వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేయడంలో దేశంలోనే ఏపీని ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిపారని అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్ కొనియాడారు. విద్యా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలనూ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రీఫ్‌మెన్ తన ఫేర్‌వెల్ విజిట్‌లో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అమెరికా–ఆంధ్ర సంబంధాలు మెరుగుపర్చే విషయంలో అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సర్కార్‌కు, అమెరికన్ కాన్సులేట్‌కు మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం కృషిని కొనియాడారు. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలనూ మెచ్చుకున్నారు. ఆంధ్ర–అమెరికాల మధ్య పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించారు. విశాఖకు అద్భుత అవకాశాలు.. దేశంలోని గొప్ప నగరాలలో ఒకటిగా రూపొందేందుకు విశాఖపట్నానికి అద్భుత అవకాశాలున్నాయని ముఖ్యమంత్రితో జోయల్ రీఫ్‌మెన్ ప్రస్తావించారు. బలహీనవర్గాలకు 50 శాతానికి పైగా ప్రాధాన్యతనివ్వడాన్ని, అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేయడాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన ప్రశంసించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, పాఠశాల విద్యపై సీఎం తీసుకున్న ప్రోత్సాహక చర్యలను జోయల్ రీఫ్‌మెన్ అభినందించారు. విశాఖపట్నంలో అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించే విషయంలో యూఎస్ కాన్సుల్ జనరల్‌కు సీఎం జగన్ అందించిన సహాయానికి రీఫ్‌మెన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక.. దాని పనితీరుపై సంతోషం వ్యక్తంచేశారు. తన మూడేళ్ల పదవీకాలంలో నాలుగుసార్లు సీఎంను కలిసి వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఇవ్వడాన్ని బట్టి ఆంధ్ర–అమెరికా సత్సంబంధాల విషయంలో సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేక చొరవను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఎం. హరికృష్ణ పాల్గొన్నారు.