‘గ్లోబల్‌’ నాయకుడు బాబు.. ‘లోకల్‌’ నేతగా మారిపోయాడు

చంద్ర‌బాబు నాయుడు వింత ధోర‌ణిపై వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సెటైర్లు

తాడేప‌ల్లి: కుప్పం సీటు తన సొంతమన్నట్టు మాజీ సీఎం చంద్ర‌బాబు మాట్లాడడం– ‘గ్లోబల్‌’ నాయకుడు ఇప్పుడు ఎంతటి ‘లోకల్‌’ నేతగా మారిపోయాడు? అనే అనుమానం రేకెత్తిస్తోందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాన్ని "నీది’"అని చంద్రబాబు అన్నారంటే ఆయన మానసికస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. చంద్ర‌బాబు నాయుడి ప్ర‌వ‌ర్త‌న‌పై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ స్టోరీని పోస్ట్ చేశారు. 

"మీ పులివెందుల నియోజకవర్గానికి నేనే నీళ్లిచ్చా," అన్నారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు  కుప్పం గొడవల్లో అరెస్టయిన తెలుగుదేశం నాయకులను పరామర్శించడానికి మంగళవారం చిత్తూరు జైలుకు వచ్చిన టీడీపీ అధినేత ఏ మాత్రం మారలేదని ఈ మాటలు రుజువుచేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాన్ని "నీది’"అని చంద్రబాబు అన్నారంటే ఆయన మానసికస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే, తాను 1989 డిసెంబర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటు తన సొంతమన్నట్టు టీడీపీ మాజీ సీఎం మాట్లాడడం– ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ‘గ్లోబల్‌’ నాయకుడు ఇప్పుడు ఎంతటి ‘లోకల్‌’ నేతగా మారిపోయాడు? అనే అనుమానం రేకెత్తిస్తోంది. రాష్ట్రస్థాయి నాయకులను ముఖ్యంగా ముఖ్యమంత్రి, మాజీ సీఎంలను వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలతో గుర్తుంచుకోవడం చంద్రబాబుతోనే మొదలైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రముఖుల నియోజకవర్గాలకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం వాంఛనీయం కూడా కాదు. ‘నేను మీ అసెంబ్లీ స్థానానికి నీళ్లిస్తే, నా కుప్పం నియోజవర్గానికి ఎం చేశారు?’ అనే ధోరణి చంద్రబాబు స్థాయిని మరింత దిగజార్చేలా ఉంది. ‘రెండు రోజుల్లో జగన్‌ కుప్పం పర్యటనకు వస్తారట’ అంటూ నిష్ఠూరంగా మాట్లాడడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. మొత్తం 175 స్థానాల ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన పెద్ద నేతలు కేవలం రెండు మూడు నియోజవర్గాల గురించే మాట్లాడడం సబబు కాదు.

జైలులో ఆప్తులను పరామర్శించడం ఇదే మొదటిసారని చెప్పిన బాబును ఏమనాలి?
టీడీపీ నాయకులను పరామర్శించేందుకు తొలిసారి ఓ జైలుకు వచ్చానని చిత్తూరు జైలు బయట చేసిన ప్రసంగంలో చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యే కావడానికి ముందే శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్నాగాని– జైళ్లలో నిర్బంధంలో ఉన్న తన పార్టీ కార్యకర్తలు, ఆప్తులను పలకరించి, ఓదార్చడానికి నిన్నటి వరకూ వెళ్లలేదంటే చంద్రబాబుకి పార్టీ కార్యకర్తలంటే ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో వెల్లడవుతోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు గొడవలు, కేసులు, విచారణకు ముందు జైళ్లలో నిర్బంధాలు సర్వసాధారణం. డిటెన్షన్‌లో ఉన్న పార్టీ వారిని కలిసి ధైర్యం చెప్పడం అధినేత కనీస ధర్మం. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అత్యధిక కాలం ఉన్నానని చెబుతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త విలువలు, సాంప్రదాయాలకు ‘తెరలేపుతున్నారా?’ అనే అనుమానం వస్తోంది ఆయన చిత్తూరు ప్రసంగం చదివాక.

తాజా వీడియోలు

Back to Top