మీ వెనుక నేనున్నానని.. సీఎం భరోసా ఇచ్చారు 

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: మీది వెనుకబడిన నియోజకవర్గం కాదు.. మీ వెనుక నేనున్నా.. ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని భరోసా ఇచ్చి.. ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. రాయచోటి నియోజకవర్గమే కాకుండా ఎంతో మంది జీవితాలు బాగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా ఒక్క చెరువు కూడా నిండని పరిస్థితి చేశామని, కానీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్లమెంట్‌ నుంచి గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేస్తూ ఈ రోజు ప్రతి చెరువు నిండే పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రాయచోటిలో ఆస్పత్రి, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, డీఎస్పీ ఆఫీస్, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్, సీసీ రోడ్లు వంటి ఎన్నో కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారన్నారు. నేను విన్నాను.. నేను విన్నానంటే.. కేవలం నవరత్నాలు మాత్రమే కాదు.. మీకు ఏ అవసరం ఉన్నా.. నేను ఉన్నానని భరోసా కల్పించారని గుర్తుచేశారు. చిత్తూరు జిల్లాకు కూడా హంద్రీనీవా పైపులైన్‌ ద్వారా తంబళ్లపల్లి బ్రాంచ్‌ కెనాల్, అడమిపల్లి రిజర్వాయర్‌కు నీరు ఇస్తున్నారని, ఎన్నో జీవితాలను బాగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం వైయస్‌ జగన్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. 
 

Back to Top