నీ జీవితంలో వైయస్‌ జగన్‌ స్థాయికి ఎదగలేవు

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను

పవన్‌ కల్యాణ్‌పై మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు ఫైర్‌

స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం నిర్ణయాన్ని బీజేపీ, టీడీపీ వక్రీకరిస్తున్నాయి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని..

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వెనుక కుట్ర జరుగుతోంది

సీఎస్‌ బదిలీకి కులం అనే ట్యాగ్‌ లేని విషప్రచారం

టీడీపీ ఉచితంగా ఇసుక ఇచ్చినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

కాకినాడ: లాంగ్‌మార్చ్‌ అని పేరుపెట్టి చైనాలో పదివేల కిలోమీటర్లు నడిచిన వారిని పవన్‌ కల్యాణ్‌ అవమానించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పండుల రవీంద్రబాబు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయికి పవన్‌ కల్యాణ్‌ జీవితంలో వెళ్లలేడన్నారు. ఇసుక అని విశాఖను సెలక్ట్‌ చేసుకొని, నడక అని చెప్పి కారు ఎక్కి, ఇసుక గురించి మాట్లాడుతాడనుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును తిట్టేందుకు పవన్‌ కల్యాణ్‌ సభ పెట్టినట్లుగా ఉందన్నారు. టీడీపీ ఏ విధంగా ఇసుకను దోచుకుంది. ఇసుక వల్ల ప్రభుత్వం ఎలా కూలిపోయిందనే విషయాన్నే పవన్‌ మర్చిపోయాడన్నారు. మంత్రి కన్నబాబును తిట్టేందుకే లాంగ్‌మార్చ్‌ పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని, ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

కాకినాడలోని ఆయన నివాసంలో రవీంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన అవగాహన లేనివారినంత పక్కన కూర్చోబెట్టుకొని పవన్‌ కల్యాణ్‌ అన్ని తప్పుల తడకలు మాట్లాడాడన్నారు. ఇసుక గురించి పవన్‌కు అసలు అవగాహనే లేదన్నారు. ఇసుక కోసం పోరాటం చేస్తే ఎవరైనా ఇసుక లభించే ప్రాంతాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని నదుల దగ్గరకు వెళ్లి మార్చ్‌ చేస్తే బాగుంటుంది.. కానీ విశాఖలో మార్చ్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇసుక గురించి ఏమైనా మాట్లాడుతాడా అని చూశాను కానీ, ఆ అంశాన్ని మర్చిపోయి మంత్రి కన్నబాబును తిడుతున్నాడన్నారు. కన్నబాబుకు ఇసుకకు, పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రజలకు ఏంటీ సంబంధం అని ప్రశ్నించారు. దయచేసి ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలు, స్టేజీ మీద బళ్లాలు బద్దలుకొట్టేయడం ఇకనైనా పవన్‌ మానుకోవాలని సూచించారు.

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత పవన్‌కు లేదన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన, ఆయన పథకాలను విమర్శించేస్థాయికి ఈ జన్మలో వెళ్లలేరన్నారు. మంత్రి కన్నబాబు చాలా సౌమ్యుడు.. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. పవన్‌ కల్యాణ్‌ జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని, ప్రవర్తన మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. వరదలు రావడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని, పదిహేను రోజుల్లో ఇసుక సమస్య లేకుండా చేస్తామన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చి ఉంటే ఆధారాలతో సహా చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.

ఇంగ్లిష్‌ మీడియం కేవలం ధనికులకే పరిమితం అవుతుందని, పేదవారు కూడా ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే.. పెద్ద పెద్ద చదువులకు వెళ్లినప్పుడు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సాధారణంగా ఎక్కడకు వెళ్లినా.. ఎవరిని అడిగినా మా అబ్బాయిని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో వేశామని చెబుతుంటారు. పేదవారికి ఎండమావిలా తయారైన ఇంగ్లిష్‌ మీడియం చదువును నిజం చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. దాన్ని కూడా చంద్రబాబు, పవన్, బీజేపీ, పచ్చమీడియా వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. తెలుగును బ్యాన్‌ చేయలేదని, పదో తరగతి వరకు తెలుగు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ వచ్చా అని వారిని కూడా అవమానించే రీతిలో టీడీపీ, బీజేపీ మాట్లాడుతున్నాయన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ నడిచేటప్పుడు కుడి కాలు ముందుగా ఎందుకు వేశాడనే స్థాయికి టీడీపీ, బీజేపీ, జనసేన వెళ్లిపోయాయన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న బదిలీలకు కూడా కులం అనే ట్యాగ్‌ను తగిలించే నీచ స్థితికి దిగజారారన్నారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తే దానికి బ్రాహ్మణ కులం పెట్టి విషప్రచారం చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వెనుక అగ్రకులాల కుట్ర జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని ధనిక పార్టీలైన బీజేపీ, టీడీపీలు వక్రీకరిస్తున్నాయన్నారు. దీనికి పచ్చమీడియా విపరీతమైన కాంట్రవర్సీ క్రియేట్‌ చేస్తుందని మ ండిపడ్డారు.

Read Also: దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?

Back to Top