కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి

రెవెన్యూ డివిజన్‌ను కొనసాగిస్తానన్న సీఎంకు కృతజ్ఞతలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి

అసెంబ్లీ: కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కోరారు. శాసనసభ జీరో అవర్‌లో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో ఉండే కందుకూరు నియోజకవర్గం ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో నెల్లూరుకు చేర్చారని, నెల్లూరు అనేది బహుదూరమైన ప్రాంతం, సుమారు 120 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని, కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒంగోలులోనే ఉంటే సౌలభ్యంగా ఉంటుందని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. 

అతి పురాతనమైన, అతి పెద్దదైన రెవెన్యూ డివిజన్‌ను సంపూర్ణంగా రద్దు చేసినట్టు ప్రాథమిక నోటిఫికేషన్‌లో తెలియజేశారని, ఈ సమస్యను సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించేలా చూస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ను కేవలం 4 మండలాలతో కాకుండా గతంలో మాదిరిగా కొనసాగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 250 మందికి పైచిలుకు హోంగార్డులు తెలంగాణలో పనిచేస్తున్నారని, వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. 
 

Back to Top