పేదలకు నాణ్యమైన వైద్యమే లక్ష్యంగా సంస్కరణలు

నాడు–నేడుతో ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం

ఆధునిక వైద్య పరికరాలను సమకూరుస్తున్నాం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని

తాడేప‌ల్లి: వైద్య, ఆరోగ్య రంగంలో సంచలన మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తోందని ఆ శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా, సులువుగా అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. సచివాలయంలో గురువారం ఆమె ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంస్కరణల్లో భాగంగా వైద్య శాఖలో నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని 10,032 వైయ‌స్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు, 528 వైయ‌స్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు, 1,125 పీహెచ్‌సీలు, 168 ఏపీవీవీపీ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ చేస్తున్నామని చెప్పారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, 13 వైద్య కళాశాలల ఆధునికీకరణ, ఐదు చోట్ల ట్రైబల్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, కడపలో క్యాన్సర్, మెంటల్‌ హెల్త్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకు రూ.16,252 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

విలేజ్‌ క్లినిక్‌లు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఐదు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఆధునికీకరణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా పరికరాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. విశాఖ కేజీహెచ్‌కు సీటీ, ఎమ్మారై యంత్రాలను అతి త్వరలో అందజేస్తామన్నారు. కాకినాడ, కర్నూలు జీజీహెచ్‌లకు వీలైనంత త్వరగా క్యాత్‌ ల్యాబ్‌ను సమకూరుస్తామన్నారు.

కోవిడ్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచేందుకు రూ.130 కోట్లు ఖర్చు చేశామని మంత్రి రజని చెప్పారు. అలాగే అర్బన్‌ హెల్త్, విలేజ్‌ క్లినిక్‌లకు రూ.220 కోట్లతో వైద్య పరికరాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలు జీజీహెచ్‌లో క్యాన్సర్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.90 కోట్ల విలువైన పరికరాలను సమకూరుస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖరరెడ్డి, ఎండీ మరళీధర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Back to Top