కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిరాశ‌పరిచింది

ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావన లేకపోవడం బాధాకరం

రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై కేంద్రంతో పోరాడి.. సాధిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌ నిరాశ‌ పరిచిందన్నారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కూడా కేంద్రం ఇదే తరహాలో బడ్జెట్‌ పెట్టిందని, వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలమంతా వర్క్‌ డివైడ్‌ చేసుకొని చాలా విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్రానికి నిధులు తీసుకురాగలిగామన్నారు. 

విశాఖపట్నంలో ఫిషింగ్‌ హబ్‌కి కేంద్రం ఫండ్స్‌ కేటాయించిందని, ఇంతకు ముందే రాష్ట్రంలో 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారని, అందులో 4 హార్బర్లకు టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల కృషితో జువ్వెలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు కేంద్రం నుంచి ఫండ్స్‌ తీసుకువచ్చామన్నారు. ఉపాధి హామీ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యం.. గతేడాది, ఈ ఏడాది లేదని, ఉపాధి హామీ పథకంలో అత్యధిక పనిదినాలు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ సైతం టాప్‌లో ఉందని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలమంతా పోరాడి కేంద్రం నుంచి ఉపాధి హామీ నిధులు తీసుకురాగలిగామన్నారు.  

‘గతేడాది మెరుగ్గా జాతీయ రహదారులు తీసుకువచ్చాం. ఈ రోజు బడ్జెట్‌లో ప్రకటనలో లేకపోయినా సంబంధిత మంత్రికి విన్నవించి.. పెండింగ్‌ జాతీయ రహదారుల నిర్మాణానికి కృషిచేస్తాం. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన రోడ్లు గతేడాది ప్రకటన లేకపోయినా అత్యధిక రోడ్లు ఎంపీల కృషితో మునుపెన్నడూ లేని విధంగా తీసుకురాగలిగాం. ఈసారి కూడా అత్యధిక రోడ్లు తీసుకువచ్చేందుకు కృషిచేస్తాం. 

15 వేల స్కూళ్లు టాప్‌ స్టాండెడ్‌లో అభివృద్ధి చేస్తామని ఫైనాన్స్‌ మినిస్టర్‌ నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ 44 వేల స్కూళ్లను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. నాడు–నేడు పథకానికి నిధులు రాబట్టడంతో పాటు కేంద్రం అభివృద్ధి చేసే 15 వేల స్కూళ్లలో అత్యధికం ఏపీకి కేటాయించేలా కృషిచేస్తాం’ అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.  
 

Back to Top