విశాఖపట్నం: ఎన్నికల మందు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నమ్మించి, అధికారంలోకివచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మా వల్లే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోందని చెబుతున్న కూటమి నేతలు... విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి ఉంటే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని సవాల్ విసిరారు. ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు, విశాఖ వేదికగా ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేవరకు కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలతో కలిసి పోరాటం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని కేకే రాజు స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● ప్రయివేటీకరణ దిశగా కేంద్రం అడుగులు: కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు తియ్యని మాటలతో రాష్ట్ర ప్రజలను, ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలను, కార్మికులను మోసం చేస్తూ అబద్దపు హామీలిచ్చారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కానివ్వమని హామీ ఇచ్చారు. మాకు ఓట్లేసి గెలిపిస్తే.. మమ్నల్ని అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపిస్తే.. సొంత గనులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సొంతగనులు కేటాయించేలా చేస్తామని నమ్మబలికారు. కానీ ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులకి మడుగులొత్తుతూ కార్మికు సంఘాలకి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్న సుమారు లక్ష కుటంబాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. స్టీల్ ప్లాంటుకు ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టి.. ఆ ప్యాకేజీ పేరుతో తీసుకొచ్చిన రూ.11,400 కోట్లలో ఇప్పటివరకు రూ.8,500 కోట్లు ఇచ్చారు. దాన్ని కూడా ప్లాంటు అభివృద్ధికి వినియోగించకుండా.. గతంలో ప్లాంటుకు జీఎస్టీ, ఇతర అవసరాలకు, బెదిరించి వీఆర్ ఎస్ తీసుకునేలా చేసిన ఉద్యోగులకు వెచ్చించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నమ్మకం ఉంటే.. ఉత్తరాంధ్ర వాసుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకించాలి. కేంద్ర ప్రభుత్వం మా వల్లే నడుస్తోందని చెప్పుకుంటున్నారు... ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రజలకు చేసిన వాగ్ధానాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీల ద్వారా కేంద్రానికి మద్ధతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేస్తే... కచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగుతుంది. ఈరోజు ఏపీలో గెలిచిన ఎంపీలు కేంద్రానికి మద్ధతు ఉపసంహరించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మరి ఎందుకు మీరా పని చేయడం లేదు? ● మా ప్రభుత్వ హాయంలో ప్లాంట్ కోసం పోరాటం: జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లూ...రాష్ట్ర ప్రజలు, కార్మిక సంఘాలను మమేకం చేస్తూ చేసిన పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ దిశగా వేసిన ప్రతి అడుగును అడ్డుకున్నారు. విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఇదే అంశంపై కార్మిక సంఘాల అఖిల పక్షంతో సమావేశమై వారు చెప్పిన సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ... అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. ఆ తర్వాత ప్రధానిని కూడా కలిసి విశాఖ స్టీల్ ను ప్రయివేటైజేషన్ చేయవద్దని విజ్ఞప్తి చేయడంతో పాటు స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి గట్టెక్కించి బయటకు తీసుకురావడానికి నిపుణులు, మేధావులు చెప్పిన మార్గాలను కూడా కేంద్రానికి నివేదించారు. ప్రయివేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. 2019-24 వరకు మాకున్న ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేకపోయినా.. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో పాటు ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి, ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాల నాయకులను, ఉత్తరాంధ్రా మేధావులను, ప్రజా సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంలో ఉన్న పెద్దలను కలిసేలా చేసి, జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసి మా వాణిని వినిపించాం. ● వేలాది రైతుల త్యాగం ఉక్కు పరిశ్రమ: విశాఖ ఉక్కు కోసం సుమారు 20 ఏళ్లు పోరాటం చేయడంతో పాటు 32 మంది అసువులు బాసి సాధించుకున్న చరిత్ర ఉక్కు పరిశ్రమది. అలాంటిది ఇవాళ 32 విభాగాలను ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తుంటే.. ఈ ప్రాంతంలో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రా ప్రజలకు నష్టం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందన్న ఆలోచన మీకుంటే తక్షణమే ఈ 32 విభాగాల ప్రయివేటీకరణను రద్దు చేయించండి. 64 గ్రామాలకు చెందిన 16,500 మంది రైతులు 22 వేల వ్యవసాయ భూమిని స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశారు. వారిలో భూమిలిచ్చిన 8వేల మంది రైతులకు ఉద్యోగాలివ్వకుండా ఇప్పటికీ అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 14,500 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,700 మందిని తొలగించారు. మొదటి విడతలో వీఆర్ ఎస్ కు సంబంధించి 1150 మంది శాశ్వత ఉద్యోగులను తొలగిస్తే.. రెండో విడతలో మరో 1017 మందిని వీఆర్ ఎస్ ద్వారా తొలగించేందుకు సిద్దంగా ఉన్నారు. దీనికితోడు మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. 2024 జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకివస్తే అదే ఏడాది సెప్టెంబరు నుంచి హెచ్ ఆర్ ఏ ఇవ్వలేదు. ఎల్ టీ సీ, ఎల్ ఎల్ టీసీ కూడా లేదు. ఉద్యోగులు తీసుకున్న రుణ బకాయిలు రూ.150 కోట్లు ఉంటే అవి కూడా చెల్లించడం లేదు. సీఎస్ ఆర్ నిధులతో నడిచే విమల విద్యాలయాన్ని కూడా మూసివేసారు. స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో అత్యంత దౌర్భాగ్య పరిస్ధితులున్నాయి. ఎవరు వెళ్లినా ప్రయివేటు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. మెడికల్ బిల్లులు చెల్లించడం లేదు. గతంలో యూనిట్ కు రూ.60 పైసలు ప్లాంట్ క్వార్టర్స్ లో ఉన్న ఉద్యోగులు చెల్లిస్తే.. దాన్ని ఇప్పుడూ యూనిట్ ధర రూ.8 చేశారు. అంటే నేరుగా పొమ్మనే పొగపెడుతున్నారు. టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు మాట్లాడుతూ... మేం కేంద్రంలో పోరాటం చేస్తున్నాం, ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని ప్రగల్భాలు పలికారు. 1991 లో స్టీల్ ప్లాంట్ ప్రారంభం అయినప్పటి నుంచి.. ప్లాంట్ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన 70 క్యాంటీన్లను అర్ధాంతరంగా విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసి క్యాంటీన్లు నడవకుండా నిలిపివేశారు. ఇవాళ ఉదయం స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఉన్న కూల్ డ్రింక్ షాపులు, టీ షాపులు తొలగించారు. ప్రయివేటీకరణను అడ్డుకోకపోగా... మేం ఏం చేసినా భరించాలని కూటమి ప్రభుత్వం అణిచివేస్తోంది. కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. గత పది రోజులగా ఒడిషా, చత్తీస్ ఘడ్, బెంగాల్ నుంచి 1450 మంది అన్ స్కిల్డ్ వర్కర్స్ ని తీసుకొచ్చి, స్కిల్డ్ వర్కర్స్ స్ధానంలో నియమించారు. ● మా డిమండ్ ఒక్కటే: మేం ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రా వాసులు మిమ్నల్ని చీకొట్టకముందే, మీకు చీము నెత్తురు ఉంటే, ఉత్తరాంధ్రా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న స్పృహ ఉంటే, ఉక్కు ప్రయివేటీకరణ జరిగితే ఆర్ధికంగా, సామాజికంగా ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఆలోచన ఉంటే.. తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. 32 విభాగాల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకొండి. ఎన్నికల మందు వాగ్దానం చేసినట్లు స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలా చేయండి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తరహాలోనే అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించండి. స్టీల్ ప్లాంట్ ఆర్ధిక పరిస్థితిని సమూలంగా సరిదిద్దాలంటే ప్లాంట్ రుణాలపై వడ్డీల భారాన్ని తగ్గించి, బ్యాంకులకు కట్టాల్సిన రుణాలను ఈక్విటీలగా మార్చాలంటూ నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలన చేయాలి. ప్లాంట్ స్వయం సమృద్ధి సాధించడానికి సొంత గనులు కేటాయించడంపై నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల స్టీల్ ప్లాంట్ కు నిరంతరాయంగా ముడిసరుకు సరఫరా అవుతుంది. ప్లాంట్ స్వయం సమృద్ధి సాధించడానికి వీలుంటందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంలో సెయిల్ వద్ద వచ్చే 200 ఏళ్లకు సరిపడా ఖనిజ నిల్వలున్నాయి. దేశంలో దాదాపు ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులున్నాయి. విశాఖ ఉక్కుకు మాత్రమే గనులు లేవు. మనం ఇలా చూస్తూ ఉంటే ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయడమే కాకుండా ప్లాంట్ భూములను కూడా ప్రయివేటు వ్యక్తులకు ధారపోస్తారనడంలో ఆశ్చర్యం లేదు. ● పోరాటంలో భాగమవ్వండి - ప్లాంట్ ను కాపాడండి: మేం ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. స్టీల్ ప్లాంట్ 20 ఏళ్ల పోరాటం, 32 మంది బలిదాన ఫలితం. ఉత్తరాంధ్రా ప్రాంత ప్రజల భవిష్యత్తు అయిన విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా, ప్రభుత్వాలకు తొత్తులగా కాకుండా ఐక్యతతో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం కార్మిక సంఘాలతో కలిసి నిర్మాణాత్మక ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తాం. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించేవరకు మా పోరాటం కొనసాగుతుందని కేకే రాజు స్పష్టం చేశారు.