విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తెలుగువారి ఆత్మగౌరవం

32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన ప్లాంట్‌.. 40 వేల మందికి ఉపాధినిస్తోంది

ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

అసెంబ్లీ: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ నినాదంతో దాదాపు 32 మంది ప్రాణత్యాగం వల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ప్లాంట్‌ మీద అత్యధికమంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని, 20 వేల మంది ప్రత్యక్షంగా మరో 20 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. వాల్తేరు నగరంగా పిలుచుకునే విశాఖపట్టణానికి ఉక్కునగరంగా పేరు వచ్చిందంటే అది విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వల్లే అని అందరికీ తెలుసన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ మాట్లాడారు. 

కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఫిబ్రవరి17న సీఎం వైయస్‌ జగన్‌ విశాఖపట్నం వచ్చినప్పుడు దాదాపు 23 కార్మిక సంఘాలు సీఎంతో సమావేశమయ్యాయి. అసెంబ్లీలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాట ప్రకారం సభలో తీర్మానం ప్రవేశపెట్టారన్నారు.

ఇంకా ఏం మాట్లాడారంటే..
స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటులో దాదాపు 26 వేల ఎకరాలు సేకరించారు. 64 గ్రామాలు ఖాళీ అయ్యాయి. దాదాపు 16,500 నిర్వాసితులు ఉన్నారు. వారిలో 50 శాతం మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రాలేదు. కేవలం 8500 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. 2002 నుంచి 2015 వరకు దాదాపు 13 సంవత్సరాల పాటు లాభాలు అర్జించింది. ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌ అనుభవంలో ఉన్న 19,700 ఎకరాలు దాదాపు లక్ష నుంచి 2లక్షల కోట్ల విలువైన సంపద. సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి రాసిన లేఖలో కూడా పలు కీలక సూచనలు చేశారు. 

కేంద్ర ప్రభుత్వానికి అధికారంతో పాటు బాధ్యత కూడా ఉండాలి. కేంద్రం బాధ్యతతో ఉండిఉంటే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన వచ్చి ఉండేది కాదు. చరిత్రపై కేంద్ర ప్రభుత్వానికి గౌరవం ఉన్నట్టుగా కనిపించడం లేదు. స్టీల్‌ ప్లాంట్‌ ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌గానూ, ఆ ప్రాంత ప్రజల సమస్యగా చూడొద్దు.. స్టీల్‌ ప్లాంట్‌ తెలుగువారి ఆత్మగౌరవం. స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలు చూపించి ప్లాంట్‌ను అమ్మేయాలనే ప్రయత్నం మానుకోవాలి. బీహెచ్‌పీవీని, హిందుస్థాన్‌ షిప్‌యార్డును ప్రైవేట్‌పరం చేయాలని చూస్తే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా వచ్చి మాటిచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే బీహెచ్‌పీవీని బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేశారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు డిఫెన్స్‌ నుంచి ఆర్డర్స్‌ తీసుకువచ్చి కాపాడిన ఘనత వైయస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. 
 

Back to Top