విజయనగరం: చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎస్.కోటకు ఏం చేశారో చెప్పగలరా అని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మీడియా సమావేశంలో మాట్లాడారు. గత రెండు రోజులుగా టీడీపీ నేత నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మోసపూరిత అబద్ధపు మాటలతో పర్యటించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ఐదు సంవత్సరాల తమ ప్రభుత్వంలో ఎస్.కోట నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ పనులు చేసామనే పరిస్థితులు లేవు. ఈ ప్రాంతాన్ని నాడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, నేడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. సాగునీటిపరంగా, తాగునీరు పరంగా రైతాంగాన్ని, ప్రజలను ఆదుకున్న ఘనత వారిదే అన్నారు. గిరిజన యూనివర్సిటీ స్థల సేకరణ, రైతులకు చెల్లింపు చేసిన ఘనత వైయస్ జగన్ గారిది అని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఎస్ కోట ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు.
కబడ్డీ పోటీలు ప్రారంభం
విజయనగరం రాజీవ్ క్రీడా మైదానం ఇండోర్ స్టేడియంలో విజయనగరం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని సరదాగా వారితో కాసేపు కబడ్డీ ఆడి ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, SAAP సీఈవో, పిడిలు, కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.