ఖాకీ యూనిఫాం వేసుకుని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు

ఈసీకి వైయస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు

 అమరావతి: కొందరు ఖాకీ యూనిఫాం వేసుకుని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నార వైయస్ఆర్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైయస్ఆర్ సీపీ నేతలు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, గౌతం రెడ్డిలు మంగళవారం కలిశారు. టీడీపీ నేతలతో పాటు, వారి తాబేదారులుగా వ్యవహరిస్తోన్న పోలీసులు కోడ్‌ ఉల్లంగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సభల్లో సీఎం చంద్రబాబు ఎన్నికల నిబంధనలకు నీళ్లొదిలి వ్యక్తిగత విమర్శలు చేశారని గౌతం రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలతో రాక్షసపాలన సాగిస్తున్నారని విమర్శించారు. యథారాజ తథాప్రజ అన్నచందంగా టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు దారిలో నడుస్తున్నారని దుయ్యబట్టారు.

కార్మిక, ఉద్యోగవర్గాలువైయస్ఆర్ సీపీకి అండగా ఉన్నాయన్న కక్షతో ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు నూరు తప్పులు పూర్తయ్యాయని, మహాభారతంలో శిశుపాలుడికి శ్రీకృష్ణుడు వేసిన శిక్షనే ఎన్నికల సంగ్రామంలో ప్రజలు వేయబోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఏసీపీ పదవిలో ఉన్న మంత్రి సోదరుడు కింజారపు ప్రభాకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఖాకీ యూనిఫాం వేసుకుని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాగే మరో ఐదు మంది పోలీసు అధికారులు పక్షపాత ధోరణితో వైఎస్సార్‌సీపీ నేతలని, కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.

Back to Top