కొల్లేరు ప్రతి సమస్య తీరుస్తాం

 నిడదవోలు స‌భ‌లో వైయ‌స్ ష‌ర్మిల‌

గత ఎన్నికల్లో చంద్రబాబు 600ల హామీలు ఇచ్చారు

విద్యార్థులకు ఐప్యాడ్, మహిళలకు స్మార్ట్‌ఫోన్లు అన్నారు

ఈ ఐదేళ్లు ప్రజల బాధ్యత చంద్ర‌బాబుది కాదా

మీకు సేవ చేసుకునే అవకాశం రాజన్న కొడుకు జగనన్నకు ఇవ్వండి

పశ్చిమగోదావరి:   వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాగానే కొల్లేరు ప్రతి సమస్య తీరుస్తార‌ని వైయ‌స్ ష‌ర్మిల మాట ఇచ్చారు. ఐదేళ్లు చంద్ర‌బాబు త‌న కొడుకు బాధ్య‌త మాత్ర‌మే చూశార‌ని, ఇప్పుడు మీ బాధ్య‌త‌..నా భ‌రోసా అంటున్నార‌ని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్లు ప్ర‌జ‌ల బాధ్య‌త చంద్ర‌బాబుదే క‌దా అని ప్ర‌శ్నించారు. మోస‌పు హామీలు ఇస్తున్న చంద్ర‌బాబును న‌మ్మొద్ద‌ని ఆమె సూచించారు. గురువారం నిడ‌ద‌వోలులో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ష‌ర్మిల‌మ్మ మాట్లాడారు. ఆమె ఏమ‌న్నారంటే..

మాకు బీజేపీతో, కాంగ్రెస్‌తో, కేసీఆర్‌తో పొత్తులేదు. పొత్తులు మాకు అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింగిల్‌గానే, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌గానే బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ, జనసేన పార్టీలు, ఇంకా ఎవరు వస్తే వారితో పొత్తులు పెట్టుకుంటున్నాడు. గత ఎన్నికల్లో చంద్రబాబు 600ల హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటీ పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటిని పాతిపెట్టి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ కొత్త అబద్ధాలు, మోసపు హామీలు ఇస్తున్నాడు.. మోసపోతారా..? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. 

మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈ ఐదేళ్లు ప్రజల బాధ్యత ఆయనది కాదా.. లోకేష్‌ది మాత్రమే ఆయన బాధ్యతా..? నమ్ముతారా దొంగ బాబును. నిన్ను నమ్మం అని తేల్చి చెప్పండి. పొరపాటున మన భవిష్యత్తు వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్లు. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వచ్చి ఓట్లు వేయమని అడుగుతారు.. అప్పుడు మీరు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా.. ఆ లెక్కన తల్లిదండ్రులు కట్టిన ఫీజు మొత్తం చంద్రబాబు బాకీ అని చెప్పండి ఆ బాకీ మొత్తం తీర్చమని నిలదీయండి. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తామన్నారు. ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రికి రూ. 25 వేలు చంద్రబాబు బాకీ.. ముందు ఆ బాకీ తీర్చమని చెప్పండి. విద్యార్థులకు ఐప్యాడ్, మహిళలకు స్మార్ట్‌ఫోన్లు అన్నారు. ఎన్నికల్లోపూ అవన్నీ ఇచ్చేయమని నిలదీయండి. ఐదేళ్లలో ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు అయింది. తెలుగుదేశం పార్టీ వారు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ముందు బాకీ సంగతి తీర్చమనండి. తెలుగుదేశం పార్టీ వారు మీ ఇంటికి ఓటు కోసం వస్తే ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇల్లు అన్నారు. వేల ఎకరాలు అమరావతి, విశాఖలో మింగేశారు.ఆ భూమంతా మీదే రాసివ్వమని అడగండి. చేనేతలు, డ్వాక్రా మహిళలకు, రైతులకు మొత్తం రుణమాఫీ అన్నాడు.. ఆ రుణమంతా చంద్రబాబు మీకు బాకీ.. ముందు ఆ బాకీ తీర్చమని అడగండి. మన ఓట్లు కొనడానికి డబ్బులు తీసుకొని వస్తారు. తీసుకొని మోసపోకండి.

అగ్రిగోల్డ్‌ బాధితులకు చంద్రబాబు ఎలా టోపీ పెట్టారో చూశారా.. ఐదేళ్లు అయింది ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మనస్సు లేదు చంద్రబాబుకు అగ్రిగోల్డ్‌ బాధితులకు మాట ఇస్తున్నాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న అయినాక అగ్రిగోల్డ్‌ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తాం. మీ పక్షాన మేము నిలబడతాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రైతు తలెత్తుకొని మళ్లీ రాజులా బతుకుతాడు. ప్రతి సంవత్సరం మే నెలలోనే రూ. 12,500లు ఇస్తారు. రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో నిధి కూడా ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులను ఆదుకునేందుకు రూ. 4 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణమంతా నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతారు. మళ్లీ సున్నావడ్డీకే రుణాలు అందిస్తారు. ప్రభుత్వమే ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచితంగా ఇంజనీరింగ్, డాక్టర్‌ పెద్ద చదువులు చదివిస్తుంది. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. తల్లులు పిల్లలను బడికి పంపిస్తే రూ. 15 వేలు ఇస్తారు. అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేలు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు రూ. 3 వేల పెన్షన్, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, ఆరోగ్యశ్రీకి పునర్జీవం తీసుకువస్తాం. కొల్లేరులో చాలా సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత కొల్లేరు ప్రతి సమస్య తీరుస్తాం. రీ సర్వే చేయిస్తాం. అదనంగా వచ్చే భూమిని స్థానికులకే ఇస్తాం. ప్రతి విషయంలో అండగా ఉంటాం. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. మీ సేవ చేసుకునే అవకాశం రాజన్న కొడుకు జగనన్నకు ఇవ్వాలని కోరుతున్నాం. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకట్రావు అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి భరత్, యువకుడు మీకు సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. వీరిద్దరిని గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలచుకోండి. ఫ్యాన్‌ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆయన కొడుకు జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా..

Back to Top