శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని భక్తులకు చూపండి

మీడియా సెంటర్‌ ప్రారంభోత్సవంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసారమాధ్యమాలు, పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చూపాలని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మీడియా ప్రతినిధులను కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన మంగ‌ళ‌వారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ ఏడాది అధిక సంఖ్య‌లో విచ్చేసే  భక్తులకు సేవలందించేందుకు అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి మూలవిరాట్‌ దర్శనంతోపాటు వాహన సేవల దర్శనం కల్పించేందుకు అన్ని ర‌కాల వీఐపీ, దాతలు, ఆర్జిత సేవలు, రూ.300 దర్శనాలు కూడా ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం ధ్వ‌జారోహ‌నం సంద‌ర్భంగా రాష్ట్ర  ప్ర‌భుత్వం త‌రుఫున ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌వారికి పట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని చెప్పారు. అదేవిధంగా దాత‌ల స‌హ‌కారంతో రూ.23 కోట్ల‌తో నిర్మించిన ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని బుధ‌వారం ఉద‌యం ముఖ్య‌మంత్రి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. మీడియా సెంటర్‌లో భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఫ్యాక్స్‌, టెలిఫోన్‌ వసతి కల్పించామని, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు.

Back to Top