తాడేపల్లి: మార్ఫింగులు, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ టీడీపీయే, ఆ పార్టీ అధికారిక ఖాతా నుంచే అసభ్యకర పోస్టింగ్స్ వస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి వెల్లడించారు. `వైఫల్యాలు ప్రశ్నించడం నేరం’ అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ దిశలోనే కేసులు నమోదు చేయడంతో పాటు, అక్రమ అరెస్టులు చేస్తూ, వేధింపుల పర్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తప్పు చేయని వారిని దోషులుగా చిత్రీకరిస్తూ.. తప్పు చేసిన వారిని దొరలుగా.. తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. అధికార పార్టీ చేసే తప్పులను ఒప్పులుగానూ.. ప్రతిపక్షాలు చేసే మంచిని కూడా చెడుగా ఎల్లో మీడియా చిత్రీకరించి ప్రజలను వంచన చేస్తోందని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్‌రెడ్డి చెప్పారు. దుష్ట సంప్రదాయం పోవాలి: – ఈ దుష్ట సాంప్రదాయాన్ని రూపుమాపకపోతే నిజాయితీగా బతికే వారికి సమాజంలో స్థానం ఉండదు. – అందుకే నిజాయితీగా ఉండే వారికి సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, డీజీపీతో పాటు, సమాజంలో ఉన్న మేథావులు, న్యాయవాద సంఘాలు, పార్టీల్లో ఉన్న ఉన్నతమైన వ్యక్తులు, పౌర హక్కులు, మానవ హక్కులు, ప్రజా సంఘాలు అండగా ఉండాలి. ఆ పోస్టుల్లో వ్యంగ్యం తప్ప..: – ఇంటూరి రవికిరణ్ పోస్టుల్లో వ్యంగ్యమే తప్ప అశ్లీలత లేదు. ఆయన తన పోస్ట్‌ల్లో వ్యంగ్యమైన భాష, చిత్రాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. – కానీ, అలా ప్రశ్నించినందుకు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 20 కేసులు పెట్టి వేధిస్తున్నారు. – తను హృద్రోగి అని తెలిసినా, కాలికి ఆపరేషన్ జరిగి ఉన్నా, వైద్యులు విశ్రాంతి అవసరం అని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. – కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ 99 శాతం ఎలా ఉందని ప్రశ్నిస్తూ ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఎలన్ మస్క్ చేసిన పోస్టింగ్‌కు ముడిపెడుతూ ఇంటూరి చేసిన వ్యంగ్య పోస్టులో ఏం తప్పు ఉందో మేథావులు ఆలోచించాలి. – రాజకీయ అక్రమ సంబంధాలు అంటూ చంద్రబాబు పొత్తులపై విమర్శించిన పోస్టు, డైవర్షన్ పాలిటిక్స్‌పై మరో పోస్టు.. ఇలా ప్రభుత్వాన్ని వ్యంగ్యమైన భాషతో చంద్రబాబు ఫొటోలతోనే ప్రశ్నించడమే రవికిరణ్ చేసిన తప్పా?. – తిరుమల ప్రసాదంపై, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంపై, కల్తీ మద్యం సరఫరాపై, చంద్ర మండలాన్ని దాటిన చంద్రబాబు దోపిడీ అంటూ విజయవాడ వరద బాధితులకు పరిహారం పంపిణీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?. (..అంటూ ఇంటూరి రవికిరణ్ పోస్టులు చూపారు) టీడీపీ అధికారిక ఖాతా నుంచే..: – నిజానికి టీడీపీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో, బుడమేరు బుడ్డోడు, శివుడు, మిస్టర్ యష్, అనే అకౌంట్ల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు అత్యంత అసభ్యకరంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌పై, పార్టీ మహిళా నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పెట్టిన మార్ఫింగ్ పోస్టులు ప్రదర్శించారు. – సీఎంగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌పై దాడి జరిగితే దానిని కూడా వదలకుండా ఏకంగా టీడీపీ ఎక్స్ ఖాతా నుంచి అసభ్యకరమైన మార్ఫింగ్ పోస్టులు పెట్టారు. (.. అంటూ ఆ మార్ఫింగ్ పోస్టులు కూడా చూపారు) – ఇంకా వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి గుండాలు దాడులు చేసి హతమారిస్తే వారిని పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకుడు వెళ్లడం కూడా తప్పే అన్నట్టు దారుణమైన భాషతో మార్ఫింగులు చేసిన పోస్టులు నేరుగా టీడీపీ ఖాతా నుంచే పోస్టు చేయడాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పవన్ కళ్యాన్ ఎలా సమర్ధించుకుంటారు?. (..అంటూ ఆ మార్ఫింగ్ పోస్టులు ప్రదర్శించారు) – రాష్ట్ర అప్పులపై కూడా ఆనాడు అడ్డగోలుగా అబద్ధాలు చెబుతూ పోస్టులు చేశారు. – ప్రతిపక్ష హోదా కావాలని కోరుతూ రాసిన లేఖపై కూడా మార్ఫింగ్ ఫొటోలతో తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు, కూటమి పార్టీ నాయకులు చేసిన తప్పులను కూడా ప్రతిపక్ష నాయకుడికి ఆపాదిస్తూ నిస్సిగ్గుగా మార్ఫింగు పోస్టులు చేసిన పార్టీ టీడీపీ. – టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో తెలుగుదేశం పార్టీని మించిన పార్టీ మరొకటి లేదు. లాకప్‌లో అర్థనగ్నంగా నిలబెట్టడతారా?: – యగ్నేశ్ అనే విద్యార్థిని రెండేళ్ల క్రితం ఒక యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడమే నేరం అన్నట్టు అర్థరాత్రి దొంగ మాదిరిగా పట్టుకొచ్చి వేధించారు. – పులి సాగర్ అనే రాజమండ్రికి చెందిన బీఎస్సీ బీఈడీ చదివిన దళిత విద్యావంతుడిని అరెస్ట్ చేయించి జైల్లో అర్థనగ్నంగా నిలబెట్టి కొట్టడం, దారుణమైన పదజాలంతో దూషించడం, చంపుతామని చెదిరించే హక్కు సీఐకి ఎవరిచ్చారు? – పెద్దిరెడ్డి సుధారాణి అనే వివాహిత మీద ఇప్పటికే 14 కేసులు పెట్టి దారుణంగా కొట్టి హింసించారు. ఏ పాపం తెలియని తన భర్తను కూడా ఏం సంబంధం లేకపోయినా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. బిడ్దలకు తల్లిదండ్రులను దూరం చేసి వేధిస్తున్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదు: – అధికార పార్టీ నేతలు, పై అధికారులను సంతృప్తి పర్చడమే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. – కానీ, ఈ ప్రభుత్వమే ఎప్పటికీ ఉండదనే విషయం పోలీసులు గుర్తుంచుకోవాలి. అందుకే అక్రమ కేసులతో వేధిస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. – ప్రైవేటు కేసులతో వారిని న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబెడతామని మనోహర్‌రెడ్డి తేల్చి చెప్పారు.