బాబు మార్క్‌ వంచ‌న‌కు నిలువెత్తు సాక్ష్యమే ఈ బడ్జెట్

 గొప్ప బడ్జెట్ అంటూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్ డ‌ప్పాలు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ద‌మ్ముందా?

ఎక్స్ వేదిక‌గా కూట‌మి నేత‌ల‌కు వైయ‌స్ఆర్‌సీపీ స‌వాల్‌
 

అమ‌రావ‌తి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా, రూ.41 వేల కోట్లు పెంచుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్ర‌జ‌ల‌ను వంచింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  చంద్ర‌బాబు మార్కు వంచ‌న‌కు ఈ బ‌డ్జెట్ నిలువెత్తు సాక్ష్య‌మంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టింది. కూట‌మి  ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది .  ఇది ప్రజలు మెచ్చే బ‌డ్జెట్ కాదు.. ఇది వంచ‌న బ‌డ్జెట్‌. సూప‌ర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయింపులు లేవు. ఆద్యంతం అబద్ధాలు.. అవాస్త‌వాలు..వ‌క్రీక‌ర‌ణ‌ల సమాహారమే ఈ బడ్జెట్. ఎంతో గొప్ప బడ్జెట్ అని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్ చెబుతున్నారు.  వారిని వైయ‌స్ఆర్‌సీపీ  కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతోంది. ద‌మ్ముంటే వీటికి స‌మాధానం చెప్పాల‌ని ఎక్స్ వేదిక‌గా కూట‌మి నేత‌ల‌కు స‌వాలు విసిరింది.

1- 2024–25 వార్షిక బడ్జెట్‌ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన అంచనాల మేరకు బడ్జెట్‌ రూ.2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? 

2- అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్‌ మినహా, సూపర్‌ సిక్స్‌ సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. 

3- అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15 వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకం. 

4- తొలి ఆరు నెలల్లో రాబడి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78 వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? 

5- యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇ­చ్చారు. ఆ పథకానికి బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించ‌లేదు?

6- తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. బడ్జెట్‌లో స్ప‌ష్ట‌మైన కేటాయింపులు ఎందుకు లేవు?

7- వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పు­డు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుంది?

8- అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి చెప్పిన ప్రకారం ఆ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. మిగతా రూ.3500 కోట్లు పీఎం కిసాన్‌ నుంచి వచ్చేది. నిజానికి ఈ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,706 కోట్లు కావాలి. మ‌రి రూ.1000 కోట్లు ఎలా స‌రిపోతుంది?

9- దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో కేవ‌లం 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుంది. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన మిగతా వారందరికీ ఇవ్వరా? 

10- ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 2,07,30,000 మందికి ఇవ్వాలి. దీని ఊసే లేదు.

11-  మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు.   

12- 2014 ఎన్నికల్లో కూడా వ్యవసాయ రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులు, చేనేతలకు సాయం, నిరుద్యోగ భృతి.. ఇలా అన్ని హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు.
 

Back to Top