తాడేపల్లి: బ్యాంకులను కొల్లగొట్టడంలో చంద్రబాబు అండ్ కో విజయ్ మల్యా, నీరవ్ మోడీలను మించిపోయారని, దావూద్ ఇబ్రహీం కంటే ఘోరంగా దేశంపై పడి దోచుకుంటున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి నీడలో కూరుకుపోయిన తొత్తులంతా దేశం మీద పడి ఎక్కడ పడితే అక్కడ బ్యాంకులను లూటీ చేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో గ్యాంగ్ స్టర్స్‌ని, స్కామ్ స్టర్స్‌ని ఏం చేయాలో అర్థం రావడం లేదన్నారు. రాయపాటి సాంబశివరావు చేసిన రూ.7,296 కోట్ల స్కామ్‌లో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలని సవాల్ విసిరారు. రాయపాటి దోచుకున్న సొమ్ములో చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు ఎంత ఇచ్చాడో చెప్పాలని, నీతివంతమైన పాలన చేశాను.. నిప్పును అని చెప్పుకునే చంద్రబాబు ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘చంద్రబాబు నంగనాచిలా మీడియా ముందుకు వచ్చిన మాట్లాడుతున్నాడు. సూటిగా ప్రశ్నిస్తున్నా.. రాయపాటి సాంబశివరావు చేసిన రూ.7,296 కోట్ల స్కామ్‌లో చంద్రబాబు వాటా, తెలుగుదేశం పార్టీ వాటా ఎంతో చెప్పాలి. బాబుకు వాటా లేకపోతే ఎందుకు నోరు మెదపడం లేదు. పోలవరం కాంట్రాక్ట్‌ను రాయపాటికి ధారాదత్తం చేసింది నువ్వు కాదా..? రాయపాటి సాంబశివరావు కంపెనీని నెత్తిన పెట్టుకొని మోసింది నువ్వు కాదా..? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. నీతిమంతుడిని అని చెప్పుకునే చంద్రబాబు అమరావతి కుంభకోణంపై ఎంక్వైరీ వేస్తే.. గ్యాగ్ రిపోర్టు ఎందుకు తెచ్చుకున్నావ్..? సుజనా చౌదరి, సీఎం రమేష్, బొల్లినేని రామారావు, గంటా శ్రీనివాసరావు, వాకాటి నారాయణరావు బ్యాంకులను దారుణంగా మోసం చేశారు. వీళ్లంతా నీ తాబేదారులు కాదా..? వీళ్లంతా వేల కోట్ల రూపాయల బ్యాంకుల సొమ్మును లూటీ చేయలేదా..? వీళ్లపై కేసులు పెట్టలేదా..? రాయపాటి సాంబశివరావు మీద సీబీఐ చేసిన దాడుల్లో రూ.7,296 కోట్లు బ్యాంకులను మోసం చేశాడని తేలింది. దీనిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదని సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఈడీ, సీబీఐపై అపారమైన నమ్మకం ఉందని చెప్పిన చంద్రబాబు.. ఈ రోజు రాయపాటి లూటీ బాగోతం సీబీఐ తేల్చితే ఎందుకు నోరు మెదపడం లేదు. రాయపాటి నీ మనిషి కాదా..? నీ పార్టీ లో పార్లమెంట్ సభ్యుడిగా చేయలేదా..? పోలవరం కాంట్రాక్ట్‌ను నువ్వు అప్పగించలేదా...? ట్రాన్స్‌రాయ్ కంపెనీని నెత్తి మీద పెట్టుకొని మోయలేదా..? దీనిపై వివరణ ఇవ్వాలి. రాయపాటి దోచుకున్న సొమ్ములో చంద్రబాబు వాటా ఎంత.. టీడీపీ వాళ్లకు ఎంత ఇచ్చాడో తేలాలి. దీనిపై సవాల్ చేస్తున్నాను. సవాల్‌ను స్వీకరించే సత్తా.. దమ్మూ, ధైర్యం 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఉందా..? నీతివంతమైన పాలన చేశాను.. నిప్పును అని చెప్పుకునే చంద్రబాబు ఈ సవాల్‌ను స్వీకరించాలి. నీ ఆస్తుల మీద సీబీఐ ఎంక్వైరీకి నువ్వే లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను. భూతు పత్రికలో ఒక కథనం చూశాను. కాంట్రాక్ట్‌లన్నీ వైయస్‌ఆర్ సీపీ మంత్రులకు కట్టబెట్టారని భూతు పేపర్‌లో రాశారు. ఈ రోజు సీఎం వైయస్ జగన్ పాలనలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా జరుగుతుంది. ఏ కాంట్రాక్ట్ అయినా సరే రివర్స్‌టెండరింగ్ ద్వారా జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపిస్తూ ప్రతీది పారదర్శకంగా చేస్తున్న ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. భూతు పత్రికల్లో రాసినంత మాత్రాన ప్రజలెవరూ నమ్మరు. ఆ కథనాల ఆధారంగా పనికిమాలిన వాళ్లు ప్రెస్‌మీట్ పెట్టినా ప్రజలెవరూ విశ్వసించరు’ అని ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు.