విశాఖపట్నం: కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో బాలికలు కలుషిత నీరు, ఆహారం వల్లే హెపటైటిస్ బారిన పడ్డారని.. ప్రభుత్వ పాఠశాలల్లో రక్షిత నీటితో పాటు కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. విశాఖ కేజీహెచ్ లో హెపటైటిస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాలికలను అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి, మాజీ మంత్రులు పుష్పశ్రీవాణి, సీదిరి అప్పలరాజుతో పాటు పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు విద్యార్థినులు చనిపోయారని... ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో విద్యారంగంలో అమ్మఒడి సహా నాడు-నేడు ద్వారా గొప్ప సంస్కరణలు చేసి పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు, టాయ్ లెట్లుతో సహా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తే... కూటమి ప్రభుత్వం పూర్తిగా విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే... ● పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్ధులను పరామర్శించాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన దాదాపు 170 మంది హెపటైటిస్ బారిన పడ్డం చాలా దారుణం. ఒక పాఠశాలకు చెందిన ఇంతమంది ఒకేసారి ఈ వ్యాధి బారిన పడ్డం చరిత్రలో ఎప్పుడే లేదు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు.ఇధి చాలా దురదృష్టకరం. నీళ్లు, ఆహారం కలుషితం కావడంతో పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించింది. గురుకుల పాఠశాలలో పిల్లలకు సరైన ఆహారం, నీళ్లు అందించలేదు. వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాపించింది. కనీసం స్కూళ్లో క్లోరినేషన్ కూడా చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంజలి అనే బాలిక హాస్టల్ లో వ్యాధి బారిన పడితే చికిత్స అందించకుండా ఇంటికి పంపించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అదే విధంగా కల్పన అనే మరో బాలికను తొమ్మది రోజుల పాటు అలు ఆసుపత్రుల్లో తిప్పి... చివరకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీహెచ్ కి తీసుకొచ్చి చనిపోయిందని చెప్పడం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే. గురుకుల పాఠశాలలో పిల్లలకు కన్న బిడ్డల్లా రక్షణ కల్పించాల్సిన చోట వాళ్లకు సురక్షితమైన మంచినీళ్లు, వైద్య సేవలు అందించకుండా చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా నిర్లక్ష్యం వహించి వారి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యే. ప్రజాసంఘాలు, ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ద్వారా జరిగిన ఈ హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్టీ కమిషన్ దీనిపై విచారణ చేపట్టాలి. హైకోర్టు, సుప్రీం కోర్టులు సుమోటాగా విచారణకు స్వీకరించాలి. గిరిజన ఆఢబిడ్డల ప్రాణాలకంటే ప్రభుత్వానికి అలుసుగా మారింది. గిరిజన బిడ్డలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ? కల్పిన అనే విద్యార్ధిని కేస్ షీట్ కూడా మార్చినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కల్పన హెపటైటిస్ ఏ తో చనిపోతే.. సెరబ్రల్ మలేరియా అని చెబుతున్నారు. మరోవైపు కురుపాం నియోజకవర్గంలో మరో ఇద్దరు యువకులు కామెర్లతో చనిపోయినా ప్రభుత్వం మొద్దునిద్రపోతుంది. నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ● గుమ్మా తనూజరాణి, అరకు ఎంపీ: దాదాపు 170 మంది గిరిజన బాలికలు హెపటైటిస్ ఏ వైరస్ సోకి అనారోగ్యం బారిన పడ్డారు. తాగునీటిలో మలం కలవడం వల్లే ఈ వ్యాధి బారిన పడ్డారు. వ్యాధి వచ్చిన తరువాత కూడా విద్యార్థులకు సరైన వైద్యం చెయ్యడం లేదు. చదువుకునే పిల్లలకు కనీస అవసరాలైన తాగునీటిని కూడాఅందించలేకపోవడం దారుణం. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయకపోవడం వల్లే ఈ వ్యాధి సోకింది. అధికారులు, ప్రభుత్వం నిర్లక్యం వల్లే గిరిజన బాలికలకు ఇలా జరిగింది. వ్యాధి బారిన పడిన బాలికలను, మిగిలిన వారి నుంచి దూరంగా పెట్టే ప్రయత్నం చేయలేదు. వారికి వ్యాక్సిన్ కూడా అందించలేదు. వ్యాధి బారిన పడ్డ బాలికలకు కూడా సకాలంలో సరైన వైద్యం అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ఇద్దరు బాలికలు మృతిచెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో ఈ ఘటనల ద్వారా అర్ధం అవుతుంది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైయస్.జగన్ గిరిజనులను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా అన్నిశాఖల సమన్వయంతో పనిచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై కచ్చితంగా జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకుపోతాం. ●డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి: కురుపాం గిరిజన సంక్షేమ గురుకులపాఠశాలకు చెందిన 77 మంది హెపటైటిస్ ఏ తో బాధపడుతూ కేజీఎచ్ లో చికిత్స పొందుతున్నారు. వారందరినీ పరామర్శించాం. మరో 140 మంది అదే స్కూల్ పిల్లలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇద్దరు బాలికలను చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికే మా పార్టీ నేతలు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఆదేశాలతో ఇవాళ బాధిత బాలికల ఆరోగ్యపరిస్థితి తెలుసుకునేందుకు మరోసారి పరామర్శించాం. వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం ప్రతినిధులు కలిసి బాలికల ఆరోగ్యపరిస్థితిపై కేజీహెచ్ వైద్యులతో మాట్లాడాం. గిరిజనులుగా పుట్టడమే మేము చేసిన పాపమా అని బాలికల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ● ఈ మంత్రులు రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం.. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి కూడా వచ్చి... కేవలం బాలికల వ్యక్తి గత శుభ్రత లేక ఈ వ్యాధి వచ్చింది అని ప్రకటించారు. ఆయనకు ఆరోగ్యశాఖ మంత్రి పదవి ఇవ్వడం రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాగా.. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఆమెని నియమించడం గిరిజనులకు శాపం. మంత్రులు కనీసం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. వైరల్ హెపటైటిస్ ఆహారం, నీళ్లు కంటామినేషన్ వల్లే వస్తుంది అనే విషయం తెలుసుకొని మంత్రి మాట్లాడాలి. మల మూత్రాదులు ద్వారా ఇది వ్యాపిస్తుంది. దాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత శుభ్రత లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మంత్రులు ఉండడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఈ 15 నెలల కాలంలో ఇలాంటివి 15 ఘటనలు జరిగాయి. తిరుపతిలోనూ, నంద్యాల జిల్లాలోనూ, నూజివీడు ట్రిపుల్ఐటీలో 400 మంది ఆసుపత్రి పాలయ్యారు. వైయస్.జగన్ హాయంలో ఇలాంటి ఒక్క ఘటన అయినా జరిగిందా ? ఈ ప్రభుత్వానికి అసలు బాధ్యతే లేదు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా వచ్చి 13 మంది చనిపోయారు... ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఆ రోజే ఈ ప్రభుత్వం చచ్చిపోయింది. జాతీయ స్ధాయిలో రాష్ట్రం పరువు పోయింది. బెంచీల మీద ట్రీట్మెంట్ చేశారు. ఇటీవల విజయవాడలో డయేరియాతో ముగ్గురు చనిపోయారు. తురకపాలెం గ్రామంలో 1000 మంది జనాభా ఉంటారు... కేవలం 1-2 నెలల వ్యవధిలో 44 మంది చనిపోయారు. చనిపోయింది వ్యక్తులు కాదు వారిని ఆదుకోలేకపోయిన వ్యవస్థలే చనిపోయాయి. గిరిజన బాలికలు ఎలా పోయినా ఈ ప్రభుత్వానికి పట్టదు. వారి ఆరోగ్యం ఎలా పోయినా ప్రభుత్వానికి పట్టదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. స్థానిక అధికారులు, ఐటీడీఏ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యమే. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖకు ఇప్పటికే ప్రభుత్వం తాళాలు వేసింది. మెడికల్ కాలేజ్ లు హాస్పిటల్స్, 108లు అన్ని అమ్మేస్తోంది. తాళం వేసిన వైద్య ఆరోగ్యశాఖ దుకాణానికి వైద్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే వ్యక్తి గత శుభ్రత అంటూ గిరిజన మంత్రి అనడం దారుణం. ఇది ముమ్మూటికీ గిరిజనుల మీద వివక్షే. ఈ ప్రభుత్వం మీద కచ్చితంగా ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ● డిప్యూటీ సీఎం జాడే కనిపించడం లేదు.. గిరిజనులకు చెప్పులు, దుప్పట్లు పంచిన డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్ దయార్ధ్రహృదయుడు అని వేయించుకుంటున్నారు. మరోసారి మామిడి పళ్లు పంపించారు అని మరో వార్త రాయించుకుంటారు. ఇదే పవన్ కళ్యాణ్ జలుబు అనే జబ్బుతో బాధపడుతుంటే.. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి పరామర్శిస్తారు. ఆయన ఐసీయూలో చేరుతారు. కానీ ఇంతమంది దళితులు, గిరిజన బాలికలు చనిపోతే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? వీరి అభివృద్ధి, సంక్షేమం కోసం మీ దగ్గర డబ్బులు ఉండవు కానీ మీరు మాత్రం ఒంటేలుకు కూడా హెలీకాప్టర్ లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. ఇంతమంది పిల్లలు ఆసుపత్రిలో ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వారిని పరామర్శించలేదు. మీ శాఖకు సంబంధించిన ఫెయిల్యూర్ కాదా ఇది? మా నాయకుడు వైయస్.జగన్ అంటరానితనం రూపుమాపబడలేదు.. రూపం మార్చుకుంది అని చెప్పారు. దాన్ని రూపుమాపడానికే నాడు-నేడు, అమ్మఒఢి, ఇంగ్లిషు మీడియం, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు, టాయ్ లెట్స్, కంప్యూటర్ విద్య వంటి అనేక సంస్కరణలు తీసుకొస్తే... అవన్నీ ఈ ప్రభుత్వంలో ఏమైపోయాయి. ఆర్వోప్లాంట్ ల నిర్వహణ లేదు, క్లోరినేషన్ లేదు దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ● బాధ్యులపై చర్యలు తీసుకోవాలి... ప్రత్యేక హెలీకాప్టర్ లలో హైదారబాద్, ముంబాయి, సింగపూర్ అంతా తిరిగి వీళ్లు తీసుకొచ్చిన పరిశ్రమ ఏదైనా ఉందంటే.. అది కేవలం నకిలీ మద్యం పరిశ్రమ మాత్రమే. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అంటూ చెబుతు హెలికాఫ్టర్ లో తిరుగుతున్నారు. ప్రభుత్వమే నిర్ధాక్షణ్యంగా గిరిజన పిల్లలను హత్య చేసింది. దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలి. వైయస్.జగన్ విశాఖ వస్తున్నారని తెలిసి హడావుడిగా పిల్లలను డిశ్చార్జ్ చేస్తున్నారు. కనీసం హెపటైటిస్ రాకుండా వ్యాక్సినేషన్ చేసే అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దానికి కూడా డబ్బులు లేవా ? దానికి కూడా పీపీపీ మోడ్ అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు గిరిజన పిల్లల మరణాలను సుమోటాగా తీసుకుని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.