టీడీపీ తప్పుడు పోస్టులపై డీజీపీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు 

 గుంటూరు:  మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులతో పాటు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు పెడుతున్న అసభ్యకరమైన పోస్టులపై మంగళగిరి డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నేతలు.

డీజీపీ సిహెచ్‌.ద్వారకా తిరుమలరావుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, కైలే అనిల్‌ కుమార్, ఇతర నేతలు.

అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నేతలు. 

అధికార పార్టీ ప్రోత్సాహంతోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  సోషల్‌ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు.
అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసుపై చర్యలు తీసుకునేంతవరకు పోరాడుతాం: మాజీ మంత్రి అంబటి స్పష్టీకరణ.
మా మీద అసభ్యకర పోస్టుల పెట్టిన టీడీపీ యాక్టివిస్టులపై చర్యలేవి: పోలీసులను నిలదీసిన అంబటి.

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తో సోషల్‌  మీడియా యాక్టివిస్టులను తీసుకెళ్తున్న పోలీసులు.. వారి అరెస్టును చూపించకుండా... రోజుల తరబడి వివిధ పోలీస్‌ స్టేషన్లలో తిప్పడం, వేధించడంతో పాటు వారిని కొడుతూ చిత్రహింసలకు గురిచేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైన నేపధ్యంలో తప్పక... పోలీసులు ఇవాళ సుధారాణి దంపతులను గుంటూరు మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరు పరిచారని ఆయన స్పష్టం చేశారు.  సుధారాణి, ఆమె భర్తను పోలీసులు దారుణంగా కొట్టిన విషయాన్ని మెజిస్ట్రేట్‌ ముందే స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ రకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహంతోనే పోలీసులు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నేతలపై దాడికి దిగుతున్నారని అంబటి మండిపడ్డారు. వీటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ మీద అసభ్యంగా పోస్టులు పెట్టినవారిని తాము సమర్ధించడంలేదన్న అంబటి... ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు ఫైల్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. అమ్మకు నిల్... తండ్రికి పుల్,  విద్య వద్దు.. మద్యం ముద్దు అంటే కేసులు పెడతారా అని నిలదీశారు. ఇదే విషయాన్ని డీజీపీకి వివరించామన్నారు. అధికార పార్టీ నేతలపై ఏ పోస్టులు పెట్టారని మీరు అరెస్టు చేశారో... అదే రకంగా జగన్మోహన్‌ రెడ్డి, భారతమ్మ, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  మాజీ మంత్రులుమీద అత్యంత దారుణంగా పోస్టులు పెట్టిన వారిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇది ధర్మమేనా? అని నిలదీశారు.  పోలీసు వ్యవస్ధ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే... ఇలాంటి పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులను కూడా అరెస్టు చేస్తుందా? లేదా? అన్న అంశాన్ని వేచి చూస్తామన్నారు. 
అక్రమంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  సోషల్‌ మీడియా యాక్టివిస్టులను నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకునేంతవరకు కచ్చితంగా పోరాటం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించనన్న చంద్రబాబు... ఆడబిడ్డ సుధారాణిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనపై ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించారు. 

ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి. 
ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను, తప్పిదాలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కార్యకర్తలు చూపిస్తే.. అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్సార్సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులతో పాటు వారి కుటుంబసభ్యులనూ వేధించడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ కొంతమంది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బాధిత కుటుంబాల తరపున హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశామన్నారు.  చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టకతప్పలేదన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ , ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైయస్ఆర్‌ కాంగ్రెసు పార్టీ నేతలపైనా టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను  ఆధారాలతో సహా ఇవాళ డీజీపీకి అందించామని చెప్పారు.  అత్యంత అమానుషంగా, అసభ్యకరంగా ఈ పోస్టుల పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 

తాటిపత్రి చంద్రశేఖర్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే. 
రాష్ట్రంలో  ప్రభుత్వం మద్దతుతో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని సోషల్‌ మీడియా ప్లాట్‌పాం ఎక్స్‌లో పోస్టు చేస్తే దానిపై కేసు పెట్టి యర్రగొండపాలెం ఎస్‌ఐ తనకు వాట్సప్‌లో ఎఫ్‌ఐఆర్‌ పంపించడంపై  ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు సాగుతున్నాయని... సాక్షాత్తూ టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే జూలై 5న పేకాట క్లబ్బులు తెరిపిస్తానని బహిరంగంగా మాట్లాడారని ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. మరోవైపు కూటమిపార్టీలకు మద్ధతునిచ్చే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ఆగష్టు 5న రాష్ట్రంలో విచ్చల విడిగా పేకాట నడుస్తుందని వార్తలు వచ్చాయన్నారు. ఇవేవీ ఎందుకు కనిపించలేదని నిలదీశారు. ఇచ్చిన హామీల అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వివిధ సోషల్‌ మీడియా వేదికలుగా ప్రశ్నిస్తున్న వారందరినీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  శ్రేణులగా చిత్రీకరించి అరెస్టులు చేయడం అత్యంత దారుణమన్నారు. దానికి పరాకాష్టగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతగల ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తే... అదే నేరం, తప్పుగా నాపైనే కేసులు పెట్టడం పిరికిపంద చర్య అని చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రగొండ పాలెంలో ఎస్టీ మహిళమీద టీడీపీ నేత దాడిచేస్తే... పోలీస్‌ స్టేషన్‌లో పిటీ కేసు నమోదు చేసి బాధిత మహిళ మీద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో తప్ప  ఇంత దుర్మార్గం, ఇంత అరాచకం, మారణకాండ గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేవని తేల్చి చెప్పారు. అయినా బాధ్యత గల ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Back to Top