స్కోచ్‌ అవార్డులు చూసి ఓర్వలేక చార్జ్‌షీట్‌ డ్రామా

ఊపిరిపోసుకుంటున్న రాష్ట్ర భవిష్యత్తును చిదిమేసింది చంద్రబాబే

చార్జ్‌షీట్‌ ఏదైనా వేయాల్సి వస్తే.. టీడీపీపైనే వేసుకోండి

సంక్షేమాన్ని ప్రతీ గడప వద్దకు చేర్చిన సీఎం వైయస్‌ జగన్‌పై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..?

ఐదేళ్లు మోసం, వంచన ఆధారంగానే టీడీపీ పాలన సాగింది

జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాశాడు

చంద్రబాబు మోసాలపై చర్చించడానికి మేము సిద్ధం

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

తాడేపల్లి: అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేసి.. అప్పుడే ఊపిరిపోసుకుంటున్న రాష్ట్ర భవిష్యత్తును చిదిమేసిన తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 95 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మీద చార్జ్‌షీట్‌ వేయడం హాస్యాస్పదం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. పేదవారి ఆరోగ్యాలను, ప్రాణాలతో చెలగాటమాడి ఈఎస్‌ఐ స్కామ్‌ చేసి.. కార్మికుల మందుబిల్లలు కూడా అమ్ముకున్న అచ్చెన్నాయుడు చార్జ్‌షీట్‌ వేయడం హాస్యాస్పదమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి, అప్పులపాలు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని కాపాడుతుందంటే.. దెయ్యాలు వేదాలు వల్లించడమే. చంద్రబాబు ఐదు సంవత్సరాలు చేసిన పాపాలకు జనాలు ఛీత్కరించి 23సీట్లు ఇచ్చి ఇంటికి పరిమితం చేసినా.. సిగ్గులేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. 

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి రాష్ట్ర ప్రజలను వంచించాడా.. మోసం చేశాడా.. వెన్నుపోటుపొడిచాడా లేదా అని చర్చిండానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో ఆశలు రేకెత్తించి.. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ, నిరుద్యోగ భృతి, ఇళ్ల స్థలాలు ఇలా 600 హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన మొదటిరోజే ఇది సాధ్యం కాదని తప్పించుకొని పారిపోయిన చంద్రబాబు మోసగాడు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటినీ అమలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌పై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..? 

ఊరూరా జన్మభూమి కమిటీలు పెట్టి సర్పంచ్‌ల హక్కులను చంద్రబాబు కాలరాశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలను తమ చెప్పులకింద బానిసలుగా చూశారు. పెన్షన్, ఇళ్ల స్థలం, ఏదైనా సంక్షేమ కార్యక్రమం కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు సంక్షేమ పథకాలు పొందడం పేద ప్రజల హక్కు, ఎవరూ మధ్యలో దళారీలు ఉండకూడదని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే సంక్షేమ సాయం అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌పై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..? 

అధికారంలో ఉన్నప్పుడు తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా..? అని ఎస్సీ, బీసీలు, మహిళలను కించపరిచింది చంద్రబాబే. ఈరోజు సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీ, బీసీలకు రాజకీయ గుర్తింపు ఇవ్వడమే కాకుండా అన్నింట్లో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టాన్ని చేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టాన్ని చేసిన వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గులేదా..? 

అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కోసం వ్యాపారస్తులు, బాబాలకు కొన్ని వేల ఎకరాలు అప్పనంగా చెప్పిన చంద్రబాబు.. కనీసం 100 ఎకరాలు కొని ఎప్పుడైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడా..? సీఎం వైయస్‌ జగన్‌ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మిస్తున్నారు. పేదలకు జీవితం మీద భరోసా కల్పించిన ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌ వేయడానికి సిగ్గుందా..? 

చార్జ్‌షీట్‌ ఏదైనా వేయాల్సి వస్తే..  అది తెలుగుదేశం పార్టీపై వేసుకోండి. 5 సంవత్సరాలు మోసం, వంచన ఆధారంగానే టీడీపీ పాలన సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన భరోసా తుంగలో తొక్కిన విషయాన్ని ప్రజలంతా గుర్తుచేసుకోవాలి. అప్పులు అంటున్నారు.. 4 లక్షల కోట్ల అప్పులు చేసి, రూ.60 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా చంద్రబాబు చిదిపేసిన విషయం వాస్తవం కాదా..? సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తుంటే.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసి.. పేదల కోసం ఖర్చు చేస్తుంటే.. టీడీపీ నిసిగ్గుగా సంక్షేమ పథకాలు కొనసాగడానికి వీల్లేదని కేంద్రం దగ్గరకు వెళ్లి, బ్యాంకులు అప్పులు ఇవ్వొద్దు అని మాట్లాడేందుకు సిగ్గుందా..? 

జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాశారు. దోపిడీ కోసం, మాఫియా కోసం మహిళా అధికారులను సైతం జుట్టుపట్టుకొని ఈడ్చి దాడులు చేశారు. అధికారమదంతో సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు దౌర్జన్యం చేశారు. వాటిని విధ్వంసం అంటారు. ఐదు సంవత్సరాలు అధికారమదంతో విచ్చలవిడిగా కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ను ప్రోత్సహించి మహిళలను కించపరిచారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. 600 పేజీల మేనిఫెస్టోలో కొన్ని వందల హామీలిచ్చి ఆఖరకు ఆ మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించి.. సిగ్గులేకుండా పరిపాలించిన టీడీపీది వంచన. రెండు పేజీల మేనిఫెస్టో, నవరత్నాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ది వంచనా..?

రాష్ట్రంలోని పేదల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశాడా..? ఎంతసేపు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, అమరావతిలోనే లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశారు తప్పితే.. ఎప్పుడైనా పేదల కోసం ఏదైనా కార్యక్రమం చేశారా..? స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటిస్థానం వచ్చింది. దాన్ని చూసి ఓర్వలేక చార్జ్‌షీట్‌ పెట్టారా..? దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, విధానాలు బ్రహ్మండంగా ఉన్నాయని సాక్షాత్తు ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే మెచ్చుకుంటున్నారు. టీడీపీ వంచకులకు మాత్రం అవి కనిపించడం లేదు. 

Back to Top