ఐదేళ్లు ఏం చేశావని మళ్లీ ఓట్లేయాలి

రాజధానిలో ఒక్క పక్కా భవనం అయినా నిర్మించావా

రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారు

చంద్రబాబుకు మాట మీద నిలబడే తత్వం లేదు

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా గుర్తున్నాయా..?

ఇంకా ఎన్నాళ్లు ప్రజల చెవుల్లో పూలుపెడతావు చంద్రబాబూ

తాడికొండ ప్రచార సభలో వైయస్‌ షర్మిల

తాడికొండ: ప్రతి పేదవాడికి అండగా, ప్రతి రైతుకు ధైర్యం కల్పించేలా, ప్రతి మహిళలకు భరోసా ఇచ్చేలా, ప్రతి విద్యార్థి ఏ చదువులు చదువులు కావాలంటే చదువుకోండి. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని భరోసా ఇచ్చారు. మన రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు లక్షణంగా చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేదవాడు కూడా కార్పోరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి. అది కూడా ఉచితంగానే చేయించుకోవాలని వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లక్షల మందికి ప్రాణాలు పోసింది. ఫోన్‌ కొడితే 20 నిమిషాలకే వచ్చే 108 లక్షల మందికి పునర్జన్మనిచ్చింది. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని శ్రమించాడు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆశించాడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క చార్జి, ఒక్క పన్ను పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి పథకాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌. 

ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఆఖరికి ఏ పార్టీ అని కూడా అడగకుండా, మన, పర తేడా లేకుండా మేలు చేసిన వ్యక్తి ఒక్క వైయస్‌ఆర్‌ మాత్రమే. కానీ ఇప్పుడున్న చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు. మొదటి సంతకానికే దిక్కులేకుండా పోయింది. రైతులను ఘోరంగా దగా చేశాడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు. ఐదేళ్లు అయిపోయింది ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. ఎన్నికలు వచ్చాయని మళ్లీ మహిళలను మభ్యపెట్టేందుకు పసుపు – కుంకుమ అని పెద్ద బిల్డప్‌ ఇస్తున్నాడు. అక్కచెల్లెల్లారా మోసపోకండి. చంద్రబాబు ఎంగిలి చేయి విధిలిస్తున్నాడు. 

విద్యార్థులకు పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ లేదు, ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను లిస్టు నుంచి తీసేశారు. పోలవరం మూడేళ్లలో కడతానని మాట్లాడాడు.. ఈ చంద్రబాబుకు నిజంగా మాట మీద నిలబడే తత్వం ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. అమరావతిలో వేల ఎకరాలను తన బినామీలకు రాసిచ్చేసుకున్నాడు, రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత భవనం నిర్మించలేదు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క బిల్డింగ్‌ కట్టలేదు కానీ, మళ్లీ ఈయనకే అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌ వన్‌ చేస్తాడంట.. ఇంకా ఎన్నాళ్లు ప్రజల చెవుల్లో పూలు పెడతారు చంద్రబాబూ.. 

బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్నారు. ఐదేళ్లు అయిపోయింది ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ, ఒక్క ఎన్నిక కూడా గెలవలేని తన కొడుకుకు మాత్రం మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు, జయంతికి, వర్థంతికి తేడా తెలియని పప్పుగారికి ఏ అనుభవం ఉందని మంత్రిని చేశారు. బాబు–మోడీ జోడి కలిసి ప్రత్యేక హోదా రాకుండా చేశారు. ఐదేళ్లలో ప్రత్యేక హోదాను నీరుగార్చారు. కమీషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించాడు. 

చంద్రబాబు బాకీ పడ్డారు
ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్కటైనా నెరవేర్చారా. కాబట్టి ప్రతిఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారా. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక  చేనేత కార్మికులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. మగ్గమున్న ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు ఇస్తాం. 45 ఏళ్లు నిండిన చేనేతన్నలకు ఇంటికి ఇద్దరి చొప్పున రూ.2 వేల పెన్షన్‌ ఇస్తాం’ అని వైఎస్‌ షర్మిల పునరుద్ఘాటించారు.

 అందుకే ఎప్పుడు అబద్ధాలే చెబుతుంటారు
వైఎస్‌ షర్మిల ఇంకా మాట్లాడుతూ... ‘ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జగనన్న ఢిల్లీలో ధర్నాలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టారు. రాజీనామాలూ చేశారు. జగనన్న యువభేరి పేరిట యువతను జాగృతం చేశారు. ఆయనే గనుక ఊరురా తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోతే చంద్రబాబు నోట నుంచి ప్రత్యేక హోదా అనే మాట వచ్చి ఉండేదా? హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న చంద్రబాబును యూటర్న్‌ తీసుకునేలా చేసింది జగనన్న కాదా? ఈ విషయాల గురించి చంద్రబాబు నిజం చెప్పాలి. కానీ ఆయన చెప్పరు. చంద్రబాబు నైజం గురించి నాన్న గారు ఒకమాట చెప్పేవారు.. ఎప్పుడైతే చంద్రబాబు నిజం చెబుతారో అప్పుడు ఆయన తల వేయి ముక్కలవుతుందట. పాపం అందుకే ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు’ అని ఎద్దేవా చేశారు.

 పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు 
వైయ‌స్‌ షర్మిల ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా. సీఎం కొడుకుకు మూడు జాబులు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లేవు. కనీసం నోటిఫికేషన్లు కూడా లేవు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా’  అని ప్రశ్నించారు.

 వైయ‌స్ఆర్‌ సీపీ బంపర్‌ మెజార్టీతో గెలుస్తుంది
నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసుకు భయపడే హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారు. ఆ రోజు నుంచి 3 నెలల క్రితం వరకు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హరికృష్ణ శవం సాక్షిగా కేసీఆర్‌తో పొత్తు ప్రయత్నాలు చేసింది నిజం కాదా? టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నించిన చంద్రబాబు సిగ్గు లేకుండా వైయ‌స్ఆర్‌ సీపీపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబును చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుతో చచ్చిపోతుంది. మాకు కేసీఆర్, బీజేపీ, కాంగ్రెస్‌.. ఎవరితోనూ పొత్తు లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయ‌స్ఆర్‌ సీపీ బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని సర్వేలన్నీ చెబుతున్నాయి అని షర్మిల పేర్కొన్నారు. 

ఆలోచించి ఓటేయాలి
‘ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. ఒకవైపు తండ్రి లాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి బాబు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని పక్కన పడేసిన చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ఆలోచించాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. జగనన్న తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. కాంగ్రెస్‌ను వీడితే కేసులు పెడతారని అనాడే తెలుసు. జగనన్న అవినీతే చేసి ఉంటే కాంగ్రెస్‌ పార్టీని వీడేవాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు పడుతూ వైఎస్సార్‌సీపీని సగర్వంగా నడిపించారు. 3,648 కి.మీ. పాదయాత్ర ద్వారా కోట్లాది మంది కష్టాలను తెలుసుకున్నారు. నాన్నలా కులాలకు, వర్గాలకు అతీతంగా అందరికీ మేలు చేద్దామని కోరుకుంటున్నాడు. రాజన్న బిడ్డ జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి.మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కావాలంటే అంతా ఆలోచించి ఓటేయాలి. రాజన్న బిడ్డగా మీకు సేవ చేసిన నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’  అని షర్మిల విఙ్ఞప్తి చేశారు.

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్‌రెడ్డి అన్నను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవి అక్కను జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.. మీకు సేవ చేసిన వైయస్‌ఆర్‌ కూతురిగా ఇదే నా ప్రార్థన. 

 

Back to Top