కృష్ణా మిగులు జలాల్లో ఏపీ, తెలంగాణ వాటాలు తేలుస్తాం

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: కృష్ణా నది మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి స‌హాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్ట్‌లలో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్ధిష్టమైన విధానం రూపకల్పన చేసే బాధ్యతను కేఆర్ఎంబీ రివర్ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ)కి అప్పగించినట్లు తెలిపారు.
వర్షాకాలంలో కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌ల నుంచి విడుదలయ్యే మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు చెందిన సాంకేతిక సంఘాన్ని తమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని కేంద్ర‌మంత్రి చెప్పారు. 

అయితే ఉభయ రాష్ట్రాలు దీనికి సంబంధించిన అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో సాంకేతిక సంఘం తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఒక నీటి సంవత్సరంలో కృష్ణానదిలో లభించే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్‌ ట్రైబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కల్పించింది. మిగులు జలాల వినియోగం తప్ప వాటిపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉండబోదని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్ట్‌ల వారీగా కేటాయింపులు చేసేందుకు కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పొడిగించడం జరిగిందని కేంద్ర‌మంత్రి వివరించారు.

తాజా వీడియోలు

Back to Top