తాడేపల్లి: చంద్రబాబు.. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? అని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. రేషన్ డోర్‌డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా?. దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండీయూ ఆపరేటర్లను ఉద్దేశించి నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.. ఎక్స్ వేదికగా వైయస్ జగన్ ఏమన్నారంటే.. ‘చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? అని ప్రశ్నించారు. మరోవైపు వైయస్ఆర్‌సీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా నిన్న మీరుచేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవలకోసం పడ్డ తిప్పలు అన్నీఇన్నీకావు. ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్ షాపులముందు పడిగాపులు పడేవారు. ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీపనులు, ఇతరత్రా పనులు మానుకుని నిరీక్షించేవారు. ఈ క్రమంలో లబ్ధిదారులు వివక్షను, అవమానాలు ఎదుర్కొనేవారు, దోపిడీకి గురయ్యేవారు. సరైన తూకంతో, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడంకూడా మానేశారు. దీనిపై నా పాదయాత్రలో ప్రజలు నా వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.