మీరే నాకు అండ

జమ్మలమడుగు సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టాన్ని చూశా

కార్యకర్త కాలర్‌ ఎగిరేసేలా నాయకుడు ఉండాలి

స్టీల్‌ ఫ్యాక్టరీ వస్తుందని ఎదురుచూస్తున్న వారి ఆశలు విన్నా

వైయస్‌ఆర్‌ హయాంలో దాల్మియా సిమెంట్‌ కంపెనీ తీసుకొచ్చారు

పెన్నా నదిని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దోచేస్తున్నారు

రాజోలు రిజర్వాయర్‌ పనులు ఎందుకు పూర్తి కాలేదు

బాబు డబ్బు మూటలతో వస్తారు..అందరూ అప్రమత్తంగా ఉండాలి

 

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన కుటుంబమైన మీరే నాకు అండ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మహానేత హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వైయస్‌ఆర్‌ మరణంతో అభివృద్ధి ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి దాల్మియా సిమెంట్‌ కంపెనీ తెచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం చంద్రబాబు మూటల కొద్ది డబ్బుతో వస్తున్నారని, ప్రతి ఒక్కరూ  అప్రమత్తంగా ఉండాలని, ఆయన ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఆగితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, నవరత్నాలతో మేలు చేస్తారని ప్రతి ఒక్కరికి చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

  • జమ్మలమడుగు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి ఈ రోజు ఇక్కడ ఉండాల్సింది. కానీ ఆయన లేరు.. ఆయన ఆత్మకు శాంతికలగాలని మనం ఒక్క నిమిషం మౌనం పాటిస్తున్నాం. మీ బిడ్డ కడప బిడ్డ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగాను అంటే మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు నన్ను నడిపించాయని గర్వంగా చెబుతున్నా. ఆ 3648 కిలోమీటర్లలో ప్రతి కష్టాన్ని దారిపొడవునా చూశా.. చెబుతున్న ప్రతి బాధను విన్నా.. సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి వ్యక్తిని కలిశా.. ప్రభుత్వం నుంచి సాయం వస్తుందని ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను చూశా. చెప్పిన ప్రతి కష్టాన్ని విన్నాను. ఆ బాధను చూశాను. ఆవేదనను విన్నాను.. నేను ఉన్నానని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. 
  • గిట్టుబాటు ధరలు రాక, చేస్తానన్న రుణమాఫీ కాక, వడ్డీలకు కూడా సరిపోని రుణమాఫీతో అప్పులు రెట్టింపు అయిన పరిస్థితి చూశా. కరువు వచ్చినా కూడా కనీసం సాయం చేయాలన్న ఆలోచన చేయని ప్రభుత్వాన్ని కూడా చూశా.. ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలు పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఆవేదన చూశా. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ రాక చదువులు ఆపేసిన పిల్లలను చూశా. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ రాక పిల్లలను చదివించడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న తల్లిదండ్రులను చూశా. తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూసి ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశా. 108 రాక, ఆరోగ్యశ్రీ అమలు కాక ప్రాణాలు కోల్పోయిన పేదవాడిని చూశా.. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమై కుర్చీలో నా దగ్గరకు వచ్చి అన్నా.. వేల రూపాయలు మందులకు ఖర్చు అవుతుంది ప్రభుత్వం నుంచి సాయం రావడం లేదు ఎలా బతకాలన్న మాటలు విన్నా.. 
  • 108కి ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ రావడం లేదని, రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని ఆ కుటుంబాలు చెప్పిన బాధలు విన్నా.. మద్యం దుకాణాలు ఎక్కువైపోయి ఆ మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితులు చూశా. ఆ మద్యం షాపులు ఎక్కువైపోయి మొదటి సంతకంతోనే బెల్టుషాపులు లేకుండా చేస్తామన్న చంద్రబాబు హయాంలో ప్రతి వీధి చివర, ప్రతి గుడి పక్కన మద్యం షాపులు ఎక్కువై ఇంట్లో ఆడపిల్లలను సాయంత్రం 7 దాటితే రోడ్డు మీదకు పంపించలేని ఆ అక్కచెల్లెమ్మలు పడిన బాధలు విన్నా. పిల్లలను చదివించడం కోసం కూలీలకు పోతున్న అక్కచెల్లెమ్మల కథలు విన్నా.. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూశా. ఇక్కడే ఇదే నియోజకవర్గంలో నా కళ్ల ఎదుటనే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పిల్లల కథలు విన్నా. ఇదే జిల్లాలో అదిగో కడప స్టీల్‌ ఫ్యాక్టరీ వస్తుందని ఆశపెట్టడం చూశా. ఉద్యోగాలు రాక, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఉద్దేశం కనిపించక ఆ పిల్లలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లే పరిస్థితి చూశా. 
  • దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు చేసిన మంచి గురించి చెప్పుకుంటున్న పరిస్థితులు విన్నా.. నాన్నగారు ఉన్నప్పుడు ఇదే ప్రాంతానికి మంచి చేయడం కోసం దాల్మియా సిమెంట్‌ తీసుకొచ్చారు. పరిశ్రమలు రావాలని, ఉద్యోగాలు కల్పించాలని ఆరాపడిన నాన్న గారి స్వప్నాన్ని చూశా. దాల్మియా సిమెంట్, బ్రాహ్మణి స్టీల్స్‌ భూములు కేటాయించి రూ. 13 వందల కోట్ల పెట్టుబడి పెట్టారు. నాన్న చనిపోయిన తరువాత ఆ బ్రాహ్మణీ స్టీల్స్‌ మూతపడిపోయింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి పిల్లాడి గాథ విన్నా.. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాను.. మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి కూడా చేస్తానని హామీ ఇస్తున్నా. 
  • శనగ పంట ఎక్కువ. గత మూడు సంవత్సరాలుగా శనగ పంటకు రేటు ఎంత. గిట్టుబాటు ధర వచ్చిందా..? శనగకు కనీస మద్దతు ధర రూ. 5200 ఉంటే రైతుకు ఇవాళ రూ. 4 వేలు దక్కే పరిస్థితి లేదు. గత మూడు సంవత్సరాలుగా గోదాములల్లోనే సరుకులు పెట్టి రేటు లేక అమ్ముకోలేక గోదాముల్లోనే సరుకు కుళ్లిపోతుంటే ఆ వడ్డీలు కట్టలేక ఇంట్లో ఆడవాళ్ల తాళిబొట్లను తాకట్టుపెట్టి వ్యవసాయం చేస్తున్న రైతులు బాధలు విన్నా.. ఆ రైతుకు భరోసా ఇస్తున్నాను.. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గోదాముల్లో ఉన్న మొత్తం శనగ పంటను రూ. 6,500 ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నా.. వడ్డీలకు కూడా రాకుండా అవస్థలు పడుతున్న ప్రతి రైతుకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. 
  • ఇదే గండికోట ప్రాజెక్టు వైయస్‌ఆర్‌ కట్టి పోతిరెడ్డిపాడు నుంచి గండికోటకు నీరు రావాలని, కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు మంచి చేయాలని ఎవరూ ధైర్యం చేయని విధంగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల వరద కాల్వలు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టారు. నాన్నగారి హయాంలోనే 85 శాతం కాల్వ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ పనుల అంచనాలను వంద శాతం పెంచి నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు బినామీ సంస్థ సీఎం రమేష్‌ అనే వ్యక్తికి కాంట్రాక్ట్‌ అప్పగించారు. గండికోట ముంపు గ్రామాలు గతంలో ధర్నా చేస్తున్నప్పుడు బాసటగా నిలిచాను. ఆ ముంపు గ్రామాలకు ముష్టివేసినట్లుగా రూ. 6.50 లక్షలు ఇస్తున్నారు. సరిపోదన్నా.. కనీసంరూ. 10 లక్షలైనా కావాలని స్వరాన్ని వినిపించినప్పుడు కనీసం వినలేని స్థితిలో పాలకులు ఉన్నారు. గండికోట బాధితుడికి చెబుతున్నా.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీరు అడిగిన రూ. 10 లక్షలు ఇస్తానని హామీ ఇస్తున్నా.. 
  • ఐదేళ్లుగా మైలవరం రిజర్వాయర్‌ను చూస్తున్నారు. రిజర్వాయర్‌కు చివరి ఆయకట్టుకు నీరు రాని పరిస్థితి కనిపిస్తుంది. పెన్నా నదిలో ఇష్టం వచ్చినట్లుగా ఇసుకను దోచేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇంకా మంచి చేయాలని 2008లో నాన్నగారు రాజోలి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇదే నియోజకవర్గం నుంచి మన పార్టీలో గెలిచి ఫిరాయించిన తరువాత మంత్రి అయ్యాడు. ఆ రాజోలి రిజర్వాయర్‌ పనులు అయ్యాయా అని అడుగుతున్నా.. ఆ రిజర్వాయర్‌ గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. ఎంతసేపు లంచాలు ఎలా తినాలనే ఆరాటం తప్ప.. ఏ రోజూ వీరికి ప్రజల మీద ధ్యాస లేదు. ఐదేళ్లు రాజోలి రిజర్వాయర్‌ను పట్టించుకోకుండా ఎన్నికలకు ఒక నెల ముందు చంద్రబాబు వచ్చి టెంకాయి కొట్టిపోతున్నాడు. వీళ్లు చేస్తున్న అన్యాయాలు గమనించాలని కోరుతున్నాను. 
  • జమ్మలమడుగు ప్రాంతంలో చేనేత కార్మికులు కూడా ఎక్కువ. ఆ ప్రతి చేనేత కార్మికుడిని అడుగుతున్నా.. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారా.. నూలు సబ్సిడీ రావడం లేదు. ఎన్నికల వేళ చేనేతలకు సంబంధించి మేనిఫెస్టోలో ఒక పేజీ కేటాయించాడు. చేనేతలకు చేసిన హామీలు.. రుణాలు మాఫీ అన్నాడు.. ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇంటితో పాటు షెడ్‌ ఇస్తానన్నాడు. చేనేతలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. నేను ఇవాళ హామీ ఇస్తున్నా.. మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలతో జరిగే ప్రతి మేలు మీ అందరికీ తెలుసు. మగ్గం ఉండే ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ. 24 వేలు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇస్తున్నా.. 
  • ఇదే నియోజకవర్గంలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఎక్కువ. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. బాధితులకు మేలు చేసేందుకు కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చారా.. కనీసం అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన మంత్రులు, బినామీలు అగ్రిగోల్డ్‌ ఆస్తులను మింగేస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్షరాల బాధితుల కోసం రూ. 1150 కోట్ల మొదటి బడ్జెట్‌లోనే పెడతానని హామీ ఇస్తున్నా. 13 లక్షల మందికి వెంటనే మేలు జరుగుతుందని భరోసా ఇస్తున్నా. మిగిలిన వారికి తోడుగా ఉండే ప్రతి కార్యక్రమం చేస్తాం. 
  • ఇదే నియోజకవర్గంలో కేశవరెడ్డి బాధితులు కూడా ఎక్కువే. కేశవరెడ్డి అడ్డగోలుగా పిల్లల తల్లిదండ్రుల నుంచి చదువుల పేర్లుచెప్పి లక్షల రూపాయలు డిపాజిట్లు సేకరించి ఎగనామం పెట్టి ఆ తల్లిదండ్రులను పూర్తిగా ఇబ్బందులు చేసిన పరిస్థితులు మనకు తెలుసు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో కేశవరెడ్డి లాంటి వ్యక్తి అడ్డగోలుగా మోసం చేస్తే కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డిని మంత్రిగా ఎలా చేశారని ప్రశ్నిస్తున్నా.. ఈ ప్రతి బాధ, ప్రతి కష్టం నేను చూశాను. మీ అందరికీ హామీ ఇస్తున్నాను.. నేను ఉంటాను. మీ అందరికీ మేలు చేస్తానని హామీ ఇస్తున్నా.. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మనం చూసిందేమిటని గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ మోసం.. మోసం అనే పదాలే కనిపిస్తాయి. చంద్రబాబు పాలనలో అబద్ధం, అవినీతి, అధర్మం, అరాచకాలు కనిపిస్తాయి. 
  • గత 20 రోజులుగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో గమనించండి.. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని మర్చిపోవద్దు. చంద్రబాబుతో ఒక్కరితోనే కాదు.. అమ్ముడుపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో, అమ్ముడుపోయిన ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని మర్చిపోవద్దు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ప్రతి రోజు ఒక పుకారు పుట్టిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనపై ప్రజలు ఆలోచన చేయకూడదని, చర్చ జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఈ కుట్రలు ఇంకా ఎక్కువైపోతాయి. ఎన్నిక రోజు వచ్చే సరికి ప్రతి గ్రామానికి మూటల మూటల డబ్బులు పంపిస్తారు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అప్రమత్తంగా ఉండాలని మీ అందరినీ వేడుకుంటున్నా.. మీరంతా మీ గ్రామాల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి అవ్వాతాతలను కలవండి. 
  • ఈ నియోజకవర్గం గురించి మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకే కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకే కుటుంబం ఉండేది.. వీరిద్దరూ ఒకరినొకరు చంపుకున్నారు. వీరిద్దరి వల్ల ప్రతి గ్రామంలో కక్షలు పుట్టాయి. ఈ రోజు వారి రాజకీయ స్వార్థం కోసం ఇద్దరూ ఒక్కటయ్యారు. నాన్న ఇచ్చిన నా కుటుంబం మాత్రం నాకు అండగా ఉంది. ఈ వ్యవస్థ మారాలి. రాజకీయాల్లో ఊసరవెల్లితనం పోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. పలానా వాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసుకొని చెప్పుకునే విధంగా నాయకుడు ఉండాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే నాకు మీ అందరి అండదండలు కావాలి. నాకు మీ అందరి దీవెనలు కావాలి. మిమ్మల్ని నమ్ముకొని ఎలక్షన్స్‌ చేస్తున్నాయి. అందుకే డాక్టర్‌ను తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాను.. సుధీర్‌రెడ్డి మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. మీ ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు వైయస్‌ అవినాష్‌రెడ్డిని నిలబెడుతున్నాను.. యువకుడు, ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు వీరిద్దరిపై ఉంచాలని పేరు పేరునా ప్రార్థిస్తున్నాను. 
Back to Top