పేదల అభ్యున్నతే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ 

ఎన్టీఆర్ జిల్లా:  అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజావసరాలు తీర్చడమే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ అన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన జీవోతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను పరిష్కరించి సుమారు 16,897 ఎకరాలను అన్నదాతలకు అందించేందుకు అవనిగడ్డకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే రమేష్‌ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ మాట్లాడుతూ.. 

అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత ప్రభుత్వం అన్యాయంగా 16897 ఎకరాలను దుర్మార్గమైన జీవోతో రైతులను ఇబ్బందులకు గురిచేశారు. పిల్లల పెళ్లీళ్లు చేసి కట్నాలు ఇవ్వకపోతే విడాకుల వరకు వచ్చాయి. పిల్లల చదువుల కోసం లోన్‌ పెట్టేందుకు కూడా కుదరడం లేదని చెప్పిన వెంటనే.. మంచి మనసుతో కలెక్టర్‌కు ఆదేశాలిచ్చి త్వరతగతిన పూర్తిచేశారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి వర్షాలు వస్తే మునిగిపోతాం. వరదలు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి.. మమ్మల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన వెంటనే పేద ప్రజల అవసరాలకు సంబంధించి ఏ పని అడిగినా కాదనకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీవులు ఉన్నాయి.. పంటు మీద రేవు దాటి వెళ్లాలి.. ఏదైనా అర్ధరాత్రి పూట డెలివరీ కేసు, హార్ట్‌ ఎటాక్‌ వస్తే ఆస్పత్రికి వెళ్లడానికి 6–7 గంటల పాటు సమయం పడుతుందని చెబితే.. కచ్చితంగా మనం పరిష్కారం చేద్దామని రూ.120 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేశారు. అదే విధంగా మంచినీళ్లకు ఇబ్బందిపడుతున్నారని చెబితే.. రూ. కోటి మంజూరు చేస్తున్నాను అని చెప్పారు. విజయవాడ నుంచి 63 కిలోమీటర్ల దూరంలో పులిగడ్డ ఉంది. మధ్యలో ఏ బ్యారేజీ లేదు. వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనికి పరిష్కారం చూపిస్తే 7 నియోజకవర్గాలకు మంచినీటి సదుపాయం వస్తుందని, సాగుకు కూడా ఉపయోగపడతాయని చెప్పిన రోజే మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌. 

చంద్రబాబు ఇంటికి దారేది?
విశాఖపట్నం ఎపిసోడ్‌ చూశాం. అత్తారింటికి దారేది సినిమాలా.. చంద్రబాబు ఇంటికి దారేది అని వెతుకున్నాడు. అంతకుముందు దత్తపుత్రుడు అంటే చాలా మంది బాధపడేవారు. ఆ తెర తీసేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ప్రశాంతంగా, మౌనంగా ఎవ్వరినీ ఏమనకుండా ఉన్నారు. విశాఖపట్నం వచ్చి అల్లరి చేసి, కార్లు బద్దలు కొట్టి, కాపు కులాన్ని వెంటబెట్టుకొని వెళ్లడం కోసం పవన్‌ కల్యాణ్‌ చేసిన పని ఏంటీ..? వంగవీటి రంగా హత్యలో కాపులు కూడా భాగస్వాములే.. ఊరికి పదిమంది వెళ్లి కాప‌లా కాస్తే ఆయన చనిపోయేవాడు కాదని పవన్‌ అంటున్నాడు. అయ్యా.. రంగాను చంపిన వ్యక్తి దగ్గరకు వెళ్లి కూర్చొని కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టుపెడదామనుకుంటున్నావా..? 

యుద్ధానికి వస్తున్నారా.. కొట్లాటకు వస్తున్నారా.. పవన్‌..? 
మా ముఖ్యమంత్రికి మంచి మనసు ఉంది. ఆయ‌న‌ పేదల ఇబ్బందులు, కష్టాలు తెలుసు. పవన్‌ కల్యాణ్‌ చెప్పాల్సింది.. నేను సీఎం వైయస్‌ జగన్‌ కంటే పరిపాలన బాగా చేస్తా.. వైయస్‌ఆర్‌ కంటే, ఎన్టీఆర్‌ కంటే పరిపాలన బాగా చేస్తా.. నాకు ఓటు వేయండి, నాతో పాటు ఉండండి. పేదలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పాలి. కానీ, పవన్‌ ఏం చెబుతున్నాడు. చంద్రబాబు పంచన చేరి వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెబుతున్నాడు. మీరందరూ ఏకమై మాతో యుద్ధానికి వస్తున్నారా.. 
కొట్లాటకు వస్తున్నారా.. పవన్‌..? 

సీఎం వైయస్‌ జగన్‌ పేదలను, జనాన్ని నమ్ముకున్నారు. ప్రజల కోసం తప్ప ఆర్థిక సంపద గురించి చూడనని చెబుతున్నారు. మా రైతులు నిజంగానే రెక్కాడితే గానీ డొక్కాడని మనుషులు.. కష్టపడితే గానీ కడుపునిండని మనుషులకు మంచి హృదయంతో పత్రాలు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అమరావతి కోసం బెంజ్‌ కార్లు ఎక్కి తొడకొడుతున్న వారు రైతులా..? కష్టపడి కూలి పనిచేసుకొని బతికే రైతుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ పత్రాలు అందజేస్తున్నారు. 

అవనిగడ్డ కోసం..
అవనిగడ్డను– కోడూరును కలిపే దారి 14 కిలోమీటర్ల దారి చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్డు మంజూరు చేయాలి. అవనిగడ్డకు దగ్గరలో ఉన్న ఎడ్లంక అనే గ్రామం గత మూడేళ్ల నుంచి వరదల మూలంగా ఇబ్బందులు పడుతున్నాం. దానికి పరిష్కారం చూపాలి. అవనిగడ్డ డ్రైనేజీ సిస్టమ్‌ బాగు చేయాలి. ఎదురుమండె, అంశల దీవి దగ్గర నదులు ఉన్నాయి. ఆ రెండు పక్కల కట్టలు పాడైపోయాయి. దానితో పాటు సముద్రం కట్ట కూడా పాడైపోయింది. దాన్ని చేసిపెట్టాలి. అవనిగడ్డలో కిడ్నీ రోగులు ఎక్కువమంది ఉన్నారు. ప్రతీ మూడు రోజులకు డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తుంది. గవర్నమెంట్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్, చల్లపల్లి వద్ద ఫైర్‌ స్టేషన్‌ పెట్టాలని కోరుకుంటున్నాన‌ని ర‌మేష్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

తాజా వీడియోలు

Back to Top