బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ హామీలకు ఎగ‌నామం

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం: రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన 2025–2026 వార్షిక బడ్జెట్‌ అంతా అంకెల గారడి అని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మరోసారి చంద్రబాబు తన మోసపూరిత నైజాన్ని చాటుకుంటూ సూపర్‌సిక్స్‌ హామీలకు ఎగ‌నామం పెట్టారని విమ‌ర్శించారు.  తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని చెబుతూనే బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం అరకొరగా చేశారన్నారు. ఈ రెండు పథకాల్లోనూ భారీగా లబ్ధిదారులను కోత పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారేమోనన్న భయంతో కంటితుడుపుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రసంగం అంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగిందని అన్నారు.  చంద్రబాబు, లోకేష్‌ను పొగడడానికే ఆయన పరిమితం అయ్యారన్నారు. అధికారం కోసం ఎన్నికల ముందు ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. ఏరుదాటాక తెప్ప తగలేసిన చందాన వ్యవహరిస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రస్తావన చేయలేదని, బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసే మరచిపోయారని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే యోగం ఈ ఏడాది కూడా లేనట్టేనని ఎద్దేవా చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో జగన్‌ కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని నమ్మించి ఓట్లేయించుకున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు చివరకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయలేని పరిస్థితికి వచ్చారని, ఇది పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.

Back to Top