గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు దారుణం

ఆయనపై తగిన చర్యలు తీసుకొండి

తాడేపల్లి పీఎస్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

తాడేపల్లి: తమను ప్రత్యక్షంగా బెదిరించడమే కాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఆక్షేపించింది. అందుకే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ‘మాకు అధికారం ఉంది. మేం తల్చుకుంటే నరికేయగలం’.. అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారని, అది ప్రసార మాథ్యమాలతో పాటు, సోషల్‌ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమైందని కొమ్యూరి కనకారావు తెలిపారు. బుచ్చయ్యచౌదరి మాటలు సాధారణ రాజకీయ విమర్శలు దాటి, ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇంకా ప్రజల్లో భయాందోళనలు, సమాజంలో విభేదాలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి నోట ఇలాంటి దారుణ విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అంతే కాకుండా అవి చట్టపరంగా శిక్షార్హమైనవని తేల్చి చెప్పారు. 

అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, వేగంగా నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని కొమ్మూరి కనకారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Back to Top