ల్యాండ్‌ పూలింగ్‌ ప్రపంచంలోనే పెద్ద స్కామ్

 వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

‌ నిరుపేదలను బెదిరించి ఆ భూములపై అగ్రిమెంట్లు

పరిహారం రాదని బెదిరించి అసైన్డ్‌ భూములు లాక్కున్నారు 

ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో సవరణలు చేశారు

అందు కోసం జీఎం నెం.41 జారీ చేశారు

 చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే కేసు దర్యాప్తుకు సహకరించాలి
  
 చంద్రబాబుకు రాజధానిపై ప్రేమే లేదు 

తాడేపల్లి: అమ‌రావ‌తి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అన్న‌ది ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్కామ్ అని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి విమ‌ర్శించారు. తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌:
    ‘రాజధాని పేరు మీద భూముల సేకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) స్కీమ్‌ పెట్టి, చంద్రబాబు ఏ రకంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. రాజధాని ఎక్కడ పెడుతున్నారనేది వారికి తెలుసు కాబట్టి, తక్కువ రేటుకు భూమి కొని, ఆ తర్వాత ఎక్కువ ధరకు అమ్ముకోవడం లేదా ఆ భూములకు ధర వచ్చేలా చేయడం జరిగింది. దానిపై సీబీఐ విచారణ జరపాలని సీఎం గారు కూడా కోరారు’.

జీఓ నెం:41
    ‘దాంతో పాటు, పేదల భూములు కూడా కొల్లగొట్టారు. అసైన్డ్‌ భూములు బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి బినామీలు, తాబేదార్లు, చంద్రబాబు కోటరీలో ఉన్న వారు పేదల భూములను చౌక ధరకు అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ గైడ్‌లైన్సులకు సవరణలు చేసి, వారికి లబ్ధి చేకూర్చారు. అదే జీఓ నెం.41. దీంట్లో అప్పుడు సీఆర్డీఏ ఛైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు, మున్సిపల్‌ మంత్రి నారాయణ సంతకం కూడా ఉంది. అది అసైన్డ్‌ భూమి కాబట్టి, పరిహారం రాదని పేదలను బెదిరించి, అగ్రిమెంట్లు చేసుకుని, ఆ తర్వాత జీఓ నె.41 ద్వారా లబ్ధి పొందారు. ఈ కేసులో చంద్రబాబు ఏ–1గా ఉన్నారు’.

అతి పెద్ద స్కామ్‌:
    ‘ల్యాండ్‌ పూలింగ్‌ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద స్కామ్‌. అందులో భాగమే అసైన్డ్‌ భూములకు సంబంధించి ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో సవరణలకు నిర్దేశించిన జీఓ నెం.41. ఆ స్కామ్‌ల ద్వారా దూర, దురాలోచన చేసి, కేంద్ర బడ్జెట్‌ స్థాయిలో అక్రమాస్తులు సంపాదించాలన్న ఉద్దేశంతో పని చేశారు. కేవలం తమ వారికి లబ్ధి చేకూర్చడం కోసమే ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో సవరణలు చేస్తూ, జీఓ నెం.41 జారీ చేశారు. అంతకు ముందే నిరుపేద రైతుల నుంచి అసైన్డ్‌ భూములు లాక్కున్నారు. జీఓ నెం.41 ద్వారా ఆ భూములను కూడా ల్యాండ్‌ పూలింగ్‌లో చేర్చి ప్రయోజనం కల్పించారు’.

రాజధానిపై ప్రేమ లేదు:
    ‘అయితే వ్యవస్థలను మేనేజ్‌ చేసే తెలివితేటలు ఉన్న చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నిజానికి చంద్రబాబుకు రాజధానిపై ప్రేమ లేదు. అదే ఉంటే, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టేవాడు. కానీ ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వేల ఎకరాలు సేకరించి, రియల్‌ ఎస్టేట్‌ దందా చేశారు. దీనిపై ఆరోజు కూడా మేము మాట్లాడాము. కానీ ఇప్పుడు స్టే తెచ్చుకుని, తాము నిర్దోషులము అని చెప్పుకుంటున్నారు’.

కేసే లేదని చెప్పే ప్రయత్నం:
    ‘అయితే ఇప్పుడు వారు కొత్త వాదన మొదలు పెట్టారు. ప్రభుత్వం కొందరిని బెదిరించి, కేసులు పెట్టించారని ప్రయత్నం చేస్తున్నారు. సీఎం గారిపై బురద చల్లాలని చూస్తున్నారు. అసలు కేసే లేదన్న ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న స్టింగ్‌ ఆపరేషన్‌ అన్నారు. తమను ఈ ప్రభుత్వం వేధిస్తోందని చెప్పారు. అయితే మేము చెబుతోంది ఒకటే. జీఓ నెం.41 అనేది కేవలం, వాళ్ల వాళ్లందరూ చౌకగా అసైన్డ్‌ భూములు రాయించుకుని, ఈ జీఓ ద్వారా ల్యాండ్‌ పూలింగ్‌ గైడ్‌లైన్సులకు సవరణలు తీసుకువచ్చి, వారికి లాభం కలిగించారు’.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే..:
    ‘నాడు సీఆర్డీ ఛైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు ఉద్దేశాలు మంచివే అయితే, నిజంగా అసైన్డ్‌ భూములు కలిగి ఉన్న వారికి ప్రయోజనం కలిగించాలి. ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో అసైన్డ్‌ భూములను కూడా ఎందుకు చేర్చలేదు? వారికి కూడా న్యాయం చేయాలని చూడలేదు?. అంతే కానీ ఆ భూములు రాయించుకుని, వారికి మాత్రమే ప్రయోజనం కల్పించారు’.
    ‘2015 జనవరిలో రాజధాని గురించి చెప్పి, రాజధాని గురించి ముందే తెలుసుకుని కామ్‌గా భూసేకరణ చేశారు. 2016 ఫిబ్రవరిలో ల్యాండ్‌ పూలింగ్‌ చట్టానికి సవరణలు చేశారు. అప్పటికే పేదల నుంచి అసైన్డ్‌ భూములు రాయించుకున్నారు. అలా పేదలకు చాలా అన్యాయం చేసి, కేవలం పెద్దలకు మాత్రమే జీఓ నెం.41 ద్వారా ప్రయోజనం కల్పించారు’.

అధికారులు చెప్పినా!:
    ‘ఇది రెవెన్యూ అధికారుల ద్వారా జరిగింది కాదు. నాడు సీఆర్డీఏ ఛైర్మన్‌ ఏకంగా సీఎం చంద్రబాబునాయుడు. పీఓటీ, అసైన్డ్‌ భూములతో సమస్యలు వస్తాయని నాటి సీఆర్డీఏ అధికారి ఎన్‌.శ్రీకాంత్‌తో పాటు, రెవెన్యూ, న్యాయ శాఖ కార్యదర్శులు చెప్పినట్లు రికార్డులో కూడా ఉంది. జీఓ నెం.41 ద్వారా అసైన్డ్‌ భూములు, ఇతర భూములను కూడా ల్యాండ్‌ పూలింగ్‌లో చేర్చారు. ఇంత పెద్ద కుంభకోణం అంత పచ్చిగా కళ్ల ముందు కనిపిస్తున్నా, వారు సమర్థించుకుంటున్నారు. 

ఏ తప్పూ చేయకపోతే?:
    ‘చంద్రబాబు నాయుడులో నిజాయితీ ఉంటే, నిజానికి ఆయన ఏ తప్పూ చేయకపోతే సీఐడీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి. కానీ ఆయన పలాయనం చిత్తగించారు. ఇప్పుడు కేవలం స్టేతో తప్పించుకున్నారు. కానీ ఎప్పటికైనా రాక తప్పదు. ఇక లంక భూములు. వాటిలో కూడా అక్రమాలు చేశారు. ఇంకా చెప్పాలంటే ఎక్కడా లేని విధంగా ప్లాట్ల ధరలు ఉంటాయని చెప్పి మోసం చేశారు. రాజధాని పేరుతో దీర్ఘకాలం లక్ష కోట్లు దోచుకోవాలని చూశారు. అన్యాయంగా పేదల భూమి తీసుకున్నారు. వారికి నష్టం కలిగించారు. నిజానికి వారికి సహాయం చేయాల్సింది పోయి, భయపెట్టి భూములు తీసుకున్నారు’.

వారే వచ్చి చెప్పాలా?:
    ‘ఎవరైతే ఫిర్యాదు చేశారో, వారితో ఇప్పుడు తాము అలా చేయలేదని చెప్పిస్తున్నారు. ఆ విధంగా అసలు ఇది కేసు కూడా కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కుంభకోణం జరిగిందని చెప్పడానికి ఫిర్యాదుదారుడు అవసరమా? మోసం జరిగిందని చెప్పడానికి, మోసానికి గురైన వారే వచ్చి చెప్పాలా? మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) ఎలా సాగుతున్నాయి?. అక్కడ పేద రైతులను మోసం చేసిన మాట వాస్తవమే కదా? దానికి ఎప్పటికైనా దోషిగా నిలబడక తప్పదు కదా?’.

అర్ధం లేని పోలిక:
    ‘నాడు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.41ని, ఇప్పుడు ఈ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.72తో పోలుస్తున్నారు. నిజానికి జీఓ.72 పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీఓ. అయినా టీడీపీ నేతలు జీఓ నెం.41తో జీఓ నెం.72తో పోలుస్తున్నారు. విశాఖలో దాదాపు 1.50 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీఓ నెం.72. ఇక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదు’.

చిట్కాలతో ఎదుర్కోవాలని!:
    ‘గుడిని, గుడిలో లింగాన్ని మింగే తపనలో గొంతుకు అడ్డుపడి చంద్రబాబు గింజుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కేసు నుంచి బయట పడలేదు. చిత్తశుద్ధి ఉంటే, తప్పు చేయకపోతే సీఐడీ ముందుకు వచ్చి చెప్పాలి. లేకపోతే చేసిన తప్పుకు ఎప్పటికైనా శిక్ష తప్పదు. దానికి సిద్దంగా ఉండాలి. అంతే కానీ చిన్న చిన్న చిట్కాలతో దాన్ని ఎదుర్కొని, కేసు లేదని చెప్పించే ప్రయత్నం ఆయన సహజ బుద్ధికి అనుకూలంగా ఉంది’.

బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ గోప్యత కాదు:
    ‘టీడీపీ వారు వెనక ఉండి నడిపించిన ఎస్‌ఈసీ వ్యవహారంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కాస్త వెనక్కి పోయింది. బడ్జెట్‌ అనేది ఎప్పటికైనా పెట్టక తప్పదు. ఎందుకంటే అందులో ఏమీ దాపరికం లేదు. బడ్జెట్‌పై ఆర్బినెన్స్‌ జారీకి కారణాలు కూడా స్పష్టంగా చెప్పాం. తిరుపతి ఉప ఎన్నిక. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సెషన్‌ ఎప్పుడైనా ఎక్కువ రోజులు నడపాలన్నదే మా ఉద్దేశం. ఆర్డినెన్స్‌ జారీ చేయడం అంటే ప్రభుత్వం ఏమీ దాచి పెట్టడానికి కాదు కదా?’.
    ‘ఇందులో ఏం లేదని యనమల రామకృష్ణుడుకు కూడా తెలుసు. అందుకే ఒక స్టేట్‌మెంట్‌. ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారు’.. అని ఒక ప్రశ్నకు సమాధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

తాజా వీడియోలు

Back to Top