పేదింటి గడపల్లో వెలుగుల పండుగ

 వైఎస్సార్‌ పింఛను పథకం

తెలతెలవారుతుందంటే...సూర్యుడొస్తాడు. వెలుగొస్తుంది. షరామామూలే. తర్వాత దైనందిన సమస్యలతో తలపడటమే సగటు జీవి పనిగా రోజు గడిచిపోతుంది. ఇక పేదరికం, అనారోగ్యం జాఢ్యాలుంటే ...ఇక తెల్లారితే గుండె గుభేల్మనేంత బాధ వుంటుంది. కానీ ఈ మాఘమాస వేళ
æ...ఫిబ్రవరి నెల మొదటి రోజు సూర్యోదయం...ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త పొద్దుపొడుపయింది. పొద్దుపొడుపుకన్నా ముందే వెలుగు రేకల్ని ప్రసరించింది.
ప్రభుత్వం అందించే పింఛన్లు తీరు ఇంతకాలం ఓరకంగా ఉండేవి. ఆఫీసుల దగ్గర పడిగాపులు పడే పరిస్థితి వుండేది. ఒక్కోసారి రెండుమూడు రోజులు కూడా పట్టేది. ఈసురోమంటూ అందుకోవాల్సిందే. కానీ ఒక సరికొత్త ఆలోచన...పేద ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే సరికొత్త మార్గానికి దారితీసింది. దేశంలోనే ఎక్కడా లేని తీరులో, దేశచరిత్రలోనే తొలిసారి పింఛన్లు లబ్దిదారుల ఇంటికే నడిచొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మంచితలపును చాటుతూ...తెల్లారి నుంచే పేదిళ్ల తలుపులు తెరుచుకున్నాయి. వైఎస్సార్‌ పింఛను పథకంలో భాగంగా...ఫించన్లు  వారి ఇళ్ల వద్దకే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా అందాయి. ఇలా అందిస్తున్న పింఛన్లు  54, 65, 564 (అక్షరాలా యాభై నాలుగు లక్షల, అరవై ఐదువేల, ఐదువందల అరవైనాలుగు).
ఈరోజున ఉషోదయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెపల్లెనా, పట్టణప్రాంతాల్లోనూ ఇంటింటికీ పింఛన్లు పథకం ఎన్నెన్నో అద్భుత సన్నివేశాలకు ఆవిష్కరించింది. ఎంతెంతగానో మానవీయ స్పర్శను పట్టిచూపింది. మనసున్న వాడు పాలకుడైతే...పేదింటి గడపగడపకూ భరోసా అందుతుందని చాటింది. నడుం వంగిపోయిన అవ్వ గడప దగ్గరకే నడిచెళ్లి పింఛను అందింది. నడవలేక మంచం పట్టిన దివ్యాంగుల చెంతకెళ్లి...ఇదిగో నీకు చేయూత అంటూ పింఛను పలికింది. గుండె గుండె కథా వింటూ ఓదార్పయి పింఛను కదిలించింది.  లక్షలాది గుండె చప్పుళ్లల్లో ఖచ్చితంగా  ఈరోజు కృతజ్ఞతాభావం పొంగివుండే వుంటుంది. జీవితంలో ఓ మంచిపనిలో భాగస్వాములయినందుకు వలంటీర్లందరూ సంతోషించే వుంటారు.
ప్రజాసేవకు సంబంధించిన గొప్ప బాధ్యతల్లో పాలుపంచుకునేలా,తమ ఉనికిని చాటేలా అవకాశాల్ని కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ మనస్సుల్లో కృతజ్ఞతలు  చెప్పుకునేవుంటారు.
వృద్దాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారులందరికీ వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దనే పింఛను డబ్బులు పంపిణీ చేసి, సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ లబ్దిదారుల నుద్దేశించిన రాసిన లేఖ ఆత్మీయతను కనబరిచింది. ఆ లేఖలో రాస్తూ, ఆయన – రాష్ట్రంలో అవ్వాతాతలు, పేదలు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను ప్రజా సంకల్పయాత్రలో చూసి చలించిపోయాను. మీరు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఆర్ధికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా తొలి సంతకం నవరత్నాలలో అత్యంత ప్రాధాన్యమైన వైఎస్సార్‌ పింఛను, పింఛను పథకంలో భాగంగా పింఛన్ల పెంపుతో పాటు వయోపరిమితిని 65సంవత్సరాల నుంచి60 సంవత్సరాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో పింఛన్ల అర్హతలను సరళతరం చేశాం. అవసరార్థులు, బాధితులు, రోగగ్రస్తులందరి జీవితాల్లో ఆనందం...సంతోషం చూడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం – అని స్పష్టంగా ప్రకటించారు.
వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాలన అక్షరాలా తొమ్మిదో నెలలో అడుగుపెట్టిన వేళావిశేషం...ఇంటింటికి పింఛన్లు.
ఇప్పటికే ఎన్నెన్నో ప్రజాసంక్షేమ పథకాలు పేదింటి గడపల్లో భరోసాగా నిలుస్తున్నాయి. ధైర్యాన్నిస్తున్నాయి. తమకోసం నడిచొచ్చిన పాలకుడిగా యువముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్న ప్రజలకిప్పుడు జగన్‌లో ఓ ఆత్మబంధువు కనిపిస్తున్నాడు. రాష్ట్రం సంక్షేమపథంలో, అభివృద్ది బాటలో ఆదర్శవంతంగా ఎదగాలని మంచిమనుసులు ఆశీర్వదిస్తున్న వేళ...ప్రజాపాలనకు జయహో....

తాజా వీడియోలు

Back to Top