కాకినాడ: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడి, ఫర్నీచర్ దహనం అత్యంత హేయమైందని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఖండించారు. కృతిమ వివాదాన్ని సృష్టించి, మహిళల పేరుతో నాలుగు రోజులుగా రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న టీడీపీ ప్రభుత్వం, సాక్షి మీడియా గ్రూప్ టార్గెట్‌గా చేస్తున్న పనులు అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా ఆఫీసులపై దాడి చేసిన పచ్చమూకలు మరో అడుగు ముందుకేసి, ఏకంగా పత్రికా కార్యాలయాన్నే తగలబెట్టడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.`ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసిన పచ్చమూకలు, ఆఫీసులో ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని సోఫా సెట్లు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యాయి. అక్కడే ఉన్న భవనం యజమాని కారు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. మొత్తం ఈ అనైతిక చర్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం, ప్రమేయం ఉంది. ఒక వ్యూహం ప్రకారం లేని వివాదాన్ని సృష్టించడంతో పాటు, అక్రమ కేసులు బనాయించి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా సాక్షి మీడియా గొంతు నొక్కాలని కుట్ర చేశారు. అందులో భాగంగానే ఈ దాడులు. దహనాలు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వైఖరి మార్చుకోవాలి` అని కన్నబాబు హెచ్చరించారు.