చంద్రబాబు పాలసీ ‘షో బ్యాగ్‌.. సీ బ్యాగ్‌  

 ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌​ ద్వారా చంద్రబాబు లబ్ది పొందారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి

అమరావతి : చంద్రబాబుది షో బ్యాగ్‌..సీ బ్యాగ్‌ పాలసీ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభివర్ణించారు. చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ అనుభవం ఉందని గతంలో అధికారం కట్టబెడితే.. ఎన్ని విధాలుగా అవినీతికి పాల్పడవచ్చో, ఎన్నిరకాలుగా స్కామ్‌లు చేయవచ్చో చేసి చూపించారని విమర్శించారు. రాజధాని ఎక్కడ వస్తుందో తన అనుచరులకు ముందుగానే లీకులు ఇచ్చి పేద రైతుల భూములను కొట్టేశారని ఆరోపించారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో చంద్రబాబుకు చెందిన వ్యక్తులు తక్కువ ధరకే వేల ఎకరాల భూములను కొన్నారని ఆరోపించారు.

చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోకుండా తనకు అనుకూలంగా మార్చుకొని పేద రైతులను మోసం చేశారని మండిపడ్డారు. వికేంద్రీకరణకు అందరూ మద్దతు ఇస్తుంటే.. తన అక్రమ ఆస్తులు తరలిపోతాయనే చంద్రబాబు ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు శ్రీబాగ్‌ ఒడంబిక గురించి తెలియదు కానీ ‘క్యాష్‌ బ్యాగ్‌’ గురించి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ‘షో బ్యాగ్‌.. సీ బ్యాగ్‌’ అనేదే చంద్రబాబు పాలసీ అని విమర్శించారు. చంద్రబాబుకు సొంత అభివృద్ధి, సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌​ ద్వారా చంద్రబాబు లబ్ది పొందారని ఆరోపించారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనలేదా అని నిలదీశారు. నారాయణ దగ్గర పనిచేసే అటెండర్లు, క్లర్క్‌ల పేరుతో 55 ఎకరాలు కొన్నారన్నారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.2లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 800 మంది తెల్లరేషన్‌ కార్డు దారులు కూడా రాజధానిలో భూములు కొన్నట్లు చూపిస్తున్నారని.. వారంతా చంద్రబాబు బినామీదారులే అని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం హయంలో దళితులు, నిరుపేదలు దారుణంగా మోస పోయారన్నారు. అధికారం ముసుగులో టీడీపీ నేతలు చేసిన దోపిడీని మొత్తాన్ని త్వరలోనే బయటకు తీస్తామన్నారు. రాజధాని విషయంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు.

Back to Top