రాహుల్‌ ‘భారత్‌ జోడో’ యాత్రతో దేశ ప్రజలను ‘సమీకరించగలదా? 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి: నాడు తెలుగువాడి నాడి అర్ధంకాని కాంగ్రెస్‌ 12 ఏళ్ల తర్వాత రాహుల్‌ ‘భారత్‌ జోడో’ యాత్రతో దేశ ప్రజలను ‘సమీకరించగలదా?  అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. భార‌త్ జోడ్ యాత్ర‌పై విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేశారు. సెప్టెంబర్‌ 7 నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో’ పేరుతో దేశ పర్యటనకు బయల్దేరుతున్నారు. సంక్షోభ సమయాల్లో తెగువ చూపించాల్సిన నెహ్రూ–గాంధీ కుటుంబ వారసుడు పలుమార్లు వెన్నుచూపారు. పుష్కరకాలం కిందట 2010లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు అధికార గర్వంతో కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. తన నాయనమ్మ ఇందిరమ్మను మెదక్‌ నుంచి పార్లమెంటుకు పంపిన తెలుగు ప్రజల  మనోభావాలను అప్పుడు యువరాజు రాహుల్‌ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీకి, కడప లోక్‌సభ సీటుకు రాజీనామా చేసిన వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిని పార్టీ వీడకుండా నివారించే ప్రయత్నం చేయలేదు ప్రధాని పీఠానికి ‘నిరంతర వారసుడు’ రాహుల్‌. మనకెందుకన్నట్టు ఆయన హస్తినలో నోరుమూసుకుని కూర్చున్నారు. ఆంధ్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించనే లేదు. ఏపీలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని  ‘నిలబెట్టడానికి’ ప్రతిపక్షమైన తెలుగుదేశం పరోక్ష మద్దతు తీసుకోవడానికి కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం సిద్ధపడింది. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో లాలూచీ పడింది. జనబలంతో తండ్రి బాటలో ముందుకు సాగుతున్న వైయ‌స్ జగన్‌ గారిపై సీబీఐ కేసులు బనాయించి తెలుగునాట కాంగ్రెస్‌ పార్టీ మరణానికి మంచి పునాది వేసింది. సరే, గతాన్ని ఎవరూ మార్చలేరు. తన 2003 పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు దివంగత జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన కంటే 20 ఏళ్ల ముందు నాటి జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ నాలుగు నెలల పాటు కన్యాకుమారి నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేశారు గాని ఆయనకు ప్రధాని పదవి 1984 డిసెంబర్‌ ఎన్నికల్లో దక్కలేదు. ఇందిర దారుణ హత్య ఈ పాదయాత్రకు ఫలితం లేకుండా చేసింది. పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యపరచాలనే లక్ష్యంతో వందలాది కిలోమీటర్లు నడిచిన రాజన్న, జగనన్న– ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజాసంక్షేమానికి పునరంకితమయ్యే అవకాశాలు పొందారు. మరి ఇప్పుడేమో, ‘భారత్‌ జోడో’ (భారతీయులందరినీ ఏకం చేయాలనే పిలుపుతో) ఈ నెల 7న రాహుల్‌ చేపట్టబోయే పాదయాత్రపై అత్యధిక ప్రజానీకానికి గొప్ప అంచనాలేవీ లేవు. నేరుగా జనం మధ్య తిరుగుతూ, వారితో మమేకమయ్యే స్వభావం లేని ఈ ‘శాశ్వత యువరాజు’ భారత ప్రజలను చైతన్యపరిచి హస్తం బలోపేతం కావడానికి ప్రయత్నిస్తారంటే– నమ్మబుద్ధి కావడం లేదు. 12 ఏళ్ల క్రితం తెలుగు జనం మనోభావాలు అర్ధంచేసుకోలేని రాహుల్‌ ‘భయ్యా’ ఇప్పుడు వేల కిలోమీటర్లు నడిస్తే కాంగ్రెస్‌ పార్టీకి వచ్చేది అధికారం కాదు. ఆయన కాళ్లకు నొప్పులు మాత్రమే.

తాజా వీడియోలు

Back to Top