ప్ర‌తిప‌క్షం ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా..?

సభ సజావుగా జరగనివ్వకుండా అడుగడుగునా అడ్డంపడతారా..?

అడ్డగోలుగా మాట్లాడేవారిని సస్పెండ్‌ చేయక మరేంచేస్తారు..?  

గందరగోళం సృష్టించేబదులు చంద్రబాబులా ఇంటిదగ్గరే ఉంటే సరిపోయేది కదా..?

టీడీపీ సభ్యుల తీరుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం

అసెంబ్లీ: ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి.. అదే నిజమని ప్రజలను నమ్మించాలనే దుర్బుద్ధితో ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శాసనసభా సంప్రదాయాలను గౌరవించకుండా టీడీపీ సభ్యులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం మొదలు.. నేటి వరకు సభలో టీడీపీ సభ్యుల తీరు ఏ విధంగా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఏదో వంకపెట్టుకొని ఇంటిదగ్గర కూర్చున్నాడని, ప్రతిపక్ష సభ్యులు కూడా సభకు వచ్చి గందరగోళం సృష్టించేబదులు ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది కదా.. అని చుర‌కంటించారు.  

సభ సజావుగా జరగనివ్వకుండా సస్పెండ్‌ అయ్యి బయటకొచ్చి స్పీకర్‌ సహకరించడం లేదని, అన్యాయంగా సస్పెండ్‌ చేశారని టీడీపీ స‌భ్యులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అంబ‌టి ధ్వ‌జ‌మెత్తారు.  ప్రతిపక్ష నేతలు వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనివ్వకుండా అడ్డంపడి గొడవలు చేస్తున్నారన్నారు. పోడియం, వెల్‌లోకి, స్పీకర్‌ చైర్‌ దగ్గరకు వెళ్లి వేళ్లు చూపిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారన్నారు. ఇదేనా ప్రతిపక్షాలు ప్రవర్తించాల్సిన తీరు అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చించకుండా అడ్డగోలుగా మాట్లాడేవారిని సస్పెండ్‌ చేయక మరి ఏం చేస్తారన్నారు.  

జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయారని ప్రతిపక్షం నానా యాగీ చేస్తోందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెంలోని మరణాలన్నీ సహజ మరణాలని ఆరోగ్యశాఖ మంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో చెప్పినా ప్రతిపక్షం వినిపించుకోకుండా ప్రభుత్వంపై నెపం మోపాలనే దురుద్దేశంతో ప్రవర్తిస్తుందన్నారు. సారాయి, మద్యంపై ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అనుసరిస్తుందో ప్రజలకు తెలుసన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పెట్టి అక్రమ మద్యం తయారు, సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు.  

చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో అక్రమ మద్యంపై చేసిన దాడులు ఎన్ని, కేసులు ఎన్ని, ఎంతమందిని పట్టుకున్నారు.. ఎంతవరకు అరికట్టేందుకు ప్రయత్నం చేశారు..? అని ప్రశ్నించారు. 2016లో 47 వేల కేసులు, 2017లో 13 వేల కేసులు, 2018లో 11 వేల కేసులు పెట్టారని ఎమ్మెల్యే అంబటి చెప్పారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ ఒక వ్యవస్థను క్రియేట్‌ చేశారని, 2020–22 కాలంలో ఏకంగా 92 వేల కేసులు పెట్టి అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయించారని గుర్తుచేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top