చంద్రబాబు దత్త పుత్రుడు పవన్‌

ఐదేళ్లు ఆహార దీక్షలు చేసి.. ఐదు గంటలు నిరాహార దీక్షలా?

మరో 25 ఏళ్లు వైయస్‌ జగనే సీఎం  

వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

విశాఖ: చంద్రబాబు దత్త పుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ అని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పవన్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని గుర్తు చేశారు. 2014లోనే ఈ దత్తపుత్రుడు చంద్రబాబుకు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లు ఆహార దీక్షలు చేసిన లోకేష్‌..ఇవాళ ఐదు గంటల పాటు నిరాహారదీక్షలు చేశారని దుయ్యబట్టారు. లోకేష్‌ దీక్షలతో ఎలాంటి ఫలితం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో 25 ఏళ్ల పాటు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని   విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఉత్తరాంధ్రకు మంచి రోజులు రాబోతున్నాయని, విశాఖ జిల్లాకు మహర్దశ పట్టబోతుందని చెప్పారు. విశాఖ నగరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని విమర్శించారు. రూ.68 వేల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. ఐదేళ్లలో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారని, అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున అప్పులు మిగిల్చారని విమర్శించారు. విశాఖలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లు నిర్వహించి, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని నమ్మించారని ధ్వజమెత్తారు.   ఈ సమ్మిట్ల ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయని లేఖ రాశానని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ నగరాన్ని  అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ అభివృద్ధి వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు. విశాఖకు పరిశ్రమలు తీసుకువస్తామని, జిల్లాకు మహర్దశ పట్టబోతుందని పేర్కొన్నారు. పోలవరం నుంచి విశాఖకు నీరు తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు రాబోతున్నాయని చెప్పారు. ఉద్యోగానికి, సంస్కృతిక రంగానికి విశాఖ కేంద్ర బిందువు కాబోతుందన్నారు. గతప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అక్రమాలపై విచారణ చేపడుతామని, సిట్‌ సభ్యులను ఇప్పటికే నియమించామని చెప్పారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా నాలుగు మాసాల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు.  విశాఖ భూ కుంభకోణంపై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ తన నివేదికను బయట పెట్టలేదన్నారు. టీడీపీ నేతలను కాపాడే విధంగా వాస్తవాలు కప్పిపుచ్చారని మండిపడ్డారు. వాస్తవాలు వెలికితీసి, దోషులను శిక్షించేలా కొత్తగా సిట్‌ ఏర్పాటు చేసి తమ ప్రభుత్వం విచారణ పరిధిని పెంచే ఆలోచనలో ఉందన్నారు. విశాఖలో భూములపై సిట్‌ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.  భూ కుంభకోణంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 

Read Also: ప్రతీ ఇంటికీ అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

Back to Top