చంద్రబాబు ప్రతి అడుగు మోసం.. మోసం

పుష్కరాల్లో నాసిరకం పనులతో రూ. కోట్లు దోచేశారు

చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకుండా కుట్ర

బాబుకు పొరపాటున ఓటేస్తే సామాన్యులను బతకనివ్వడు

ఐదేళ్లుగా పన్నుల పేరుతో పేద ప్రజలను దోచుకున్నాడు

విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టండి

నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపుతా

కొవ్వూరు సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పశ్చిమ గోదావరి: ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని, పన్నుల రూపంలో పేదవాడి రక్తం పీల్చాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పేదవాడు బతికే పరిస్థితి ఉండదన్నారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని, నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపుతానని వైయస్‌ జగన్‌ అన్నారు. కొవ్వూరు ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 

ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూసిన తరువాత ఇవాళ మనం నాలుగు రోజుల లోపల ఎన్నికలకు పోబోతున్న సమయంలో కలిశాం. ఐదు సంవత్సరాల పాలనలో ఒక్కసారి మన కొవ్వూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశానంటే.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెలతో చేశానని గర్వంగా చెబుతాను. పాదయాత్రలో ఇక్కడ జరుగుతున్న విషయాలు విని ఆశ్చర్యం అనిపించింది. ఐదేళ్లలో తాళ్లపూడి, తాడిపూడి, పక్కిలంక, చిడిపి, బల్లిపాడు, కొవ్వూరు ర్యాంపుల నుంచి రోజూ వేల సంఖ్యలో లారీలు కనిపిస్తున్నాయి. జేసీబీలు పెట్టి రోజూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇక్కడి ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, మంత్రులుగా ఉన్న వ్యక్తి సాక్షాత్తు చంద్రబాబుకు వాటాలు ఇస్తూ.. యధేశ్చగా దోపిడీ చేస్తున్నారు. పాలన ఎక్కడుందని మీ అందరి తరుపున అడుగుతున్నా..

ఇక్కడే పుష్కరాలు జరిగాయి. దేవుడి కార్యక్రమం కాబట్టి నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. పుష్కరాలు జరిగినప్పుడు చెత్త ఏరివేయడం , గాట్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం ప్రతి పని నామినేషన్‌ పద్ధతిలో ఇష్టానుసారంగా రేట్లు పెంచి నాసిరకంగా పనచేశారు. ఆ అన్యాయమైన పాలన గురించి ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు కనిపిస్తాయి. బడి పక్కన, గుడి పక్కన, వీధి చివర బెల్టుషాపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమ్మార్పీ రేట్ల కంటే రూ. 30 ఎక్కువకు అమ్ముకుంటున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెల్టుషాపులు రద్దు అని చంద్రబాబు పెట్టిన సంతకానికి కొవ్వూరు ప్రజలకే తెలుసు. 

గోదావరి తీరాన మంత్రి కుమారుడు రిసార్ట్స్‌ నిర్మాణానికి దేవతల విగ్రహాలు అడ్డుగా ఉన్నాయని విగ్రహాలను తొలగించిన దుర్మార్గమైన పరిస్థితి. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇప్పటి వరకు కొలిక్కిరాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా మెట్టప్రాంతాలకు అత్యంత అవసరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఐదేళ్లలో ఏం పనిజరిగిందని ఆలోచన చేయండి. కావాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయకుండా ఉండేందుకు ఒక్కో మండలంలో ఒక్కో రేటు ఇస్తూ ఆ రైతులు మాకెందుకు తక్కువ ఇస్తున్నారని రైతులు ధర్నాలు చేసే విధంగా చంద్రబాబు పాలన ఉంది. చివరకు రైతులు ధర్నాలు చేస్తే అదేదో వారే తప్పు చేసినట్లుగా కేసులు పెట్టి చివరకు ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చారు. 

ఐదు సంవత్సరాల్లో వరి పండిస్తున్న రైతుల పరిస్థితి దారుణం. క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ. 1750 పంట చేతికి వచ్చే సరికి రూ. 12 వందలు కూడా రైతు చేతికి రావడం లేదు. ఇంతటి దారుణమైన పాలన జరుగుతుంది. ఐదేళ్ల పాలన చూశారు కాబట్టి.. మోసం.. మోసం.. మోసం అన్న పదాలు గట్టిగా వినిపిస్తాయి. అన్యాయం, అవినీతి, అరాచకాలు, అబద్ధాలు చంద్రబాబు పాలనలో కనిపించాయి. చంద్రబాబుకు ఐదు సంవత్సరాల క్రింత ఓటు వేస్తే ఏం జరిగిందని మీరంతా చూశారు కాబట్టి.. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఒక్క గవర్నమెంట్‌ స్కూల్‌ ఉండదు. ఇప్పటికే ఐదేళ్లలో 6 వేల స్కూళ్లను మూసివేసిన పరిస్థితి. టీచర్‌ పోస్టులు భర్తీ చేయని పరిస్థితి. సమయానికి పుస్తకాలు విద్యార్థులకు అందడం లేదు. మధ్యాహ్న భోజన పథకానికి సరుకుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పేదవాడు తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఉండదు. నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీకి రూ. 25 వేలు గుంజుతున్నారు.. ప్రతి ఊర్లలో నారాయణ స్కూళ్లే కనిపిస్తాయి.. పొరపాటున బాబుకు ఓటేస్తే ఎల్‌కేజీ ఫీజులు రూ. లక్ష అవుతాయని ఎవరూ మర్చిపోవద్దు. 

కాలేజీ ఫీజులు భారీగా పెరిగాయి. ఇంజనీరింగ్‌ చదవాలంటే సంవత్సరానికి రూ. లక్ష దాటుతున్నాయి. ఫీజురియంబర్స్‌మెంట్‌ చూస్తే ఇచ్చేది అరకొర మన పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి రూ. 5 లక్షలు బాదుడే... బాదుడు ఉంటుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కరెంటు చార్జీలు బాదుడే.. బాదుడు. ఆర్టీసీ చార్జీలు బాదుడే.. బాదుడు.. పెట్రోల్, డీజిల్‌ రేట్లు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు బాదుడే.. బాదుడు.. మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే వీర బాదుడు ఉంటుందని మర్చిపోవద్దు. 

మీ భూములు, మీ ఇళ్లు ఇవన్నీ ఎప్పుడుబడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి సవరణ చేశాడు. వెబ్‌ ల్యాండ్‌ పేరిట మీ భూముల రికార్డులను ఇప్పటికే తారుమారు చేస్తున్నాడు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓట్లు వేస్తే మీ భూములు, మీ ఇళ్లు ఏవీ మిగలవు.. ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఆయన అత్తగారి సొత్తు అన్నట్లుగా లాక్కుంటాడు. మళ్లీ పొరపాటున చంద్రబాబు ఓటేస్తే.. ఇప్పటికే మీరు చూస్తున్నారు.. అంతంత మాత్రంగానే మన వనరులు ఉన్నాయి. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు ఇప్పటికే సంగం దోచేశారు. మళ్లీ పొరపాటున ఓటు వేస్తే.. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులు, పొలాలు ఏవీ మిగలకుండా దోచేస్తాడని మర్చిపోవద్దు. ఇప్పటికే లారీ ఇసుక రూ. 40 వేలు పలుకుతుంది. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే లారీ ఇసుక రేటు రూ. లక్ష దాటుతుందని మర్చిపోవద్దు.

గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా తయారు చేశాడు. ఇప్పటికే గ్రామాల్లో పెన్షన్‌ కావాలన్నా.. రేషన్‌ కావాలన్నా.. ఇల్లు, మరుగుదొడ్లు కావాలన్నా.. జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీకి ఓటు వేశారని మొదటి ప్రశ్న అడుగుతున్నారు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. మీరు ఏ సినిమా చూడాలో.. మీరు ఏ చానల్‌ చూడాలో.. ఏ పత్రిక చూడాలో.. ఏ ఆస్పత్రికి వెళ్లాలో.. ఏ స్కూళ్లకు వెళ్లాలో.. జన్మభూమి కమిటీలే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రైతులకు ఉచిత విద్యుత్‌ అంతంత మాత్రంగానే.. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు. కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ ఉండదు. 108కి ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌ అని రావాల్సిన అంబులెన్స్‌ వస్తుందో.. రాదో తెలియదు.. మళ్లీ చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే ఆరోగ్యశ్రీ ఉండదు. 108, 104 ఉండదు. 

ఫీజురియంబర్స్‌మెంట్‌ ఇప్పటికే అరకొరగా ఇస్తున్నారు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే ఫీజురియంబర్స్‌మెంట్‌ కూడా ఉండదని ఎవరూ మర్చిపోవద్దు. పక్కా ఇళ్ల విషయం చూస్తున్నారు.. గ్రామాల్లో పది ఇళ్లు కూడా ఇవని పరిస్థితి. పొరపాటున ఓటు వేస్తే పక్కా ఇళ్ల పథకం పూర్తిగా పోతుంది. 

చంద్రబాబు గత చరిత్రను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా.. 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రూ. 2కే కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేదం రెండు హామీలు ఇచ్చారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి రూ. 2 కిలో బియ్యం రూ. 5.25 పైసలకు తీసుకెళ్లాడు. సంపూర్ణ మద్యనిషేదం పూర్తిగా ఎత్తేసిన పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. 

ఎన్నికలు అయ్యేవరకు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుంటారు. ఎన్నికలు అయిపోయిన తరువాత పొదుపు సంఘాలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ పథకం ఇప్పటికే రద్దు చేశాడు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీలు బాదుడే.. బాదుడు. రైతులకు ఇప్పటికే సున్నావడ్డీ పథకం రద్దు చేశాడు. మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అని చెప్పి బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు పూర్తిగా కత్తిరిస్తాడని మర్చిపోవద్దు. ఎన్నిలకు మూడు నెలల ముందు మనందరికీ చంద్రబాబు రకరకాల స్కీములు పెట్టి చూపిస్తున్నాడు.. ఎన్నికలు అయిపోయిన తరువాత పథకాలు, స్కీములు ఉండవని మర్చిపోవద్దు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే తనను వ్యతిరేకించే వారిని ఎవర్ని చంద్రబాబు బతకనివ్వడు. ఇప్పటికే రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు కావాల్సిన వారిని పోలీసులకు పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే మనుషులను చంపించి సీబీఐని, ఈడీని రానివ్వడు. మీడియా పూర్తిగా చంద్రబాబుకు అమ్ముడుపోయింది.. ఇక ఏమి చేసిన రాసేవాళ్లు, చూపేవాళ్లు ఉండరని గుర్తుపెట్టుకోండి. వాళ్లే చంపి మన బంధువులను మనమే చంపామని నెపం మనపై నెట్టేస్తారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు బతికే హక్కు కూడా ఉండదు.. బీసీలకు జడ్జి ఉద్యోగాలు వస్తే చంద్రబాబు ఏకంగా లేఖలు రాశారు కొలీజియమ్‌కు.. బీసీలు జడ్జిలుగా పనికిరారు.. వారికి మైండు సరిగ్గా ఉండదని లేఖలు రాసిన పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే బీసీలు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఉండరు. వీళ్లకు ఎవరికీ ఉద్యోగాలు రానివ్వడని మర్చిపోవద్దు. చంద్రబాబు చివరి మూడు నెలల్లో చూపిస్తున్న సినిమాలు పొరపాటున మీరు నమ్మితే.. మళ్లీ ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నాడు.. పొరపాటున నమ్మితే.. టీవీల్లో ప్రకటనలు చూసి నమ్మితే.. నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మినట్లేనని మర్చిపోవద్దు. మోసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నా.. 

చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టో పెట్టి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తరువాత అధికారంలోకి వచ్చి హామీ చేయలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుందని మర్చిపోవద్దు. చంద్రబాబు మోసాలు, కుట్రలను చూస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేస్తున్నాడో మీకు కనిపిస్తుంది. ఇవాళ యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతుందని మర్చిపోవద్దు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5తో యుద్ధం చేస్తున్నామని మర్చిపోవద్దు. ప్రతి రోజు ఒక పుకారు పుట్టిస్తున్నారు. ప్రతి రోజు ఒక కుట్ర చేస్తున్నారు. పుకార్ల మీద చర్చ పెడుతున్నారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనపై చర్చ జరగనివ్వొద్దని, ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని కుట్ర చేస్తున్నారు. 

ఎన్నికల రోజు చివరకు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు తారాస్థాయికి వెళ్తాయి. ప్రతి గ్రామానికి మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మీరంతా ప్రతి గ్రామంలోకి, ప్రతి వార్డులోకి వెళ్లండి. ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అవ్వాతాతను, ప్రతి అన్నను కలవండి. 

అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. నాలుగు రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. నాలుగు రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

నవరత్నాలతో పేదవాడి జీవితం మారుతుందని, రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నవరత్నాలను ప్రతి గడప దగ్గరకు తీసుకొచ్చి మీ తలుపుతట్టి మీ ఇంటికి అందించేలా చేస్తానని మాటిస్తున్నా.. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వనిత అమ్మను నిలబెడుతున్నాను.. నా చెల్లిని గెలిపించాలని కోరుతున్నాను.  ఎంపీ అభ్యర్థిగా భరత్‌ను నిలబెడుతున్నాను.. నా తమ్ముడిని గెలిపించాలని కోరుతున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. 

తాజా వీడియోలు

Back to Top