ఆ విద్యార్థిని చ‌దువుక‌య్యే రూ.50 ల‌క్ష‌ల ఖ‌ర్చు నేనే భ‌రిస్తా..

మ‌రోసారి త‌న మంచిమ‌న‌సు చాటుకున్న ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు

వాత్సల్యశ్రీ ఎంబీబీఎస్‌ చదివేందుకు అయ్యే ఖర్చు రూ.50లక్షలు భ‌రిస్తాన‌ని వెల్ల‌డి

ప్రొద్దుటూరు: వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మరోమారు తన మంచితనాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని నిరుపేద ఎస్సీ విద్యార్థిని వాత్సల్యశ్రీ రష్యాలో ఎంబీబీఎస్‌ చదివేందుకు అయ్యే ఖర్చు రూ.50లక్షలు తానే భ‌రిస్తాన‌ని ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థినికి పాస్‌ పోర్టు, వీసాను తెప్పించానని వివ‌రించారు. పట్నం వాత్సల్యశ్రీకి ఎంబీబీఎస్‌ చదవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు. విద్యార్థిని కరాటేలో కూడా రాణించిందన్నారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తనకు వివరించడంతో రూ.2లక్షలు వెచ్చించి కోచింగ్‌ ఇప్పించానన్నారు. 

రష్యా ఏషియన్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీబీఎస్‌ సీటు రావడంతో వాత్స‌ల్య‌శ్రీ‌ తనను కలిసిందని,  తాను ఏమాత్రం ఆలోచించకుండా ఆరేళ్లు చదవడానికి అయ్యే ఖర్చు రూ.50లక్షలను భరిస్తానని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకు కొత్త కాదని, ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తాను సాయం చేశానన్నారు. 

ఎవరికై నా చదువే రాజమార్గమని చెప్పారు. ఇందు కోసమే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందన్నారు. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. విద్యావంతుల కుటుంబంలో జన్మించిన తాను పేదరికంతో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డానని, కేవలం విద్య కారణంగానే తన కుటుంబం మళ్లీ యధాస్థితికి వచ్చిందన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగాలంటే విద్య ద్వారానే సాధ్యమని తెలిపారు. విద్యతోనే నాగరికత అలవడుతుందన్నారు.

పట్నం వాత్సల్యశ్రీ మాట్లాడుతూ గాడ్‌ ఫాదర్‌ లాంటి ఎమ్మెల్యే రాచమల్లుతోనే డాక్టర్‌ వాత్యల్సశ్రీ అవుతానని అన్నారు. తన తండ్రి శ్రీనివాస్‌ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఉంటూ గుండెపోటుతో మరణించాడని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు గురించి తెలుసుకుని సంప్రదించానన్నారు. పెద్ద మనసుతో స్పందించిన ఆయన తన చదువుకు సహకారం అందిస్తున్నారన్నారు. త‌న కుమార్తెను పెద్ద చ‌దువులు చ‌దివిస్తున్న ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లుకు విద్యార్థి వాత్స‌ల్య‌శ్రీ త‌ల్లి సునీత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top