికి సూచించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల నిరసనను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాల ద్వారా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సాధించుకున్నారని గుర్తుచేశారు. 2015 వరకు స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లోనే ఉందని, రుణాలను వాటాలుగా మారిస్తే ప్లాంట్‌ మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..
విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి ఏపీకి వచ్చే పన్నుల వాటా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాకు ఎక్కువ ప్రాధాన్యత చూపి పన్నుల వాటాలో కోత పెడుతున్నారని ధ్వజమెత్తారు. జనాభాను నియంత్రణ చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని, జనాభా ఆధారంగా పన్నుల వాటాను నిర్దారించే పద్ధతి మార్చుకోవాలని కేంద్రానికి సూచించారు. 
 

తాజా వీడియోలు

Back to Top